చికెన్‌, మటన్‌కు గిరాకీ

ABN , First Publish Date - 2020-03-30T10:28:52+05:30 IST

చికెన్‌ తింటే కరోనా వైరస్‌ సోకుతుందని(అపోహతో) రెండు నెలల నుంచి చికెన్‌కు ఆమడ దూరంలో ఉండే ప్రజల్లో ఒక్కసారిగా మార్పు వచ్చిందా!? ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమ్మకాలు లేక వెలవెలబోయిన చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద ఈ ఆదివారం జనం బారులు తీరి కనిపించారు.

చికెన్‌, మటన్‌కు గిరాకీ

దుకాణాల వద్ద బారులుతీరిన కొనుగోలుదారులు

ఉత్తరాంధ్రలో ఆరు లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు

కిలో రూ. 180 నుంచి రూ.200లకు విక్రయం

మటన్‌ రూ.800 నుంచి రూ.900...


విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): చికెన్‌ తింటే కరోనా వైరస్‌ సోకుతుందని(అపోహతో) రెండు నెలల నుంచి చికెన్‌కు ఆమడ దూరంలో ఉండే ప్రజల్లో ఒక్కసారిగా మార్పు వచ్చిందా!? ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమ్మకాలు లేక వెలవెలబోయిన చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద ఈ ఆదివారం జనం బారులు తీరి కనిపించారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని దాదాపు అన్ని మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ సూచనలు, హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. కరోనా వైరస్‌ సంగతి అటుంచి, అసలు మనకు చికెన్‌/ మటన్‌ దొరుకుతుందా? అని క్యూలో నిల్చున్నవారు అతృత చెందారు.


ఆదివారం ఉత్తరాంధ్రలో ఆరు లక్షల కేజీల చికెన్‌ అమ్మకం జరిగిందని కోళ్ల పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. దీనిలో మూడున్నర లక్షల కిలోల చికెన్‌ ఒక్క విశాఖ నగరంలోనే విక్రయించినట్టు చెప్పారు. కాగా గత ఆదివారం కిలో రూ.100 వున్న చికెన్‌... ఈ ఆదివారం రూ.180 నుంచి రూ.200లకు విక్రయించారు. కోళ్ల కంపెనీల రేటు మాత్రం రూ.140 నుంచి రూ.160 కాగా.... రిటైలర్లు మాత్రం ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. విశాఖ నగరంలో మటన్‌కు కూడా గిరాకీ పెరగడంతో కొన్నిచోట్ల కేజీ రూ.800 నుంచి రూ.900కు విక్రయాలు చేపట్టారు. విశాఖ నగరంలో చేపల విక్రయాలు భారీగా సాగాయి. ఫిషింగ్‌ హార్బర్‌కు కొనుగోలుదారులు పోటెత్తారు. దీంతో పోలీసులు రంగంలోకిదిగి, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అయితే చేపల అమ్మకాల స్టాల్స్‌ వద్ద ‘సామాజిక దూరం’ పాటించకుండా కొనుగోలుదారులు గుంపులు గుంపులుగా చేరారు. 

Updated Date - 2020-03-30T10:28:52+05:30 IST