Abn logo
May 14 2021 @ 03:35AM

ఉపాధి హామీ పనులకు డిమాండ్‌

కరోనా తీవ్రత ఉన్నా ఈ పనులకే  అధికారుల మొగ్గు


హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌) పనులకు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు సన్నగిల్లుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం, అధికారులు సైతం ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించుకుని, పనులకు రావాల్సిందిగా కూలీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా ఏప్రిల్‌ ఒక్క నెలలోనే ఉపాధి హామీ పనులు 2.2 కోట్ల పనిదినాలను దాటాయి. ఈ పథకంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ర్టానికి 13 కోట్ల పని దినాలు కేటాయించారు. ఏప్రిల్‌లోనే 2.2 కోట్లకు పైగా పనిదినాలు జరిగాయి. ఈ పనుల విలువ రూ.420 కోట్లకుపైనేనని తెలిసింది. కరోనాతో పట్టణ ప్రాంతాల్లో ఉపాధి మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో పట్టణాల్లో దినసరి కూలీపై జీవనం సాగించే పేదలు మళ్లీ ఊరి బాట పట్టారు. ఇలాంటి వారికి కూడా ఉపాధి హామీ పనులే శరణ్యమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 15 లక్షల కుటుంబాల వారు ఉపాధి హామీ పనులు చేసినట్లు సమాచారం. నిరుడు కూడా తొలుత 13 కోట్ల పనిదినాలనే కేటాయించారు. లక్ష్యం ముందుగానే పూర్తవడంతో 15.50 కోట్ల పనిదినాలకు పెంచారు.