ఆరుతడి పంటలకు డిమాండ్‌

ABN , First Publish Date - 2021-10-13T05:20:47+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటలకు డిమాండ్‌ పెరిగింది. ఆరుతడి పంటల విస్తీర్ణం తక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు కారణమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

ఆరుతడి పంటలకు డిమాండ్‌

పెసర పంటకు అత్యధికంగా

ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదల కారణం


సూర్యాపేట సిటీ: ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటలకు డిమాండ్‌ పెరిగింది. ఆరుతడి పంటల విస్తీర్ణం తక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు కారణమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆరుతడి పంటల్లో పెసరకు కొంతకాలంగా భారీగా ధర పలుకుతోంది.



ఉమ్మడి జిల్లాలో పెసరకు రికార్డుస్థాయి ధర పలుకుతోంది. తక్కువ విస్తీర్ణంలో పెసర సాగు కావడం, దానికితోడు పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు అధికంగా కురవడంతో దిగుబడి తగ్గింది. చేతికి వచ్చిన కొద్ది పంటను మార్కెట్లకు తీసుకెళ్తే ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పెసలకు క్వింటాకు రూ.7,589 రికార్డుస్థాయి ధర పలికింది. కొద్దిరోజులుగా పెసరకు వ్యాపారులు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పేట మార్కెట్‌లో ఈ-నామ్‌ విధానం ద్వారా సీక్రెట్‌ టెండర్‌ నడుస్తోంది. దీంతో ఒక ఖరీదుదారుడు ఎంతమేర ధర నిర్ణయిస్తున్నారనే విషయం మరో ఖరీదుదారుడికి తెలిసే అవకాశం ఉండదు. దీంతో పోటీతత్వం పెరిగి ధరలు పెరిగాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పెసలకు మద్దతు ధర రూ.7,459 ఉండగా, కనిష్ఠ ధర రూ.3,129, మోడల్‌ ధర రూ.5,359గా ఉంది.


పంటల సాగు తగ్గడంతో..

పెసర, కంది, వేరుశనగ పంటలు సాగు చేసిన రైతులకు వ్యవసాయ మార్కెట్లలో అధిక ధరలు వస్తుండటంతో వరి సాగు చేసిన రైతులు నిట్టూరుస్తున్నారు. ఎక్కువ మంది రైతులు వరి సాగుకు మొగ్గుచూపడంతో ఉమ్మడి జిల్లాలో అపరాల సాగు తగ్గింది. ఈ ఏడాది సూర్యాపేట జిల్లాలో పెసర 12,867 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, 4,394 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కంది 24,257 ఎకరాలకు, 9,229 ఎకరాల్లో, వేరుశనగను 3,331ఎకరాలకు కేవలం 1009 ఎకరాల్లో మాత్రమే సాగైంది. యాదాద్రి, నల్లగొండ జిల్లాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మూడేళ్లుగా, ఉమ్మడి జిల్లాలో అపరాల సాగు తగ్గుతూ వస్తోంది. సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో అపరాలకు బదులు రైతులు వరివైపు మొగ్గుచూపుతున్నారు. వరికి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగుచేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నా రైతులు మాత్రం వరిపైనే ఆసక్తి చూపారు. కేవలం కొద్దిమంది రైతులు మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేయగా, వాటికి మద్దతు ధరకు మించి వ్యాపారులు చెల్లిస్తున్నారు. వరి పంటకు మాత్రం మార్కెట్లలో మద్దతు ధరకంటే తక్కువ లభిస్తోంది. తాజా పరిస్థితులను గమనించి రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాలని, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కందులకు మద్దతు ధర క్వింటాకు రూ.6,300 ఉండగా, వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7,000 వరకు చెల్లిస్తున్నారు. పెసరకు మద్దతు ధర రూ.7,275 ఉండగా, రూ.7,000 నుంచి రూ.7,400 వరకు ధర పలుకుతోంది. వేరుశనగకు మద్దతు ధర రూ.5,550 ఉండగా, రూ.6,000 నుంచి రూ.6,500 వరకు వ్యాపారులు చెల్లిస్తున్నారు.


ఈ-నామ్‌తోనే అధిక ధరలు : ఎండి.ఫసియుద్దీన్‌, సూర్యాపేట మార్కెట్‌ కార్యదర్శి

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్‌ విధానం అమలవుతుండటంతో అపరాలకు వ్యాపారులు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. ఆన్‌లైన్‌ టెండర్‌ విధానంలో ఒక ఖరీదుదారుడు ఎంత ధర నిర్ణయించాడనే విషయం మరో ఖరీదుదారుడికి తెలియదు. అపరాల దిగుబడి తక్కువ ఉండటం వల్ల వ్యాపారుల మధ్య పోటీపెరగడంతో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి.


Updated Date - 2021-10-13T05:20:47+05:30 IST