సన్నాలకు డిమాండ్‌

ABN , First Publish Date - 2021-04-11T08:26:14+05:30 IST

రాష్ట్రంలో సన్న ధాన్యం ధర ఒక్క సారిగా పెరిగింది. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లర్లు పోటీ పడి మరీ కొంటున్నారు.

సన్నాలకు డిమాండ్‌

  • అధిక ధరకు కొంటున్న మిల్లర్లు
  • క్వింటాల్‌కు రూ.2,250-2,300పైనే
  • కనీస మద్దతు ధర కంటే చాలా ఎక్కువ
  • తేమ శాతం ఎక్కువ ఉన్నా.. ఆగని జోరు
  • యాసంగిలో సాగు తగ్గడమే కారణం


గత 2 సీజన్లలోనూ ఎక్కువే

యాసంగి సీజన్‌లో సన్నాల సాగు, దిగుబడి తక్కువైనా ధర ఎక్కువగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో పోలిస్తే క్వింటాలుకు సగటున రూ.200-300 ఎక్కువే ఉంటోంది. ఈ యాసంగి సీజన్‌లో ఎక్కువ ఉన్నట్లుగానే గడిచిన రెండు యాసంగి సీజన్లలో కూడా సన్నాల ధర ఎక్కువగా ఉంది. నిరుడు యాసంగిలో క్వింటాలుకు రూ.2,000 నుంచి రూ.2,100 పలికింది. రెండేళ్ల క్రితం రూ.1,900 నుంచి రూ.2,000 ధర సన్నాలకు ఉండటం గమనార్హం. 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సన్న ధాన్యం ధర ఒక్క సారిగా పెరిగింది. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లర్లు పోటీ పడి  మరీ కొంటున్నారు. తేమ వంటి నిబంధనలను సైతం పక్కన పెట్టి.. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) కన్నా ఎక్కువ పెట్టి, వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు సేకరిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా గడిచిన వానాకాలం సీజన్‌లో దిగుబడి తగ్గిపోవడం ఒక కారణమైతే, ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా యాసంగిలో సన్నాల సాగు విస్తీర్ణం లేకపోవడం మరో కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని సన్న ధాన్యాన్ని సేకరించేందుకు మిల్లర్లు పోటీపడుతున్నారు. దీంతో సన్నాలు పండించిన రైతుల ఇంట సిరుల వర్షం కురుస్తోంది. ఈ యాసంగి సీజన్‌లో 52.76 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 1.38కోట్ల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి అవుతుందనేది వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో దొడ్డు రకం 1.17 కోట్ల టన్నులు కాగా.. సన్నాలు 21 లక్షల టన్నుల దాకా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నిజానికి గత సీజన్‌ వరకు సన్నాలకు పెద్దగా భరోసా ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ. 1,868గా ఉంది. ఏ- గ్రేడ్‌ రకానికి రూ.1,888గా ఽధర నిర్ణయించారు. సన్నరకం ధాన్యానికి నిర్ణీత ధర అంటూ లేదు. గడిచిన వానాకాలం సీజన్‌లో సన్నాలు ఎక్కువ సాగుచేయాలని, క్వింటాల్‌కు వంద-నూటయాభై ఎక్కువ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అదే జరిగి ఉంటే.. సన్నాలకూ ఓ ధర ఉండేది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో.. మిల్లర్లు మార్కెట్లో డిమాండ్‌ ఉంటే ధర పెంచడం.. లేకుంటే క్వింటాల్‌కు రూ. 1,500-1,600 చొప్పున ధరలు నిర్ణయించిన పరిస్థితులు కూడా ఉన్నాయి.


వచ్చింది.. వచ్చినట్లే కొనుగోలు

నిజానికి యాసంగి సీజన్‌లో సన్నాల సాగు తక్కువగా ఉంటుంది. వానాకాలంలో ఉత్పత్తి తగ్గటం, సన్న బియ్యం వినియోగం పెరగటం, యాసంగిలో సాగు, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో.. సన్న ధాన్యం డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్లు సన్న బియ్యం స్టాకు అందుబాటులో లేదు. దీంతో.. మిల్లర్లు సన్నబియ్యం సేకరణపై దృష్టిసారించారు. జైశ్రీరాం, హెచ్‌ఎంటీ వెరైటీలకు.. క్వింటాకు రూ. 2,250 నుంచి రూ. 2,300కు చెల్లిస్తున్నారు. నాణ్యత బాగుంటే రూ.2400 చెల్లించేందుకూ వెనుకాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉండటానికి వీలులేదు. ఒకవేళ తేమ ఎక్కువగా ఉంటే మిల్లర్లు తిరస్కరిస్తారు. ఇప్పుడు మాత్రం.. రైస్‌మిల్లర్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తేమ 24- 25% ఉన్నా.. ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధరకు వరి ధాన్యం కొంటున్నారు. హార్వెస్టర్లతో వరి కోతలు కోయటం, వెంటనే ధాన్యాన్ని బస్తాల్లో నింపడంతో వడ్లు ఎండే పరిస్థితిలేదు. అయినా.. మిల్లర్లు కొర్రీలు పెట్టకపోవడం రైతులకు గొప్ప ఉపశమనమే. సన్నాలకు పెరిగిన డిమాండ్‌పై తెలంగాణ రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్‌తో ‘ఆంధ్రజ్యోతి’ మాట్లాడగా.. వానాకాలం సన్నాల దిగుబడి తగ్గి పోవటంతో, ఇప్పుడు డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇవే ధరలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు. ఒక్క మిర్యాలగూడ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రోజుకు 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అవుతోందని వివరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి కర్ణాటకలోని రాయ్‌చూర్‌ తదితర ప్రాంతాలకు కూడా సన్నబియ్యం సరఫరా అవుతోందన్నారు.


ఈ సారి పూర్తి భిన్నంగా..

మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తూ.. ప్రతి సీజన్‌లో మిర్యాలగూడ, కోదాడ, బాన్సువాడ ప్రాంతాల రైతులు అధికంగా సన్నాలను పండించేశారు. ఈ సారి.. నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా జైశ్రీరాం, హెచ్‌ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా.. తదితర సన్న రకాలు సాగుచేశారు. గత వానాకాలం సీజన్‌లో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని.. దిగుబడి బాగా పడిపోయింది. సన్నధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. వానాకాలంలో 52.78 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 1.32 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్సహించింది. కానీ వానల దెబ్బకు.. తెలంగాణ సోనా లాంటి వెరైటీలు సాగుచేసిన రైతులకు ఎకరానికి సగటున 10 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. గరిష్ఠంగా ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొత్తంమీద గడిచిన వానాకాలంలో సుమారు 53 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.

Updated Date - 2021-04-11T08:26:14+05:30 IST