2050 నాటికి 15 కోట్ల మంది అన్నీ మరచిపోతారట.. చైనా పరిశోధనల్లో వెల్లడైన ఆశ్చర్యకర వివరాలు!

ABN , First Publish Date - 2021-12-11T15:05:06+05:30 IST

కళ్లలో ఏర్పడే అనారోగ్య సమస్యలు..

2050 నాటికి 15 కోట్ల మంది అన్నీ మరచిపోతారట.. చైనా పరిశోధనల్లో వెల్లడైన ఆశ్చర్యకర వివరాలు!

కళ్లలో ఏర్పడే అనారోగ్య సమస్యలు జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కంటి చూపు తగ్గిన బాధితులలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం క్రమంగా తగ్గే అవకాశాలున్నాయని తేలింది. ఈ పరిశోధనలను చైనాకు చెందిన గ్వాంగ్‌డాంగ్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ చేపట్టింది. వృద్ధాప్యంలో వచ్చే కంటి వ్యాధులు.. జ్ఞాపకశక్తి క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. 12,364 మంది వృద్ధులపై ఈ పరిశోధన జరిగింది. కళ్లు.. మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించే దిశగా ఈ అధ్యయనం జరిగింది. ఈ పరిశోధనలో 55 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 12,364 మంది పాల్గొన్నారు. వృద్ధాప్యంలో వచ్చే కంటి వ్యాధుల కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ముప్పు పెరుగుతుందని ఈ పరిశోధన నివేదిక వెల్లడించింది. 


కంటి రోగులలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 26 శాతం వరకు ఉంటుదని,  అలాగే మధుమేహంతోపాటు కంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో 61 శాతం మందికి మతిమరపు వచ్చే అవకాశం ఉందని వెల్లడయ్యింది. అయితే కంటి సమస్యలకు.. జ్ఞాపకశక్తికి గల సంబంధం ఏమిటో స్పష్టంగా వెల్లడికాలేదని పరిశోధకులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ వృద్ధులకు కంటిచూపు తగ్గడం మొదలవుతుంది. ఫలితంగా వారి మెదడులో చురుకుదనం తగ్గిపోయి, స్నేహితులు, కుటుంబ సభ్యుల ముఖాలను సరిగ్గా గుర్తించలేకపోతుంటారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ప్రచురితమైన ఈ పరిశోధన వ్యాసంతో తెలిపిన వివరాల ప్రకారం.. UKలో ప్రతి ఏటా 65 ఏళ్ల వయస్సులో 50 శాతం మంది కంటి శుక్లం సమస్యతో బాధపడుతున్నారు. 40 వేల మంది మాక్యులర్ డీజెనరేషన్‌తో బాధపడుతున్నారు. కళ్లలో ఏదో ఒక సమస్య ఉండి మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్న బాధితులకు డిమెన్షియా( జ్ఞాపకశక్తి కోల్పోవడం) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2050 నాటికి డిమెన్షియా రోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మూడు రెట్లు పెరుగుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ బాధితుల సంఖ్య 15 కోట్లకు పైగా పెరుగుతుందని వారంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 10 మిలియన్ల కొత్త డిమెన్షియా కేసులు నమోదవుతున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల నూతన పరిశోధన ప్రకారం 2050 నాటికి, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా 60.2 మిలియన్ కేసుల పెరుగుదలను నియంత్రించవచ్చు. 2019లో డిమెన్షియా రోగుల సంఖ్య 5 కోట్లకు పైగా ఉంది. వచ్చే మూడు దశాబ్దాల తర్వాత ఈ సంఖ్య 15 కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-12-11T15:05:06+05:30 IST