Abn logo
Nov 28 2020 @ 01:22AM

భ్రష్టబాటలో ప్రజాస్వామ్యం

పాలనలో మార్మికతను పెంచి, ప్రజల ప్రజాస్వామ్య వ్యక్తీకరణకు ఏ దారీ లేకుండా చేయగలిగితే, అబద్ధాలు, అప్రధాన విషయాల చుట్టూ మనుషులను తిప్పుతూ సమాజంపై గుత్తగా ఒకే ఆధిపత్య వర్గం, ఒకే పార్టీ అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చని అధికారంలో ఉన్న వారి వ్యూహం. దీనిని మొదలుపెట్టింది కేంద్రంలోని బిజెపి. ఎక్కువ సమయం తీసుకోకుండా, విషయాన్ని ఇట్టే గ్రహించి స్థానికంగా అమలు చేస్తున్నది కేసీఆర్. వీరిద్దరూ అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని నిరర్థకం చేస్తున్నారు.


సమాజంలో వివక్షకు, దోపిడీకి, అణచివేతకు గురయ్యే బలహీనుల హక్కుల కోసం మాట్లాడటమే మానవహక్కుల వేదిక కార్యాచరణ. ఇరవై రెండేళ్లుగా ఏ రకమైన రాజకీయ లక్ష్యాలతో సంబంధం లేకుండా పూర్తిగా హక్కుల రంగానికే కట్టుబడి మానవహక్కుల వేదిక పనిచేస్తోంది. ఈ మధ్యకాలంలో మా లాంటి స్వతంత్ర సంఘాల పట్ల పెరిగిపోతున్న పాలకుల నిరంకుశ దోరణులను, వాటి విపరిణామాలను విజ్ఞుల దృష్టికి తేవడం అత్యవసరం.


నవంబర్ రెండో తేదీన ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయం, తాడ్వాయిలో నలుగురు మావోయిస్ట్ సానుభూతిపరులను పట్టుకున్నామని, వారు ఇచ్చిన సమాచారం ప్రకారం మరింత మంది నిషేధిత మావోయిస్ట్ పార్టీకి సహకరిస్తున్నారని పేర్కొంటూ వివిధ చట్టబద్ధ సంఘాలలోని 17 మంది కార్యకర్తల జాబితా విడుదల చేసింది. మొత్తం ఈ 21 మందిపై తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా, తెలంగాణ ‘ప్రజా భద్రత’ చట్టంతో పాటు అనేక ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మిగతా వారి వ్యక్తిగత వివరాలు మాకు తెలియదు కానీ ఈ జాబితాలో మానవహక్కుల వేదికకు చెందిన ముగ్గురు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. వారు ఆత్రం భుజంగరావు, ఆత్రం సుగుణ, కనకా వెంకటేశ్వర్లు. ముగ్గురూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు. సామాజిక నేపథ్యం రీత్యా గోండీ ఆదివాసులు. ఇరవై ఏళ్లుగా ఆదివాసుల జీవితాల్లో మెరుగుదల కోసం ప్రజాస్వామికంగా తమ గొంతు వినిపిస్తున్నారు. ఇన్నేళ్ల సామాజిక జీవితాచరణలో వారెన్నడూ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ హింసలో భాగం కాలేదు, దానిని ప్రేరేపించలేదు. ఎంతగానో వెనుకబడిన, తోటి ఆదివాసీ జాతిని ప్రేమించటం, ఏం ఆశించకుండా వారికి అండగా ఉండటం, ప్రజాస్వామ్య పరిధిలో వారి హక్కుల రక్షణ కోసం పని చేయడమే నేరమైతే, అది తప్ప వారింకే నేరమూ చేయలేదు. వారు చేసినట్టు పోలీసులు మోపిన నేరారోపణ ఏ ఆధారం లేనిది, పూర్తిగా దురుద్దేశంతో కూడినది. 


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మూడు ఎన్‌కౌంటర్లపై నిజనిర్ధారణకు వెళ్తున్న ఐదుగురితో కూడిన మానవహక్కుల వేదిక బృందాన్ని అక్టోబర్ నాలుగో తేదీనన పోలీసులు (ఫోన్ ట్యాపింగ్‌తో సేకరించిన సమాచారంతో) ఇల్లందు పొలిమేరలో అదుపులోకి తీసుకుని మారుమూల భోడు పోలీస్‌స్టేషన్లో సాయంత్రం వరకు నిర్బంధించారు. ఆరోజు ఎన్‌కౌంటర్లపై విచారణకు వెళ్లకుండా మమ్మల్ని ఆపటమే కాక, పోలీసుల విధి నిర్వహణకు అడ్డుపడినట్టు మాపైనే సెక్షన్ 151కింద కేసు నమోదు చేశారు. ఎన్‌కౌంటర్లపై నిజనిర్ధారణకు వెళ్ళడాన్ని కూడా నేరంగా మార్చివేశారు.


అక్టోబర్ 21వ తేదీ, బుధవారం ఉదయం హన్మకొండలోని అన్ని ప్రజాసంఘాల కార్యకర్తలను, ప్రజాస్వామికవాదుల్ని ఇళ్ళల్లో నుంచి తీసుకువచ్చి వివిధ పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు. అందులో మానవహక్కుల వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి బదావత్ రాజు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన ములుగు ఎన్‌కౌంటర్‌ను ఒకానొక ప్రజాసంఘం హైదరాబాద్‌లో పత్రికాముఖంగా ఖండించాలని అనుకుంటోందని తెలిసి దాన్ని ఆపడానికి పోలీసులు ఇలా చేశారట. నవంబర్ 23న విశాఖపట్నంలోని మా ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు విఎస్ కృష్ణతో సహా మొత్తం 64 మందిపై ఉపా చట్టం కింద కేసు మోపారు. 2007లో 11 మంది ఆదివాసీ స్త్రీలపై 21 మంది స్పెషల్ పార్టీ పోలీసులు సామూహిక అత్యాచారం చేసిన కేసు ఇప్పుడు తుదిదశకు వచ్చింది. వాకపల్లి అత్యాచార బాధిత మహిళలకు అండగా ఉంటూ 13 ఏళ్లుగా ఆ కేసు వీగిపోకుండా మానవహక్కుల వేదిక, ప్రత్యేకించి విఎస్ కృష్ణ సర్వశక్తులూ ఓడ్డుతున్నారు. ఆ కేసులో పోలీసులకు శిక్షలు పడేలా చేసి తద్వారా మొత్తం పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగానే మావోయిస్టులతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాడని నిర్దిష్టంగా కృష్ణ గురించి ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. ఒక్కరోజు తేడాతో నవంబర్ 24న కృష్ణ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దగ్గర ఒక నక్సలైట్‌తో కలిసి హింసాత్మక చర్యలకు పాల్పడుతూ దొరికినట్టు మరో పచ్చి బూటకపు ఉపా కేసు నమోదు చేశారు. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖాదర్ బాబాపై 2019 డిసెంబర్‌లో పెట్టిన తప్పుడు ఉపా కేసు అలాగే ఉంది.


ఇక, కొన్ని నెలల కింద ప్రభుత్వం నిషేధించాలని భావిస్తున్న సంఘాల జాబితాలో ఎప్పుడూ లేని విధంగా మానవహక్కుల వేదికను కూడా చేర్చిన విషయం పై పరిణామాలకు పునాది అని ఇప్పుడు అనుకోవాలి. ఒక్క మానవహక్కుల వేదిక అని మాత్రమే కాదు, ఏ సంఘం చట్టబద్ధ కార్యక్రమాలనైనా జరగనివ్వకపోవటం ప్రజాస్వామ్య పాలన కాదు. రాజ్యం, నక్సలైట్ల మధ్య జరిగే హింస, ప్రతిహింసల విషయం కాసేపు అలా ఉంచుదాం. మూడేళ్ల కింద హైదరబాద్‌లో ‘నిరుద్యోగుల జాక్‌’(jac) ఒక నిరసన కార్యక్రమం నిర్వహించబోతుంటే, పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఆ ‘జాక్’లో భాగస్వామ్య సంఘాలుగా ఉన్న వాటి సభ్యులనందరినీ పట్టుకెళ్ళి ఆయా పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు. ఈ నవంబర్ 26న రాజ్యంగ దినోత్సవం సందర్భంగా వరంగల్ విద్యాకమిటీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వబోతున్నారని తెలిసి ప్రముఖ రచయిత్రి కాత్యాయని విద్మహేతో సహా నలుగురు ప్రముఖ విద్యావేత్తలను ఆ రోజు తెల్లవారుజామునే ఇళ్ళల్లో నుంచి తీసుకెళ్ళి పోలీస్‌స్టేషన్లలో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరు నిరసన కార్యక్రమం నిర్వహించబోతున్నా ఇదే తంతు. ఈ చర్యలకు ఎలాంటి చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధత లేదు. ప్రజలు హింసతో కూడిన పోరాటాలకు దూరమవుతున్నారు. కానీ, పాలకులు మాత్రం ప్రజల చిన్నచిన్న ధిక్కారాలను, నిరసనలను సైతం అతి శిక్షలు, అణచివేత, అరెస్టులు, కేసులు, జైళ్లు, బూటకపు ఎన్‌కౌంటర్ల వంటి హింసాయుత మార్గాల ద్వారానే అదుపులో ఉంచాలనుకుంటున్నారు.


ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు, వ్యక్తుల మధ్యన అన్ని విషయాల్లోనూ సమానత్వ ప్రాతిపదికన కొనసాగే సంబంధం. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వం అనేది ఒక అంగమే గానీ అదే సుప్రీం కాదు. రాజ్యాంగ సమానత్వ సూత్రాలే సుప్రీం. కానీ, ఈరోజు రాష్ట్రంలో, దేశంలో పాలకులు తమ సంకుచిత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పోలీసులు, ఇతర కార్యనిర్వహక వర్గమంతా రాజ్యాంగబద్ధంగా కాక పాలకమన్యులకు నచ్చినట్టు ఉండటమే తమ డ్యూటీ అనుకుంటున్నారు. న్యాయవ్యవస్థ సహా రాజ్యాంగ సంస్థలన్నీ వాటి ప్రత్యేక అధికారాలను కోల్పోయి కార్యనిర్వహక శాఖ స్థాయికి దిగజారుతున్నాయి. పాలనలో మార్మికతను పెంచి, ప్రజల ప్రజాస్వామ్య వ్యక్తీకరణకు ఏ దారీ లేకుండా చేయగలిగితే, అబద్ధాలు, అప్రధాన విషయాల చుట్టూ మనుషులను తిప్పుతూ సమాజంపై గుత్తగా ఒకే ఆధిపత్య వర్గం, ఒకే పార్టీ అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చని అధికారంలో ఉన్న వారి వ్యూహం. దీనిని మొదలుపెట్టింది కేంద్రంలోని బిజెపి. ఎక్కువ సమయం తీసుకోకుండా, విషయాన్ని ఇట్టే గ్రహించి స్థానికంగా అమలు చేస్తున్నది కేసీఆర్. వీరిద్దరూ అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, పెంచుకుందాం అనే వారిని నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో నియంతృత్వం, దేశంలో ఫాసిజం పూర్తి రూపం తీసుకుంటున్నాయి.


ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమాజం ఎక్కడికి వెళ్తుందనే ప్రశ్న ప్రతి పౌరుడు వేసుకోవాల్సిన అవసరం పెరుగుతున్నది. డా. అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రసంగిస్తూ భారత్ వంటి దేశంలో కొత్తగా నెలకొన్న ప్రజాస్వామ్యం తన రూపురేఖలను నిలబెట్టుకోవడం సాధ్యమయినట్లే, మున్ముందు నియంతృత్వానికి చోటివ్వడం కూడా సాధ్యమేనని, అలా కాకుండా చూ‍సుకోవాలని హెచ్చరించారు. ఏది నిజం కాకూడదని ఆయన హెచ్చరించారో అదే నిజమవుతున్నది.


డా. ఎస్ తిరుపతయ్య, (మానవ హక్కుల వేదిక)


Advertisement
Advertisement
Advertisement