ప్రజాస్వామిక పట్టాభిషేకాలు!!

ABN , First Publish Date - 2021-01-28T09:52:54+05:30 IST

పోయినసారి ఎన్నికలప్పుడు, వద్దంటున్నా వినకుండా తొంభైరెండేళ్ల కరుణానిధి చక్రాల కుర్చీలోనే ప్రచార పర్యటనలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే...

ప్రజాస్వామిక పట్టాభిషేకాలు!!

పోయినసారి ఎన్నికలప్పుడు, వద్దంటున్నా వినకుండా తొంభైరెండేళ్ల కరుణానిధి చక్రాల కుర్చీలోనే ప్రచార పర్యటనలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే, కుమారుడు స్టాలిన్ ను ముఖ్యమంత్రి చేస్తారా అని అడిగితే, అట్లా ఎందుకు అనుకుంటున్నారు, ప్రకృతి నన్నేదైనా చేస్తే తప్ప, నేనే కొనసాగుతాను-.. అన్నారాయన. అప్పటికి అరవై దాటాయి, ఈ ఎన్నికలకు డెబ్భయికి దగ్గర అవుతున్నాడు స్టాలిన్, ఇంకా నిరీక్షణ లోనే ఉన్నాడు. అట్లాగని, కరుణానిధికి పుత్రప్రేమ లేదని కాదు. ఢిల్లీలో ఉండి పార్టీ వ్యవహారాలు చూసుకోవయ్యా అంటే రాష్ట్రంలోనే నాయకుడినవుతానని ఉత్సాహపడినందుకే కదా, కరుణానిధికీ, వైగోకీ పొరపొచ్చాలు వచ్చింది! నలభై అయిదేళ్ల కిందట ఎమర్జెన్సీలో పోలీసుహింసలు అనుభవించిన దగ్గర నుంచి రాజకీయాల్లో తండ్రి దగ్గర అప్రెంటిస్ గా స్టాలిన్ కొనసాగుతున్నాడు. చెన్నై మేయర్ గా ఎన్నికై మంచి పేరు తెచ్చుకున్నాడు. 2006 నుంచి అయిదేళ్ల పాటు సాగిన డిఎంకె పాలనలో, కొంతకాలం ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు, పదవితో నిమిత్తం లేకుండా ‘వాస్తవ’ ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. అంతటి శిక్షణ తరువాత కూడా తండ్రికి సొంతంగా పదవీప్రేమ తగ్గలేదో, కుమారుడి మీద పూర్తి విశ్వాసం కలగలేదో, చనిపోయేదాకా తానే కొనసాగాలని కోరుకున్నాడు. సరే, ఆ ఎన్నికల్లో జయలలితే గెలిచి, తండ్రీకొడుకులకు ప్రతిపక్షమే దక్కింది. 


ద్రావిడ రాజకీయాల కోవకే చెందుతానని చెప్పే మరో పార్టీ రంగంలో ఉండడం వల్ల కరుణానిధి ఎప్పుడూ జాగ్రత్తగా, సమర్థతతో వ్యవహరించవలసి వచ్చింది. మరోవైపు తన సంతానం మధ్యనే సయోధ్య లేకపోవడం వల్ల ప్రత్యర్థి అవకాశం తీసుకునే వీలుంది. ఈ కారణాల వల్ల, కుమారుడిని ఆయన శిక్షణలో కొనసాగించాడని భావించవచ్చు. కరుణ కుమారుడన్నది తప్పనిసరిగా ఒక సానుకూలతే కానీ, దానితో పాటు ద్రావిడ ప్రాంతీయ రాజకీయాల అనుభవం ఉంటేనే, ప్రజామోదం లభిస్తుంది. ప్రశాంత్ కిశోర్ సలహాల వల్లనో, హిందూవ్యతిరేక నాస్తిక పార్టీ అన్న పేరు పలచబరుచుకోవాలనో తెలియదు కానీ, ఈ మధ్య స్టాలిన్ తన పార్టీ కార్యకర్తలు బహుకరించిన సుబ్రహ్మణ్యస్వామి శూలాన్ని స్వీకరించడమే కాక, ఫోటోలకు పోజులు కూడా ఇచ్చాడు. దాని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. దొంగభక్తి అది నమ్మవద్దు అని బిజెపి నాయకులు అంటే, ఏమిటీ దిగజారుడు అని తీవ్ర తమిళవాదులు అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలలాగా కాదు, అక్కడ, ప్రజలందరూ ఆస్తికులుగానే ఉంటారు, కానీ, ద్రావిడ నాయకులు నాస్తికులుగా ప్రవర్తించకపోతే ఇష్టపడరు. అంటే, వారసత్వంతో పాటు, ఎంతో కొంత సిద్ధాంతాలు కూడా ఒంటబట్టించుకోకపోతే చెలామణి కావడం కష్టం. 


వారసులు దీర్ఘకాలం బెంచి మీద కూర్చోవడం జాతీయ పార్టీలో కూడా చూడవచ్చు. వారసత్వ రాజకీయాలు వదిలి ప్రజాస్వామికంగా మెలగండయ్యా అని ఎమర్జెన్సీ కాలం నుంచి కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, విమర్శకులు బుద్ధిచెబుతూనే ఉన్నారు. రాజీవ్ గాంధీ మరణం తరువాత, వెనువెంటనే వారసత్వానికి ఆస్కారం లేని పరిస్థితి నెలకొన్నది. వారసులు మైనర్లుగా ఉంటే, వారికి ఒక సంరక్షకుడిని నియమించి, యుక్తవయస్సు వచ్చాక పరిపాలన అప్పగించే పద్ధతి బ్రిటిష్ వారు స్వదేశీరాజ్యాల విషయంలో అనుసరించేవారు. అట్లాగే, కాంగ్రెస్‌లోనూ వారసుడు చేతికి వచ్చేదాకా సంరక్షకులుగానో, నామమాత్రులుగానో పదవికి కాపుగాసే ప్రయత్నం జరిగింది. తీరా, యువరాజు ఎదిగివచ్చి కూడా బెదిరిపోతూ కాలయాపన చేస్తున్నాడు. కుటుంబపాలన వద్దో అని మొత్తుకున్న పెద్దమనుషులే, ఇప్పుడు వారసుడు రాడేమని విరహపడవలసివస్తున్నది. అవసరమైనంత వేగంగా, ఆశించినంత సమర్థంగా వారసుడు ఎదిగిరానందుకు చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. వారసుడు లేని పార్టీని భవిష్యత్తు లేని పార్టీగా చూస్తారు. నాయకులు ఎందరైనా ఉండవచ్చును, వారసులు మాత్రం కుటుంబంలోనుంచే వస్తారు. 


కుమారుడికి అధికారం అప్పగించి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పక్కకు తప్పుకుంటారని నెలరోజులుగా ఎడతెగకుండా వినపడుతున్నది. అశ్వముఖతః ఎటువంటి నిర్ధారణ లేదు కానీ, అదే సమయంలో ఖండన కూడా లేదు. తేదీలు, ముహూర్తాలు, మంత్రివర్గాలు కూడా గుప్పుగుప్పు మంటున్నాయి. చక్కగా ఆరోగ్యంగా ఉన్న చంద్రశేఖరరావుకు ఇప్పుడే వానప్రస్థంలోకి వెళ్లవలసిన అవసరం ఏముంది, మరేదైనా బాధ్యత చేపడతారనుకోవడానికి అవకాశం మాత్రం ఏమున్నది-.. అని సందేహాలు వినిపిస్తున్నాయి కానీ, లోగుట్టు ఏమిటో తెలియదు. దశాబ్దాల తరబడి వారసులు నిరీక్షిస్తుండగా, అధికారం దక్కి ఆరేడేళ్లే అయిన సందర్భంలో కెటిఆర్ కు మాత్రం తొందరెందుకు? ఈ ప్రశ్నలను చర్చిస్తున్నామంటే, కెటిఆర్ యోగ్యతలను సంశయిస్తున్నామని కాదు. కార్యదక్షత, వక్తృత్వం, ఆధునిక సాంస్కృతిక, జీవన రంగాలలో సమర్థంగా మెలగగలిగిన వ్యక్తిత్వం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వనరులను సమీకరించగలిగిన సామర్థ్యం-.. అన్నీ ఉన్న వ్యక్తి కెటిఆర్. రాజకీయంగా ఇంకా అనుభవం పెరగవలసి ఉన్నది కానీ, అధికారం చేతిలోకి వస్తే అదే సమకూరుతుందని అనుకోవచ్చు కూడా. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రసమితిలో మరెవరికీ యోగ్యతలు లేవని కాదు. అవకాశం కెటిఆర్‌కు మాత్రమే ఉన్నదని గమనించాలి. 


నిజానికి జగన్మోహన్ రెడ్డి త్వరత్వరగా పదవులను చేపట్టాలని బాగా ఆత్రపడ్డారని చెబుతారు. కాంగ్రెస్ లో నాయకత్వ అవకాశం కోసం పాతికేళ్లకు పైగా ఓపికగా నిరీక్షించి, అందుకోసం తనను తాను తీర్చిదిద్దుకున్న రాజశేఖరరెడ్డికి కొడుకు తొందరపాటు నచ్చలేదని, అందుకే ఆయనను సాధ్యమైనంతగా నిరుత్సాహపరిచారని అంటారు. దురదృష్టవశాత్తూ, రాజశేఖరరెడ్డి అకాలమరణం చెందారు. అంత దుఃఖ సమయంలోనూ, తన వారసత్వ అవకాశాన్ని వెంటనే నెరవేర్చుకోవాలని జగన్ ప్రయత్నించారు. అప్రదిష్ట తెచ్చిన ఆ ప్రయత్నం నెరవేరకపోగా, సొంతపార్టీ పెట్టుకుని, పదేళ్ల పాటు నానాకష్టం పడితే కానీ, అధికారం దక్కలేదు. రాజశేఖరరెడ్డి స్మృతి ఏ మాత్రం మసకబారకుండా, కాపాడుకుంటే తప్ప వారసుడిగా చెల్లుబాటు కాబోమని, ఆయన తనయుడిగా తప్ప తనకు మరో గుర్తింపు లేదని జగన్‌కు తెలుసు. వైఎస్ వారసత్వంలో పోటీ వచ్చినప్పుడు జగన్‌కు తలనెప్పులు తప్పవు.


ఏదో ఒక సిద్ధాంతంతోనో, వాదంతోనో మొదలైన ప్రాంతీయ పార్టీలు కానీ, పెద్దగా సిద్ధాంతమేదీ లేకుండా కాంగ్రెస్, జనతాదళ్ నుంచి చీలిపోయి ఏర్పడిన వైసిపి, బిజూ జనతాదళ్, జనతాదళ్ (ఎస్), తృణమూల్ కాంగ్రెస్ వంటివి కానీ ఏకవ్యక్తి కేంద్రితాలుగా పరిణమించాయి. ఆ వ్యక్తికి కుటుంబం ఉంటే, అవి కుటుంబ కేంద్రితాలుగా మారిపోతాయి. వారసత్వం అంటే కేవలం కుమారులో కుమార్తెలో కానక్కరలేదు. ఎంజిఆర్ కు వారసురాలిగా జయలలితను అంగీకరించారు. జయలలితకు వారసురాలిగా శశికళనో దినకరన్ నో అంగీకరించవచ్చు. 


సైద్ధాంతిక ప్రాంతీయ పార్టీలు వ్యక్తికేంద్రితంగా మారిపోవడానికి కారణం ఏమిటి? సిద్ధాంతాలు పలచబారడమే. సిద్ధాంతాల వాదాల అలల మీద తేలివచ్చిన నేత, ఇతరులు కూడా అదే తరహాలో ఎదిగిరాకుండా జాగ్రత్త పడతాడు. తెలంగాణ రాష్ట్రసమితి మొదటి దఫా పాలనలో, తెలంగాణ ఉద్యమ క్రమంలో పనిచేసిన వివిధ శక్తులను ఎట్లా తన ఆవరణ వెలుపలికి చెదరగొట్టారో చూడవచ్చు. అనేకమంది పదవీ కోసమూ, పదవి లభించినవారు దాన్ని వాస్తవంగా వినియోగించగలిగే అవకాశం కోసమూ నిరీక్షణలో పడిపోయారు. ప్రత్యేక రాష్ట్రం వల్ల, ఉద్యమ పార్టీ ప్రభుత్వంలోకి రావడం వల్ల తెలంగాణకు ఎంతో కొంత ప్రయోజనం కూడా సమకూరింది. నిజమే. అయితే, క్రమంగా ఆ పార్టీ ఉద్యమపార్టీ కాకుండా పోయింది. ఉద్యమవిలువలకు, ఉద్యమసమాజానికీ జవాబుదారీగా ఉండకూడదనుకున్నది. ఉద్యమబలం స్థానంలో, వ్యక్తిగత ఆకర్షణ, జనరంజకత నెలకొల్పాలనుకున్నది. ఫలితంగా, పార్టీ నేతల మధ్య రాజకీయమైన, ఉద్యమ ఉద్వేగపూరితమయిన అనుబంధం కాక, హెచ్చుతగ్గుల అంతరాలు ఏర్పడ్డాయి. దాత, గ్రహీత సంబంధం కూడా వచ్చి చేరింది. నాయకుడు తన చుట్టూ ఇనుపతెర బిగించుకున్నాడు. పార్టీలో పరిస్థితికి తగ్గట్టు, ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయ రాహిత్యంతో, ఆచరణవైకల్యంతో కునారిల్లిపోయింది. వందలాది నిర్ణయాలు, లక్షలాది ఫైళ్లు గాఢనిద్రలో పడిపోయాయి. 


ఈ నేపథ్యంలో, కెటిఆర్ బాధ్యతలు తీసుకుంటే, నిజంగానే మెరుగుదల ఉంటుంది. ఫామ్ హౌస్ పాలన ఉండదు. ప్రజలకు, సహచరులకు బహుశా ఈయన అధికంగా అందుబాటులో ఉంటారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఏదో ఒక వ్యవస్థను అనుమతిస్తారు. యువకుడు కావడం వల్ల, కొంత చురుకుదనం, స్నేహశీలత ప్రదర్శిస్తారు. అయితే, ఏదన్నాసమస్య వచ్చినప్పుడల్లా, తన ప్రభావవంతమైన ప్రసంగంతో ప్రజలకు ఒక నిర్దేశాన్ని ఇవ్వగలిగిన శక్తి కెసిఆర్ కు ఉన్నది. కెటిఆర్ అటువంటి సంక్షోభ పరిష్కారం చేయగలరా? రాజకీయ అవసరాల కోసమే కావచ్చు, ప్రజల మనసు తాకే మాటలు చెప్పగలరా? కెటిఆర్ ఆధునిక విద్యావంతుడు. ఈ తరానికి సంబంధించిన పరిమితులు కూడా ఆయనలో కనిపిస్తాయి. కెసిఆర్ ఎంతటి రాచపోకడలో పోయినా, ఆయనది రాజకీయాల సరళి. కెటిఆర్ ది బ్యూరోక్రటిక్ వైఖరి. గత ఇరవై సంవత్సరాలలో కెసిఆర్ తీసుకున్న అనేక నిర్ణయాల విషయంలో, కెటిఆర్ భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారని అంటారు. ఎవరితోనూ పేచీ లేకుండా ఆచరణాత్మకంగా ముందుకు వెళ్లాలని కెటిఆర్ అనుకుంటారట. తెలంగాణ ఉద్యమక్రమంలో రూపొందిన కొన్ని ప్రాధాన్యాలను, వాదనలను కెటిఆర్ పెద్దగా పట్టించుకుంటారో లేదో తెలియదు. 


ఇన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు, ఒకే ఒక్క ప్రశ్న మరుగున పడుతున్నది. మిగతా దేశమూ, అనేక రాష్ట్రాలూ, ప్రాంతీయ జాతీయ పార్టీలూ సరే...తెలంగాణ సమాజం సంగతేమిటి? ఇక్కడ కూడా అంతేనా? ప్రపంచాన్నే మారుస్తామని విప్లవాలు చేసి, ప్రత్యేక రాష్ట్రంతో ప్రజాస్వామిక సమాజాన్ని సాధిస్తామని పోరాడి, ప్రాణార్పణలు చేసి... చివరికి మిగిలిందేమిటి? మిగుల్చుకున్నదేమిటి? ఒక్క ప్రశ్న కూడా రాదా? నాయకుడు ధర్మకర్త కదా, ఉమ్మడి ఆస్తి ఒక్కరిదే ఎట్లా అవుతుంది.. అన్న ప్రశ్న రాదెందుకు? ముహూర్తం ఎప్పుడు, నిజమా కాదా అని గుసగుసలు పోవడంతో సరిపెట్టుకుంటున్నారెందుకు? పార్టీలోనివారే కాదు, బయటి అభిమానులు, విమర్శకులు, వ్యాఖ్యాతలు అందరూ భయావరణంలో భద్రమైన ఆలోచనలు చేస్తున్నారు. అన్నిటినీ ఆమోదించేయడానికి సిద్ధపడుతున్నారు. ఇంతదాకా వచ్చిన తరువాత ఏమి చేయగలమని నిట్టూరుస్తున్నవారు, ఉద్యమ ఫలితాలు అన్యాక్రాంతమవుతున్నప్పుడు, పలచబడుతున్నప్పుడే మేలుకుని ఉంటే బాగుండేది కదా, తామూ ఓనర్లమేనని చెప్పినవారేరీ? లేక, మరెవరో చెప్పినట్టు, అంతా ప్రైవేటు కంపెనీగా మారిపోయిందా? ఇంతగా ఈ సమాజం నిస్సహాయమూ నిరాయుధమూ అయినప్పుడు, మతతత్వానికి పరవశించడం మాత్రం ఇక ఏమంత దూరంలో ఉందని? 


కె. శ్రీనివాస్

Updated Date - 2021-01-28T09:52:54+05:30 IST