నిఘా నీడలో ప్రజాస్వామ్య నైతికత

ABN , First Publish Date - 2021-07-30T10:12:17+05:30 IST

నరేంద్ర మోదీ సర్వాధినేత కావడానికి చాలా కాలం ముందే సర్వ శక్తిమంతులైన నెహ్రూ-గాంధీలు ఉన్నారు. ఇందిరా గాంధీ తన కోడలు మేనకపై గూఢచర్యానికి ఎలా ఆదేశించారో...

నిఘా నీడలో ప్రజాస్వామ్య నైతికత

నరేంద్ర మోదీ సర్వాధినేత కావడానికి చాలా కాలం ముందే సర్వ శక్తిమంతులైన నెహ్రూ-గాంధీలు ఉన్నారు. ఇందిరా గాంధీ తన కోడలు మేనకపై గూఢచర్యానికి ఎలా ఆదేశించారో ఎమ్.కె. ధార్ (ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ జాయింట్ డైరెక్టర్) తన ‘ఓపెన్ సీక్రెట్స్: ఇండియా ఇంటెలిజెన్స్ అన్ వెయిల్డ్’ పుస్తకంలో వివరించారు. రాష్ట్రపతి జైల్‌సింగ్‌పై రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎంతగా నిఘా ఉంచిందో కూడా ఆయన వివరించారు. ఆ గూఢచర్యానికి భయపడిన జైల్‌సింగ్ తన వ్యక్తిగత సమావేశాలను కార్యాలయంలో కాకుండా రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్‌లో నిర్వహించుకునేవారట! మరి, ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేశారన్న ధ్రువీకరింపబడని ఆరోపణలపై బీజేపీ మద్దతుదారులు ఎందుకు అంతగా గడబిడ చేస్తున్నారు? అవే ఆరోపణలను ప్రత్యర్థులపై గుప్పించడం సంభావ్య చట్ట విరుద్ధ చర్యలను హేతుబద్ధీకరణ చేస్తుంది. అంతేకాదు నాటి గూఢచర్యం నేటి హ్యాకింగ్ మధ్య ప్రధాన వ్యత్యాసాలను గుర్తించడంలో వైఫల్యానికి అదొక తార్కాణంగా నిలుస్తుంది. 


భారత రాజ్యవ్యవస్థ సదా ఒక ‘గూఢచర్య-రాజ్యం’ అనడంలో సందేహమేమీ లేదు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను రాజకీయ నిఘాకు నియోగించని పక్షంలో ఆ సంస్థల అధికారులు తమ ఉనికిని ఎలా సమర్థించుకోగలరు? శత్రువు దేశ సరిహద్దులకు వెలుపలగాక తమకు అత్యంత చేరువలోనే ఉన్నారని స్వతంత్ర భారతదేశ ప్రధానమంత్రులలో అత్యధికులు విశ్వసించేవారనడం సత్యదూరం కాదు. వారి ఆ ప్రగాఢ నమ్మకం అధికారంతో ముడివడి ఉన్న ఒక మానసిక రుగ్మత. సర్వాధికారాలను చెలాయించే వారు స్వతస్సిద్ధంగానే తమ చుట్టుపక్కల ఉన్న వారిని అనుమానించడం కద్దు. ఇది ఇందిరాగాంధీ విషయంలో ఎంత నిజమో నరేంద్ర మోదీ విషయంలో అంతకంటే ఎక్కువ నిజం. అయితే ఇందిర హయాంలో గూఢచర్యం, మోదీ పాలనలో నిఘా మధ్య గుణాత్మక, పరిమాణాత్మక తేడా ఉంది. ఇప్పుడు నిఘా అనేది చాలా విస్తృతంగా జరిగే కార్యకలాపం. లెక్కలేనితనంతో వ్యవహరించడమనేది దాని ప్రధాన లక్షణం. ఇక నవీన సాంకేతికతల సామర్థ్యం ఇప్పటి గూఢచర్యానికి ఎంతగా ఆలంబన అవుతున్నాయో మరి చెప్పాలా? ఈ నిఘా మున్నెన్నడూ లేని విధంగా వ్యక్తిగత గోప్యతను ఎంతగా ఛేదించాలో అంతగా ఛేదిస్తోంది.


ల్యాండ్‌లైన్ టెలిఫోన్ ద్వారా జరిపే సంభాషణలను రహస్యంగా రికార్డు చేయవచ్చు గానీ ఇది పొద్దస్తమానం జరిగే పనికాదు. ఇది గడచిన రోజుల్లో జరిగిన గూఢచర్యం. మరి ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అనే ప్రతి ఒక్కరికి అత్యంత సన్నిహిత, ఆత్మీయ ‘జీవి’గా వర్ధిల్లుతోంది. అది స్మార్ట్‌ఫోన్‌వాలా మనస్సు, శరీరానికి పొడిగింపుగా ఉంది. మీ దేహం, మస్తిష్కం నుంచి స్మార్ట్ ఫోన్‌ను వేరు చేయడమనేది సాధ్యమవుతుందా? కాదు గాక కాదు. చెప్పవచ్చిందేమిటంటే స్మార్ట్ ఫోన్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఎంతైనా ఉంది. ఆ మాటకొస్తే చులాగ్గా హ్యాకింగ్ చేసేందుకు అధునాతన సాధనాలూ ఎన్నో ఉన్నాయి. పెగాసస్ సాఫ్ట్‌వేర్ అటువంటి సాధనమే. మీరు మాట్లాడుతున్న సమయంలోనే అది మీ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడగలుగుతుంది. మీ విలువైన సమాచారాన్ని అది గ్రహిస్తుంది. లేదా తస్కరిస్తుంది. ఎవరు ఇందుకు జవాబుదారీ? జవాబుదారీతనాన్ని నిర్ణయించే ప్రక్రియను ఎక్కడ మొదలు పెట్టాలి? 


ఇంచుమించు 300 మంది భారతీయ ప్రముఖులు పెగాసస్ నిఘాకు సంభావ్య లక్ష్యాలుగా ఉన్నట్టు ఆ గూఢచర్య సాఫ్ట్‌వేర్ వ్యవహారంపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు సూచిస్తోంది. అయితే ఆ లక్ష్యిత వ్యక్తుల జాబితాలో మరింత మంది తప్పకుండా ఉండివుంటారు. హ్యాకర్ దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే ఒక సత్యాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. జాతీయ భద్రతకు ముప్పుగా అతడు / ఆమె పరిణమిస్తున్నట్టు గట్టి సాక్ష్యాధారాలు లేకుండా ఒక్క వ్యక్తి ఫోన్‌పై నిఘా ఉంచడమనేది మౌలికంగా చట్టవిరుద్ధ చర్య అవుతుంది. ఇది సందేహాతీతమైన సత్యం. పెగాసెస్ నిఘాకు లక్ష్యంగా ఉన్న భారతీయ ప్రముఖులలో రాజకీయ ప్రత్యర్థులు, కేంద్రమంత్రులు, పాత్రికేయులు, న్యాయమూర్తులు, మానవ హక్కుల కార్యకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆఖరుకు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ వాస్తవం స్పష్టం చేస్తున్నదేమిటి? వ్యక్తిగత గోప్యతా హక్కులు ఉల్లంఘింపబడడమేకాదు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం శిథిలమై పోతోంది. అనైతిక నిఘాను అరికట్టకపోతే అంతిమంగా మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా హరించుకుపోతాయి. ఇందులో సందేహం లేదు. 


అయినప్పటికీ పెగాసస్ నిఘా ఆరోపణలను మోదీ ప్రభుత్వం నిస్సిగ్గుగా నిరాకరిస్తోంది. ఆ అంశంపై పార్లమెంటులో చర్చకు తిరస్కరిస్తోంది. దర్యాప్తు నిర్వహించేందుకు ససేమిరా అంటోంది. కారణమేమిటి? లోక్‌సభలో సంఖ్యాబలమే ప్రాథమిక కారణం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. తమ ఆధిపత్యాన్ని ఎవరూ సవాల్ చేయలేరని పాలకపక్షం గట్టిగా విశ్వసిస్తోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఎంతగా గొడవ చేస్తే ఏమిటి? విపక్షాల విమర్శల ప్రభావం పార్లమెంటు వెలుపల ఏమాత్రం ఉండబోదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. సరే, పౌర సమాజం అయినా ఆ అనైతిక నిఘాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందా? లేదు. హ్యాకింగ్ ఒక సాధారణ కృత్యమేనని అత్యధికులు భావిస్తున్నారు. తత్కారణంగానే హ్యాకింగ్ పర్యవసానాలను వారు పూర్తిగా ఉపేక్షిస్తున్నారు. ఇటువంటి ‘చల్తా హై’ వైఖరి దేశ ప్రజలలో ఇంతకు ముందెన్నడూ లేదు ముఖ్యంగా ప్రస్తుత సందర్భంలో ఇది ఏ మాత్రం సరికాదు. ప్రభుత్వ చర్యలను పౌర సమాజం చాల వరకు నిరాక్షేపణీయంగా అనుమతిస్తోంది. ఎటువంటి చర్యలవి? అవి నిజమని రుజువయితే అధికారం ఎంత నేరపూరితంగా దుర్వినియోగమయిందో విశదమవుతుంది. భారతీయ మధ్యతరగతి వర్గం పిరికితనంతో వ్యవహరిస్తోంది. వారి సామూహిక అంతఃకరణ మొద్దుబారిపోయింది. స్వప్రయోజనాలకు మినహా విశాల సమాజ హితవును కాంక్షించని వైఖరి మన మధ్యతరగతిలో వ్యక్తమవుతుంది. మరి మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నదీ కూడా ఇదే. మధ్యతరగతి ప్రజల ఉదాసీనతపై ఆధారపడి పెగాసస్ సంక్షోభాన్ని అధిగమించగలమని మోదీ ప్రభుత్వం ఆశిస్తోంది. అత్యధిక ప్రజలు నిష్క్రియాపరత్వంతో వ్యవహరిస్తున్నారు. స్వీయ శ్రేయస్సు మినహా వారికేమీ పట్టడం లేదు. కొవిడ్ ఉపద్రవంలో అల్లల్లాడిపోయి, ఆర్థిక సమస్యలతో సతమతమవున్న వారు ఎంతో మంది ఉన్నారు. అసలే కలవరపాటులో ఉన్న వారి మనస్సులలో హ్యాకింగ్ వివాదం ప్రతిధ్వనించడం లేదు. ఒక నిస్పత్తువ, అంతకు మించిన ఒక నిర్వేదం వారిని ఆవహించి ఉంది. గోప్యత హక్కుకు, కొన్ని ఇతర వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల హక్కులతో సమానంగా వారు పరిగణించడం లేదు. మరి పెగాసస్ సంక్షోభం అంతిమ పర్యవసానాన్ని వారు ఎలా అర్థం చేసుకోగలుగుతారు?


భారతీయులు వీరారాధకులు. వీరారాధన ప్రజాస్వామ్య ప్రవృత్తికి విరుద్ధం. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తి పూజ పెరిగిపోతోంది. ప్రధానమంత్రి నిర్ణయాలను కించిత్ విమర్శించినా ఆయన అసంఖ్యాక మద్దతుదారులు సహించలేక పోతున్నారు. తమ అభిమాన నేతను విమర్శించిన వారిని ‘జాతి-వ్యతిరేకులు’గా పరిగణిస్తున్నారు అటువంటి వ్యక్తులను తమ దాడులకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయవాద భావోద్వేగాలకు అనుకూలంగా ఎడతెగని ప్రచార హోరులో తద్విరుద్ధమైన గొంతులు నూతిలో గొంతుకలు అయిపోయాయి.


మరి హ్యాకింగ్ ఆరోపణలు ‘విదేశీ కుట్ర’ ఫలితమని ప్రధాని మోదీ ఆరోపించడంలో ఆశ్చర్యమేముంది? పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో తమ ప్రభుత్వం సరిగ్గా పనిచేయకుండా అడ్డుకునేందుకు అంతర్జాతీయ వామపక్ష సంస్థలు ఆ కుట్రలో భాగస్వాములు అయ్యాయని కూడా మోదీ దుయ్యబట్టారు. ఇంతకంటే అర్థరహిత, తర్క విరుద్ధ ఆరోపణ మరొకటి ఉండబోదు సుమా! ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాలలో గూఢచర్య సాఫ్ట్ వేర్ వ్యవహారాలను బహిర్గతం చేసేందుకు ఉద్దేశించిన వివిధ సంస్థల కార్యకలాపాలను ఒక ఫ్రెంచ్ ఎన్‌జిఓ సమన్వయపరుస్తోంది. మరి ఆ సంస్థ, పెగాసస్ నిఘా వాస్తవాలను మన పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా వెల్లడించడం కాకతాళీయమనడంలో సందేహం లేదు. 


నిజమేమిటంటే మోదీ ప్రభుత్వం భయపడుతోంది. సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో నిర్వహించే దర్యాప్తు తమ పాలనలో రాజ్యవ్యవస్థ నిఘా కార్యకలాపాల స్వరూపస్వభావాల గురించి వెల్లడించే విషయాలు మరింత ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయని న్యూఢిల్లీ పాలకులకు బాగా తెలుసు. కనుకనే ‘గూఢ చర్య సాఫ్ట్‌వేర్ పెగాసస్‌పై ఇజ్రాయెలీ సంస్థ ఎన్‌ఓఎస్‌తో భారత ప్రభుత్వానికి ఏమైనా ఒప్పందం ఉందా?’ అన్న ప్రశ్నకు మోదీ ప్రభుత్వం సమాధానమివ్వడం లేదు. ఈ అంశంపై ఎటువంటి ఒప్పుకోలు అయినాసరే ప్రభుత్వ ఏజెన్సీలు చట్ట విరుద్ధంగా మొబైల్ ఫోన్స్ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్టు అంగీకరించడమే అవుతుంది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ప్రభుత్వ కార్యకలాపాలపై ఎలాంటి సంస్థాగత పరిశీలనలను మోదీ సర్కార్ అంగీకరించదు. బిగ్‌బాస్ రీతిలో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం రాజకీయ జవాబుదారీతనం వహించేందుకు సిద్ధంగా లేదు. ఆ విషయంలో సువ్యవస్థిత విధానాలు, పద్ధతులను ధిక్కరిస్తోంది. ఈ ప్రభుత్వం - అసంఖ్యాక కొవిడ్ మరణాలకు దారితీసిన ఆక్సిజన్ సిలిండర్ల కొరతను అంగీకరించేందుకు తిరస్కరించింది; గత ఏడాది లాక్‌డౌన్ కాలంలో వలస సంక్షోభం అనేది సంభవించలేదని వాదించింది; ఆర్థిక వ్యవస్థ పరిస్థితి సజావుగా ఉందని, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని ఘంటాపథంగా చెబుతోంది; మన సరిహద్దు ప్రాంతాలలోకి చైనా సైన్యం చొరబడిందనడానికి రుజువులు ఏమిటని ప్రశ్నిస్తోంది! మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు హ్యాకింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చకు అనుమతిస్తుంది? న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తునకు ఎందుకు అంగీకరిస్తుంది? పెగాసస్ అంటే రెక్కలగుర్రం కదా. బహుశా పాలకుల, వారి మద్దతుదారుల భావనలో గూఢచర్యం, హ్యాకింగ్ అనేవి కూడా అవాస్తవిక కల్పనలే కాబోలు! 


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-07-30T10:12:17+05:30 IST