ట్రంప్‌పై నిషేధాస్త్రాన్ని రెడీ చేస్తున్న డెమోక్రాట్లు!

ABN , First Publish Date - 2021-01-16T12:51:00+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను దిగువసభ అభిశంసించింది. కేపిటల్‌ భవనంపై దాడికి, హింసా విధ్వంసాలకు అనుచరులను ఉసిగొల్పిన నేరానికి ఆయనను అభిశంసిస్తున్నట్లు డెమొక్రాట్లు తెచ్చిన తీర్మానానికి అనుకూలంగా 232 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. డెమొక్రాట్‌ సభ్యులందరితో పాటు పది మంది రిపబ్లికన్‌ సభ్యులు కూడా ఈ తీర్మానానికి మద్దతు పలకడం విశేషం.

ట్రంప్‌పై నిషేధాస్త్రాన్ని రెడీ చేస్తున్న డెమోక్రాట్లు!

మళ్లీ పోటీ చేయకుండా నిషేధం!

ట్రంప్‌పై తదుపరి చర్య దిశగా కాంగ్రెస్‌లో చర్చ

వాషింగ్టన్‌, జనవరి 15: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను దిగువసభ అభిశంసించింది. కేపిటల్‌ భవనంపై దాడికి, హింసా విధ్వంసాలకు అనుచరులను ఉసిగొల్పిన నేరానికి ఆయనను అభిశంసిస్తున్నట్లు డెమొక్రాట్లు తెచ్చిన తీర్మానానికి అనుకూలంగా 232 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. డెమొక్రాట్‌ సభ్యులందరితో పాటు పది మంది రిపబ్లికన్‌ సభ్యులు కూడా ఈ తీర్మానానికి మద్దతు పలకడం విశేషం. ప్రతినిధుల సభలో ఉన్న- భారత సంతతికి చెందిన నలుగురు సభ్యులు- ప్రమీలా జయపాల్‌, రాజా కృష్ణమూర్తి, రోఖన్నా, అమీ బెరా -అభిశంసనను సమర్థించారు. దీంతో అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా ట్రంప్‌ అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ప్రతినిధుల సభ దీనిని ఆమోదించాక ఇక ఎగువ సభ- సెనెట్‌లో దీనిపై విచారణ జరగాలి. 19వ తేదీన సమావేశం కానున్న సెనెట్‌ దీనిని చేపట్టనున్నప్పటికీ విచారణ జరుగుతుందా, లేదా అన్నది ఇప్పటికీ సందేహాస్పదమే. 20వ తేదీన జో బైడెన్‌ దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంటే ట్రంప్‌ నిష్క్రమించేలోగా సెనెట్‌లో విచారణ పూర్తికాదు. అసలు ఆరంభమే కాకపోవచ్చన్న వాదనలూ ఉన్నాయి.


బైడెన్‌ అధ్యక్ష పదవీకాలం మొదలయ్యాక, కొత్త సెనెట్‌ కొలువుదీరాక ఈ అభిశంసన తీర్మానాన్ని కొనసాగించాలని డెమొక్రాట్లు పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం రిపబ్లికన్లకు ఆధిక్యం ఉన్నప్పటికీ 20 వ తేదీ తరువాత డెమాక్రాట్లు- రిపబ్లికన్లకు సమస్థాయిలో అంటే చెరో 50 చొప్పున బలం ఉంటుంది. అయితే ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులు, ఉపాధ్యక్షురాలు కానున్న కమలాహారిస్‌ ఓటును కలుపుకుంటే డెమొక్రాట్లకు 53 మంది బలం ఉంటుంది. కానీ అభిశంసన తీర్మానం నెగ్గాలంటే సెనెట్‌లో మూడింట రెండొంతుల మంది మద్దతివ్వాలి. ఆ లెక్కన కనీసం 17 మంది రిపబ్లికన్లు కూడా దానికి అనుకూలంగా ఓటు వేయాలి. అది జరగని పని అని విశ్లేషకులు అంటున్నారు. అంచేత సెనెట్‌లో విచారణ జరిగినా తీర్మానం నెగ్గడం కష్టమేనని చెబుతున్నారు. మరోవైపు- 2024లో మళ్లీ పోటీకి దిగుతానని ట్రంప్‌ ఇప్పటికే సంకేతాలనిచ్చారు.


ఆయనను మళ్లీ రానివ్వరాదని, అసలు పోటీకే అనర్హుడిగా ప్రకటించాలని డెమాక్రాట్లు పట్టుదలగా ఉన్నారు. దీనికి సంబంధించి సెనెట్‌లో ఓ తీర్మానం తెచ్చి ఆయనను అనర్హుడిగా చేయాలని భావిస్తున్నారు. అభిశంసన జరిగినా సెపరేట్‌గా ఈ అనర్హతకు సంబంధించిన తీర్మానం తేవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తుండడంతో ఆ తీర్మాన రూపకల్పన దిశగా ప్రయత్నాలు, చర్చలు సాగుతున్నాయి. సెనెట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందడానికి మూడింట రెండొంతుల మెజారిటీ అక్కర్లేదు. సాధారణ మెజారిటీ చాలు.. త మకున్న బలంతో సుళువుగా దీన్ని ఆమోదింపచేయగలమని డెమొక్రాట్లు ధీమాగా ఉన్నారు. అయితే ఈ తీర్మానం ఎప్పుడు తేవాలన్న దాని విషయంలో ఇంకా స్పష్టత లేదు. 

Updated Date - 2021-01-16T12:51:00+05:30 IST