భారతీయ టీకా అధ్యాయనం ఆధారంగా.. అమెరికన్లను మాస్కు వేసుకోమంటారా?

ABN , First Publish Date - 2021-07-31T15:54:38+05:30 IST

అధికారంలో ఉన్న డెమొక్రాట్స్ బలవంతంగా అమెరికన్ల చేత మాస్కులు ధరింపజేస్తున్నారని రిపబ్లికన్ నేత కేవిన్ మెకార్తీ మండిపడ్డారు. అమెరికాలో ఆమోదం పొందని భారత్‌లోని ఓ కరోనా టీకా అధ్యాయనం ఆధారంగా ఇలా మాస్కులు వేసుకోమనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

భారతీయ టీకా అధ్యాయనం ఆధారంగా.. అమెరికన్లను మాస్కు వేసుకోమంటారా?

వాషింగ్టన్: అధికారంలో ఉన్న డెమొక్రాట్స్ బలవంతంగా అమెరికన్ల చేత మాస్కులు ధరింపజేస్తున్నారని రిపబ్లికన్ నేత కేవిన్ మెకార్తీ మండిపడ్డారు. అమెరికాలో ఆమోదం పొందని భారత్‌లోని ఓ కరోనా టీకా అధ్యాయనం ఆధారంగా ఇలా మాస్కులు వేసుకోమనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అటు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తీరును కూడా కేవిన్ తప్పుబట్టారు. ప్రతిసారీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ దేశ ప్రజలను శిక్షించడం తగదన్నారు. ఇంతకుముందు సీడీసీ చెప్పిన మార్గదర్శకాలను తూచతప్పకుండా పాటించిన దేశ పౌరులను ఇప్పుడు మరోసారి అదే పని చేయమని చెప్పి సందేహంలో పడేస్తుందని చెప్పారు. అధికార పార్టీ చేతిలో సీడీసీ కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. 


గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేవిన్ మాట్లాడుతూ.. "కొన్ని రోజుల క్రితం సీడీసీ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. టీకా వేసుకున్నా.. మాస్క్ ధరించాల్సిందేనని చెబుతుంది. ఇండియాలోని ఓ టీకా పరిశోధన ఆధారంగా ఇలాంటి ప్రకటన చేయడం ఏంటో అర్థం కావడం లేదు. కనీసం ఆ టీకాకు అమెరికాలో ఆమోదం కూడా లేదు. ఇది అమెరికన్లను కరోనా పేరుతో శిక్షించడమే అవుతుందని" కేవిన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా జో బైడెన్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. అధికార డెమొక్రట్స్ చేస్తుంది ఏం బాగోలేదని తెలిపారు. మాస్కులను ధరించే విషయంలో వారికే క్లారిటీ లేదని, ఇక దేశ ప్రజలకు ఏం చెబుతారని ఎద్దేవా చేశారు.   


Updated Date - 2021-07-31T15:54:38+05:30 IST