భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు.. జో బిడెన్ వినూత్న వ్యూహం

ABN , First Publish Date - 2020-09-22T20:54:45+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలైనా రిపబ్లికన్, డెమొక్రటిక్... ఓటర్లను ఆకర్షించేందుకు తమ వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. అలాగే ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా ఇరు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు.. జో బిడెన్ వినూత్న వ్యూహం

14 భారతీయ భాషలలో డిజిటల్ యాడ్స్‌ విడుదల చేసిన డెమొక్రాట్స్ 

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలైనా రిపబ్లికన్, డెమొక్రటిక్... ఓటర్లను ఆకర్షించేందుకు తమ వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. అలాగే ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా ఇరు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నారై ఓటర్లను ప్రసన్నం చేసేకునేందుకు తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్‌లోని దక్షిణాసియా ఓటర్లను ఆకర్షించడానికి డెమొక్రాట్లు ఏకంగా 14 భారతీయ భాషలలో డిజిటల్ ప్రకటనలను విడుదల చేశారు. వీటి ద్వారా నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి సెనెటర్ కమలా హారిస్‌కు కూడా సపోర్ట్ చేయాలని డెమొక్రాట్స్ ప్రచారం చేస్తున్నారు. 


జాతీయ ఆర్థిక కమిటీ సభ్యుడు, బిడెన్ ప్రచారకర్తల్లో ఒకరైన అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ... "టెక్నాలజీని ఉపయోగించుకుని యూఎస్‌లోని దక్షిణాసియా ఓటర్లను చేరే ప్రయత్నం చేస్తున్నాం. మేము దక్షిణాసియా అమెరికన్లకు పేరు ఎలా నమోదు చేసుకోవాలో, ఎన్నికల రిమైండర్‌ల కోసం సైన్‌అప్ చేయడం, మెయిల్-ఇన్ బ్యాలెట్‌ల కోసం అభ్యర్థించడం, ప్రారంభ ఓటింగ్ ఆప్షన్ల గురించి తెలుసుకోవడం తదితర విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే బిడెన్, కమలాకు ఓటు వేయాలని కోరుతున్నాం" అని చెప్పుకొచ్చారు. 


ఇక ఇటీవల అజయ్ జైన్, వీనిత భూటోరియాలు దంపతులు బైడెన్‌కు మద్దతుగా బాలీవుడ్ మూవీ 'లగాన్‌'లోని 'చలే చలో, చలే చలో' అనే పాటకు రీమిక్స్‌గా 'చలే చలో, చలే చలో.. బిడెన్ కో ఓట్ దో.. బిడెన్ కీ జీత్ హో.. ఉన్‌కి హార్ హాన్' అంటూ సాగే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రీమిక్స్ పాటను బాలీవుడ్ సింగర్ తిత్లీ బెనర్జీ పాడారు. ఈ పాట ఇప్పుడు అక్కడ బాగా వైరల్ అవుతుందని అజయ్ భూటోరియా తెలిపారు. అలాగే అంతకుముందు తాము విడుదల చేసిన 'జాగో అమెరికా, భూల్ న జానా బిడెన్-హారిస్ కో ఓట్ దేనా జాగో' అనే థీమ్‌ సాంగ్‌తో కూడా ప్రవాసులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యామని ఆయన పేర్కొన్నారు. సంగీతం, ఆహారం, భాష, సంస్కృతితో ప్రజలు చాలా సులువుగా కనెక్ట్ అవుతారని ఈ సందర్భంగా భూటోరియా తెలియజేశారు.   

Updated Date - 2020-09-22T20:54:45+05:30 IST