దర్జాగా పూడ్చివేత

ABN , First Publish Date - 2022-01-24T05:20:58+05:30 IST

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలతో పాటు కీసర, ఘట్‌కేసర్‌ మండలాల్లోని పలు గ్రామాల మీదుగా ప్రవహిస్తూ ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్న ఎరిమల్లెవాగు కనుమరుగవుతోంది.

దర్జాగా పూడ్చివేత
పోచారం మున్సిపాలిటీ యంనంపేట్‌ వద్ద పూడ్చివేతకు గురైన ఎరిమల్లెవాగు

  • కనుమరుగవుతున్న ఎరిమల్లెవాగు
  • వాగు పొడువునా భారీగా ఆక్రమణలు 
  • పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు
  • రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆక్రమణ 
  • అక్రమాలకు నాయకుల అండదండలు

  ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలతో పాటు కీసర, ఘట్‌కేసర్‌ మండలాల్లోని పలు గ్రామాల మీదుగా ప్రవహిస్తూ ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్న ఎరిమల్లెవాగు కనుమరుగవుతోంది.  వాగును ఆక్రమిస్తూ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు జలవనరుగా ఉపయోగపడిన ఈ వాగు పూడ్చివేతతో అంతరిస్తోంది.  వాగును మింగేస్తున్న రియల్టర్లకు నాయకులు, అధికారులు ఇతోధికంగా సహకరిస్తున్నారని  స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బఫర్‌ జోన్‌లోనూ ఇళ్ల నిర్మాణాలకు అనుమతిలిస్తూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఘన చరిత్ర ఉన్న ఈ వాగు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే  మున్ముందు ముప్పు తప్పదంటున్నారు.

ఘట్‌కేసర్‌, జనవరి23: నాలాలు, బఫర్‌ జోన్ల సంరక్షణకు పభుత్వం ఆదేశాలున్నా ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో ఏకంగా వాగులనే పూడుస్తూ వెంచర్లు చేస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌, మున్సిపాలిటీల పరిధిలో ప్రవహించే ఎరిమల్లెవాగును రియల్టర్లు  పూడూస్తూ లేఅవుట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎరిమల్లెవాగు వివిధ గ్రామాలు, పోచారం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలు మీదుగా ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తుంది. ప్రస్తుతం పడమటిసాయిగూడెం పరిధిలో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ చేపట్టారు. వాగుకు ఇరువైపులా 30 అడుగులు బఫర్‌జోన్‌ వదిలాలి. కానీ నిర్మాణదారులు బఫర్‌జోన్‌ స్థలంలోనే రోడ్లు వేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా కూల్చివేతలు చేస్తున్నా తిరిగి నిర్మిస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. చౌదరిగూడ హామ్లెట్‌ మక్త గ్రామం పక్కనుంచి వెళ్లే నారాయణరావు చానల్‌(మూసీ)ను ఆక్రమించి గోడ నిర్మించారు. రెవెన్యూ అధికారులు రెండు సార్లు కూల్చినా తిరిగి కాంపౌండ్‌ నిర్మించారు. తాజాగా యంనంపేట్‌ వద్ద కిలోమీటర్‌ మేర వాగును పూడ్చారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోనే కాక పోచారం పరిధి యంనంపేట్‌ వైపునా వాగును పూడ్చారు. కొందరు నాయకులు బండరాళ్లను వాగులో వేయించి పూడ్చివేతకు సహకరించారు. గతంలోనే వాగు పక్కన వైకుఠధామానికి సీసీ రోడ్డు వేసినా నీటి ఉధృతికి రోడ్డు కొట్టుకు పోయింది. అయితే వాగు పూడ్చివేతపై రెవెన్యూ,  నీటి పారుదల శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. కళ్లెదుటే ఆక్రమణలు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. వాగును అనుకొనే ఇంటినీ నిర్మించారు. ఘట్‌కేసర్‌, కీసర మండలాల్లో పారే ఎరిమల్లెవాగు, బొంతకుంట వాగులను రియల్టర్లు కబ్జా చేశారు. వాగులపై ఇష్టానుసారం కల్వర్టు వేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఎరిమల్లెవాగును పరిరక్షించాలని పర్యావరణవేత్తలు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


  • వాగును కాపాడాలి : నర్రి శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ, యంనంపేట్‌ 

చరిత్ర కలినగి ఎరిమల్లెవాగు కబ్జా కాకుండ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారుల అండదండలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నాయకులు వాగును పూడ్చివేస్తే భారీ వర్షాల సమయంలో ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుంది.


  • చర్యలు తీసుకోకుంటే వాగు కనుమరుగే : గడ్డం మహేశ్‌, మాజీ ఎంపీటీసీ, ఘట్‌కేసర్‌

ఘట్‌కేసర్‌కు గతంలో ప్రధాన జలవనరైన ఎరిమల్లెవాగు పలుచోట్ల అక్రమణకు గురైంది. ఇలా చూస్తూ ఉంటే వాగు నామరూపాల్లేకుండా పోతుంది. అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించాలి. వాగు ప్రారంభం నుంచి ఎదులాబాద్‌ చెరువులో కలిసే చోటు బొక్కోనిగూడ వరకు వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలి.

  • వాగును ఆక్రమిస్తే కఠిన చర్యలు: విజయలక్ష్మి, తహసీల్దార్‌, ఘట్‌కేసర్‌

వాగును ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. గతంలోనే యంనంపేట్‌ వద్ద వాగును పూడ్చిన వాహనాలను సీజ్‌ చేశాం. మరోసారి ఇరిగేషన్‌ అధికాలతో కలిసి వాగును పరిశీలిస్తాం. ఆక్రమణలుంటే తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-01-24T05:20:58+05:30 IST