ఆత్మకూరులో గృహాల కూల్చివేత

ABN , First Publish Date - 2021-04-19T09:58:17+05:30 IST

మంగళగిరి నగరపరిధిలోని ఆత్మకూరులో ఆక్రమిత నివాసాల కూల్చివేత మరలా ప్రారంభమైంది. రోడ్డు విస్తరణ పేరుతో గత నెల 22న ఆత్మకూరు మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా వున్న

ఆత్మకూరులో గృహాల కూల్చివేత

వ్యూహాత్మకంగా సెలవురోజు ప్రణాళిక అమలు


మంగళగిరి, ఏప్రిల్‌ 18: మంగళగిరి నగరపరిధిలోని ఆత్మకూరులో ఆక్రమిత నివాసాల కూల్చివేత మరలా ప్రారంభమైంది. రోడ్డు విస్తరణ పేరుతో గత నెల 22న ఆత్మకూరు మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా వున్న ఆక్రమణల కూల్చివేతను చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో 25 ఇళ్లను కూల్చివేశారు. విషయం తెలుసుకొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేయించారు. స్టే రావడంతో నాడు కూల్చివేత కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. హైకోర్టు స్టే గడువు పూర్తవడం, ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు వ్యూహత్మకంగా వ్యవహరించారు. తెల్లవారు ఝాము నుంచే పొక్లెయినర్లతో కూల్చివేతను మొదలుపెట్టారు. 55 ఇళ్లను కూల్చివేశారు. మొత్తం 96 ఆక్రమిత గృహాలలో రెండు దశల్లో 80 ఇళ్లను కూల్చివేశారు.


మరో 15 మంది అధికారుల తీరుకు భీతిల్లి స్వచ్ఛందంగా వెళ్లిపోయారని సమాచారం. ఒకరు విడిగా కోర్డుకు వెళ్లడంతో ఆ ఇంటికి జోలికి మాత్రం అధికారులు వెళ్లలేదు. ‘‘బాధితుల్లో అర్హులైన వారిని గుర్తించాం. వారందరికీ ఇప్పటం రోడ్డు వెంబడి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ భూముల్లో ప్రత్యామ్నాయ నివేశన స్థలాలు కేటాయిస్తాం. ఇళ్లను నిర్మించే ప్రక్రియను చేపడతాం’’ అని అధికారులు చెబుతున్నారు. ఆదివారం నాటి కూల్చివేత పనులను ఎంపీడీఓ కోట రామప్రసన్న, ఈవోఆర్డీ శ్రీనివాసనాయక్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి సీతామహాలక్ష్మి పర్యవేక్షించారు.

Updated Date - 2021-04-19T09:58:17+05:30 IST