అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-18T05:07:36+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఘట్‌కేసర్‌లో గోదాంను కూల్చివేస్తున్న సిబ్బంది

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని రెండు నిర్మాణాలను సోమవారం హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కూల్చేశారు. వివిధ శాఖల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం పోలీసు బందోబస్తు మధ్య రెండు ఎక్స్‌కవేటర్లతో కూల్చివేత చేపట్టింది. మొదట శివారెడ్డిగూడలో భారీ షెడ్డును కూల్చివేసి అనంతరం నారాయణ గార్డెన్‌ వద్ద గల గోదాంను కూల్చారు. గోదాం రెండు వైపుల గోడలను పడగొట్టారు. కూల్చివేతల వద్దకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనిజంగయ్య, వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డి, కొందరు కౌన్సిలర్లు చేరుకొని అధికారులతో మాట్లాడారు. కూల్చివేతలు ఆపం అధికారులు తేల్చి చెప్పారు. ఈ లోపు నాయకులు మంత్రి మల్లారెడ్డికి మొరపెట్టుకోవడంతో అధికారులకు ఫోన్లు రావడంతో కూత్చివేత నిలిపేశారు. అక్కడి నుంచి అంబేద్కర్‌నగర్‌లోని పద్మారెడ్డి గార్డెన్‌ను కూల్చివేయడానికి చేరుకున్న అధికారులకు ఓనర్లు కోర్టు స్టే చూపించారు. అధికారులు మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఫంక్షన్‌హాలే ఉండేదని, ఇప్పుడు పరిశ్రమ నడుపుతున్నారని తేల్చి చెప్పారు. రెండు గంటల తర్వాత అధికారులు వెనుదిరిగారు. కౌన్సిలర్లు, పలువురు నాయకులు చేరుకొని అధికారులతో మట్లాడారు. 40ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలను ఎట్ల కూల్చుతారని ప్రశ్నించారు. నిర్మాణం చేస్తున్నప్పుడు ఏం చేశారని, తీరా ఇప్పుడు కూల్చుతు న్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి, విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, మున్సిపల్‌ ఏఈ శ్రీనివాస్‌, ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ టీపీఎస్‌ కావ్య, మేనేజర్‌ అంజిరెడ్డి, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:07:36+05:30 IST