దళిత శ్మశానవాటికలో.. 171 సమాధుల కూల్చివేత

ABN , First Publish Date - 2020-09-25T14:49:38+05:30 IST

పట్టణంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కన 1.85 ఎకరాల విస్తీర్ణంలో..

దళిత శ్మశానవాటికలో.. 171 సమాధుల కూల్చివేత

దళితసంఘాల కన్నెర్ర

జాతీయ రహదారిపై రాస్తారోకో.. 

శ్మశానవాటిక ముందు నిరసన

తహసీల్దార్‌ హామీతో శాంతించిన నేతలు


చిలకలూరిపేట(గుంటూరు): పట్టణంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కన 1.85 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దళిత శ్మశానవాటికలో  సమాధుల కూల్చివేత ఘటనతో స్థానిక దళితసంఘాలు కన్నెర్ర చేశాయి. రూ.65లక్షలతో శ్మశానవాటికలో గ్యాస్‌ దహనవాటిక ఏర్పాటుకు మునిసిపల్‌ అధికారులు టెండర్లు పిలిచి పనులకు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ గురువారం తెల్లవారుజామునుంచి శ్మశానవాటికలో పొక్లెయిన్‌తో సమాధులు తొలగించే పనిని చేపట్టారు. విషయం తెలు సుకున్న దళితసంఘాల నాయకులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. అనంతరం జాతీయ రహదారిపై కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అర్బన్‌ సీఐ టి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ షఫీలు వారికి సర్దిచెప్పి రాస్తారోకో విరమింపజేశారు.


అనంతరం దళితసంఘాల నాయకులు శ్మశానం ముందు టెంట్‌ వేసి నిరసన దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితసంఘాల పెద్దలను సంప్రదించకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా సమాధులను కూలగొట్టి అధికారులు తమ మనోభావాలను అగౌరవపరిచారని దుయ్యబట్టారు. సుమారు 171 వరకు తమ పెద్దల సమాధులను కూలగొట్టారని  ఆవేదన వ్యక్తం చేశారు. పనులను తక్షణమే నిలిపివేయాలని, మునిసిపల్‌ కమిషనర్‌ శిబిరం వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని, సమాధులు తొలగించిన వ్యక్తిపై సుమోటోగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, తొలగించిన సమాధులను పునర్నిర్మించాలని డిమాండ్‌ చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఫొటోతో శ్రద్ధాంజలి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌నూపుర్‌ ఆదేశాల మేరకు చిలకలూరిపేట తహసీల్దార్‌ జి.సుజాత శిబిరం  వద్దకు చేరుకుని శ్మశానంలో తొలగించిన సమాధులను పరిశీలించారు.


దళితసంఘాల నాయకులతో మాట్లాడి వారి డిమాండ్లను విన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ వారితో మాట్లాడుతూ సమాధుల తొలగింపు విషయంపై విచారణ కమిటీని నియమించి నిజానిజాలు తెలుసుకుని ఉన్నతాధికారు లకు నివేదిస్తామన్నారు. డిమాండ్లను రాతపూర్వకంగా అందజేస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇవ్వడంతో  నాయకులు శాంతించారు.  ఫార్‌కార్నర్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ జెస్సిఎస్‌ బర్నబస్‌ శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. దళిత సంఘాల నాయకులు పుల్లగూర భక్తవత్సలరావు, నల్లపు కోటి, పంగులూరి వెంకటరాయుడు, అన్నలదాసు బుల్లి, జంగా ప్రసన్న, పుల్లగూర జాన్‌, యడ్ల వినీల్‌, చెల్లి రాంబాబు, రామకోటి, జాన్‌ విక్టర్‌, బత్తుల విక్రమ్‌, శ్యామ్‌సన్‌, చంటి, కొచ్చర్ల రాజా, జాన్సన్‌, అడపా రవి, మర్దు, సాతులూరి సతీష్‌, మూకిరి కోటి, పిల్లి కోటి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-25T14:49:38+05:30 IST