డ్రోన్ల దండు!

ABN , First Publish Date - 2021-01-16T08:07:15+05:30 IST

సైనిక దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్‌లోని కరియప్ప గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పరేడ్‌లో భారత్‌ డ్రోన్ల దండుతో ప్రదర్శన నిర్వహించింది

డ్రోన్ల దండు!

అటు దాడికీ, ఇటు రక్షణకు కూడా ఉపయోగం

ఆర్మీ డే పరేడ్‌లో 75 డ్రోన్ల ప్రదర్శన

మున్ముందు వెయ్యి వరకూ చేరనున్న డ్రోన్ల సంఖ్య


న్యూఢిల్లీ, జనవరి 15: సైనిక దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్‌లోని కరియప్ప గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పరేడ్‌లో భారత్‌ డ్రోన్ల దండుతో ప్రదర్శన నిర్వహించింది. దేశీయంగా తయారైన ఈ డ్రోన్లు కృత్రిమ మేధతో పనిచేస్తాయి. దాడులు చేయడం, వైద్య సహాయం, పారాచూట్‌ పేలోడ్‌ డెలివరీ వంటి పలు విన్యాసాలను డ్రోన్లతో సైన్యం చేసి చూపించింది. వీటితో పాటు ‘మదర్‌ డ్రోన్‌’ వ్యవస్థను కూడా ఇదే పరేడ్‌లో సైన్యం ప్రదర్శించింది.


మొత్తం డ్రోన్ల సమూహంలో కలిసిపోయి ఉండే మదర్‌ డ్రోన్లు ఒక్కొక్కటీ మరో నాలుగు చిన్న డ్రోన్లను విడుదల చేస్తాయి. శత్రుదేశాలకు చెందిన యుద్ధట్యాంకులు, హెలీప్యాడ్‌లు, ఇంధన నిల్వలు, ఉగ్ర శిబిరాలు, రాడార్లపై దాడి చేసి ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్ల దండు సొంతం. పరేడ్‌లో మొత్తం 75 డ్రోన్ల దండును భారత సైన్యం ప్రదర్శించింది. శత్రు భూభాగంలో 50 కిలోమీటర్ల లోపల ఉన్న లక్ష్యాన్ని కూడా వీటితో ఛేదించవచ్చని అధికారులు చెబుతున్నారు.


ప్రైవేటు సంస్థలతో కలిసి ఈ సాంకేతికతను భారత్‌ అభివృద్ధి చేసింది. దాడులకే కాక, సైనికావసరాలను చేరవేయడానికీ డ్రోన్లను ఉపయోగించవచ్చు. 75 డ్రోన్లతో 600 కిలోల వరకూ సరుకును చేరవేయవచ్చని అంచనా. గత ఏడాది ఆగస్టులో కేవలం 5 డ్రోన్లతో మొదలైన ఈ సాంకేతికత క్రమంగా పెరుగుతూ నేడు 75కు చేరుకుంది. మున్ముందు వీటి సామర్థ్యాన్ని 1000 డ్రోన్ల వరకూ చేర్చవచ్చని తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ న్యూస్పేస్‌ రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సంస్థ వీటి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే అమెరికాకు చెందిన రెండు డ్రోన్లను లీజుకు తీసుకున్న భారత్‌.. ఐడియా ఫోర్జ్‌ అనే సంస్థతో డ్రోన్ల కోసం రూ.147కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 


సైనికులకు రుణపడి ఉన్నాం: రాష్ట్రపతి

1949లో బ్రిటిష్‌ అధికారుల నుంచి భారత అధికారులు సైన్యం బాధ్యతలు అందుకున్న సందర్భంగా జనవరి 15ను సైనిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్న సైనిక వీరులకు, వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. సైనికులందరికీ ట్విటర్‌లో ఆయన శుభాకాంక్షలు చెప్పారు. దేశానికి సైనికులు గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ  పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-16T08:07:15+05:30 IST