హైదరాబాద్‌లో Dengue డేంజర్ బెల్స్.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి...!

ABN , First Publish Date - 2021-09-07T17:31:27+05:30 IST

జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి...

హైదరాబాద్‌లో Dengue డేంజర్ బెల్స్.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి...!

మహానగరంలో డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 100 ఇళ్లను తనిఖీ చేస్తే పది చోట్ల ఏడిస్‌ ఈజిప్ట్‌ దోమల లార్వా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇతర దోమల లార్వా 6 నుంచి 8 శాతం వరకు ఉంటోందని పేర్కొన్నారు. డెంగీ దోమలు, వాటి వృద్ధికి కారకమయ్యే లార్వా ఇంటి ఆవరణల్లోనే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 


హైదరాబాద్‌ సిటీ : బహిరంగ ప్రదేశాలు, చెరువులు, కుంటల వద్ద క్యూలెక్స్‌, ఎనాఫిలిస్‌ దోమలు వృద్ధి చెందుతున్నాయి. గ్రేటర్‌లో కొంత కాలంగా డెంగీ పాజిటివ్‌ కేసుల సంఖ్య అధికమవుతోంది. దోమల నియంత్రణకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నాం.. ప్రతి ఆదివారం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1200 డెంగీ కేసులు నమోదు కాగా, 50 శాతానికిపైగా బాధితులు నగరానికి చెందిన వారు కావడమే గమనార్హం.


జాగ్రత్తగా ఉండాలి..

సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో దోమ కారక, వైరల్‌, ఇతరత్రా జ్వరాలు పెరిగే అవకాశముంటుంది. వాతావరణ మార్పులు, పరిసరాల అపరిశుభ్రత ప్రధాన కారణం. నగరంలోని చాలా ఇళ్లలో లార్వా కనిపిస్తోంది. నీళ్లు నిలవకుండా చూసుకోవాలని చెబుతున్నా, ప్రజలు అంతగా స్పందించడం లేదు. దోమలు వృద్ధి చెందకుండా మా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. ఇంటి పరిసరాల్లో దోమల లార్వా లేకుండా ప్రతీ వారం క్లీన్‌ చేయాలి. - డాక్టర్‌ రాంబాబు, చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌, జీహెచ్‌ఎంసీ


రెండు నెలలుగా..

రెండు నెలలుగా డెంగీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రులకు తాకిడి అధికంగా ఉంటోంది. గాంధీలో పదిహేను రోజుల్లో 80 మందికిపైగా చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో నలుగురు పిల్లలు చనిపోయినట్లు సమాచారం. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన మహిళ మృతి చెందింది. నిలోఫర్‌ ఆస్పత్రిలో 20 నుంచి 30 శాతం పిల్లలు డెంగీతో చికిత్స పొందుతున్నారు. ఇక డెంగీ లక్షణాలతో ఓపీ విభాగంలో చికిత్సలు తీసుకుంటున్న వారు చాలా మందే. పగటి దోమతోనే డెంగీ విజృంభిస్తోందని వైద్యులు తెలిపారు. 


లార్వా అధికంగా ఉండేది ఇక్కడే..

ఇటీవల సరూర్‌నగర్‌లోని ఓ ఇంటికి వెళ్లా. పది మొక్కల కుండీలు ఉంటే.. కుండీల కింద ఉండే ప్రతి ప్లేట్‌లో లార్వా ఉంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాం. మేమిద్దరం ఉద్యోగం చేస్తాం. ఇవన్నీ చూసుకునే సమయముండదు. పిల్లలకు తెలియదు కదాఅని సమాధానమిచ్చారని చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ డాక్టర్‌ రాంబాబు తెలిపారు. మరో ఏరియాలో ఇంజనీరింగ్‌ చదివే బ్యాచ్‌లర్లు ఉన్నారు. వారి గదిలోని కూలర్‌లో లార్వా అధికంగా ఉంది. దోమలు వృద్ధి చెందకుండా ఏం చేయాలన్నది వారికి వివరించామని ఆయన చెప్పారు. చెరువులు, కుంటల వద్ద క్యూలెక్స్‌ దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య ఏడిస్‌ ఈజిప్ట్‌ దోమలూ కనిపిస్తున్నాయి. పర్యాటక ప్రదేశాలకు సరదాగా గడిపేందుకు వెళ్లే ప్రజలు పడేసే ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్‌ గ్లాస్‌లు, ఇతర వస్తువుల్లో నీరు నిలిచి డెంగీ దోమల వృద్ధికి దారి తీస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 


బెంబేలెత్తుతున్న జనం.. 

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డెంగీ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాలుగు రోజుల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 25 డెంగీ కేసులు శేరిలింగంపల్లి ఆస్పత్రిలో నమోదైనట్లు మండలవైద్యాధికారి రామిరెడ్డి తెలిపారు. హఫీజ్‌పేట, రాయదుర్గం, మియాపూర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌లలో బస్తీలు, కాలనీల్లో వైరల్‌, డెంగీ జ్వరాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు హైటెక్‌ నియోజకవర్గమైనా, అడుగడుగునా చెత్తకుప్పలు, డ్రైనేజీ మురుగుతో రోడ్లు కంపు కొట్టడానికి తోడు ఎడతెరిపిలేని వర్షాలతో దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో సమీప కాలనీవాసులకు ప్రాంతాల్లో జనానికి కంటిమీద కునుకు కరువవుతోంది.


పెరిగిన కేసులు..

2019లో గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో డెంగీ కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో బాధితులు మరణించారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 160 మంది డెంగీ బారిన పడ్డారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వస్తున్న జ్వర పీడితుల్లో 50 శాతానికిపైగా డెంగీ బాధితులే ఉంటున్నారని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. ఫీవర్‌, నిలోఫర్‌, ఉస్మానియా ఆస్పత్రికీ వివిధ రకాల జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య అధికమైంది. సాధారణ రోజుల్లో ఫీవర్‌ ఆస్పత్రి ఓపీకి 600-800 మంది వస్తుంటారు. ఇటీవల ఆ సంఖ్య 1400లకుపైగా ఉంటోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులతోను వైరల్‌, ఇతరత్రా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి.


ఇళ్లలోనే డెంగీ దోమలు.. 

జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజీ సిబ్బంది కాలనీలు, బస్తీల్లో రసాయనాల పిచికారిలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇళ్ల ఆవరణలో పరిస్థితులు, నీరు నిల్వ ఉందా, తద్వారా దోమలు వృద్ధి చెందుతున్నాయా అన్నది పరిశీలిస్తున్నారు. దాదాపు 50 శాతం ఇళ్లల్లో మొక్కల కుండీల కింద ఉండే ప్లేట్లలోనే లార్వా ఎక్కువగా కనిపిస్తోందని ఓ అధికారి తెలిపారు. ఇళ్ల సజ్జాలపైన, ఓ మూలన పడేసిన ప్లాస్టిక్‌ వస్తువులు, కూలర్లు, టైర్లలోనూ వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

Updated Date - 2021-09-07T17:31:27+05:30 IST