డెంగ్యూ విజృంభణ

ABN , First Publish Date - 2021-10-12T05:29:40+05:30 IST

డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. గ్రామాల్లో వైరల్‌ జ్వరాలకు తోడు డెంగ్యూ జ్వరాలతో సత్తువ కోల్పోయి మంచాన పడుతున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నామన్న క్రమంలో డెంగ్యూ జ్వరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి.

డెంగ్యూ విజృంభణ

 - జిల్లాలో 101 కేసులు నమోదు 

- కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే 

- అప్రమత్తమైన అధికార యంత్రాంగం 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. గ్రామాల్లో వైరల్‌ జ్వరాలకు తోడు డెంగ్యూ జ్వరాలతో సత్తువ కోల్పోయి మంచాన పడుతున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నామన్న క్రమంలో డెంగ్యూ జ్వరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. ఆగస్టు నుంచి క్రమ క్రమంగా జ్వర పీడితులు పెరుగుతున్నారు. రెండు నెలల్లో వందకు పైగా డెంగ్యూ కేసులు నిర్ధారణ అయ్యాయి. డెంగ్యూ లక్షణాలతో అనేకమంది చికిత్స పొందుతున్నారు. సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. 

  పెరుగుతున్న కేసులు

జిల్లాలో డెంగ్యూ జ్వరాలు ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 101 మంది జ్వరాల బారిన పడ్డారు. చాలామంది డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆగస్టులో ఏడుగురు, సెప్టెంబరు 45, ఈ నెలలో ఇప్పటి వరకు 49 మంది డెంగ్యూ బారిన పడ్డారు. తాజాగా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముగ్గురు, కోనరావుపేట ఇద్దరు, గంభీరావుపేట ఇద్దరు, ఎల్లారెడ్డిపేట ఒకరు, వేములవాడ ఒకరు, చందుర్తి ఒకరు, సిరిసిల్ల 9 మంది డెంగ్యూ బారిన పడ్డారు. మరోవైపు 8వ విడత ఫీవర్‌ సర్వేను కొనసాగిస్తున్నారు. కొవిడ్‌ కేసులతోపాటు డెంగ్యూ, వైరల్‌ జ్వరాలను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 7 విడతల్లో 1,51,889 కుటుంబాలను, 8వ విడత సర్వేలో ఇప్పటి వరకు 43,629 కుటుంభాలను సర్వే చేశారు. 11,967 మందిని కొవిడ్‌ లక్షణాలు, ఇతర జ్వరాలు ఉన్నట్లు గుర్తించి కిట్లను అందజేశారు. మరోవైపు డెంగ్యూ లక్షణాలతో ప్లేట్‌లెట్స్‌ పడిపోతుండడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌ నగరాలకు పరుగులు తీస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. 

డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తత

 డెంగ్యూ జ్వరాలు పెరుగుతుండడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రధాన శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. గ్రామాల్లో డెంగ్యూ దోమల నివారణకు అశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు డ్రైడే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతోపాటు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల్లో ‘ఆదివారం పదిగంటలకు పది నిమిషాలు’ అనే కార్యక్రమంలో భాగంగా ఇంట్లో ఉన్న నిల్వ నీటిని పారబోసి శుభ్రం చేసుకోవాలని, అవగాహన కల్పించాలనే పిలుపునకు స్పందన లభిస్తోంది. 

Updated Date - 2021-10-12T05:29:40+05:30 IST