అప్పుల ఊబిలో యుద్ధమెలా!

ABN , First Publish Date - 2021-08-02T08:22:45+05:30 IST

అప్పుల ఊబిలో యుద్ధమెలా!

అప్పుల ఊబిలో యుద్ధమెలా!

ఆరోగ్యశాఖలోనే 1,725 కోట్ల బకాయి

కొవిడ్‌ పెండింగ్‌ బిల్లులే 900 కోట్లు

మూడో ముప్పును నిలువరించేదెలా?

కొవిడ్‌ అనాథల సాయంలోనూ జాప్యం

18కోట్లు ఇవ్వలేక కొంత కొంత సర్దుబాటు


ఇటుచూస్తే ఆరోగ్యశాఖలో రూ.కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కరోనాకు సంబంధించే రూ. 900 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అటుచూస్తే ‘మూడో’ ప్రమాదం తరుముకొస్తోంది. ఈ ప్రమాదంపై యుద్ధానికి సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. నిండా అప్పులఊబిలో కూరుకుపోయి..చిల్లిగవ్వ చేతిలో లేని స్థితిలో ఈ యుద్ధానికి ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది!అప్పుల ఊబిలో యుద్ధమెలా!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆరోగ్యశాఖకు బకాయిల బెంగ పట్టుకొంది. కరోనా మొదటి రెండు దశల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమైంది. మూడో దశ ప్రమాద ఘంటికలు మోగుతున్నా..ఈ పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. దీంతో మొత్తం రూ.1,725.47 కోట్ల బకాయిలతో ఆరోగ్యశాఖ కరోనాపై యుద్ధానికి సిద్ధమవుతోంది. మొదటి దశలో కాస్త ఫర్వాలేదనిపించినా...రెండో దశలో మాత్రం ఆరోగ్యశాఖ పూర్తిగా చేతులెత్తేసింది. చివరికి అధికారులు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. రెండో దశలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత తలెత్తింది. ఈ అనుభవంతో ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుచేశారు.


ఇవి మినహా ఏ జిల్లాల్లో కూడా కరోనా మూడో దశ ప్రణాళికలు అమలు కావడం లేదు. కారణం నిధుల సమస్య! రాజకీయ, వ్యక్తిగత దృష్టితో అప్పులు తెచ్చిమరీ పథకాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్యశాఖను మాత్రం ‘కరోనా’కు వదిలిపెట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశాఖకు మందుల దగ్గర నుంచి అన్ని రకాల వైద్య పరికరాలు ఏపీఎంఎ్‌సఐడీసీ అందిస్తుంది. మూడో దశ కరోనాను ఎదుర్కోవడంతో ఈ కార్పొరేషన్‌దే  కీలక బాధ్యత. అలాంటి చోట రూ.528.03 కోట్లు బకాయిలు ఉన్నాయి. పాత బిల్లులు చెల్లించకుండా కొత్త ఆర్డర్లు ఇవ్వడంపై కంపెనీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కోట్ల బకాయిలు పెట్టుకుని కొత్త ఆర్డర్లు ఇస్తే తాము సరఫరా చేయలేమని కొన్నిచోట్ల ముఖం మీదే చెప్పేశారు. మరో వారం రోజుల్లో కొంతైనా బకాయి చెల్లించకపోతే కార్పొరేషన్‌కు కంపెనీల నుంచి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. 


బాలింతల సొమ్మూ వాడేశారు..

కార్పొరేషన్‌ తర్వాత అత్యధికంగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో రూ.456.41 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా ఎన్‌హెచ్‌ఎంలో నిధుల కొరత ఉండకూడదు. ఎందుకంటే దానికి నిధులు మొత్తం కేంద్రం కేటాయిస్తుంది. ఈ నిధులతో ఎన్‌హెచ్‌ఎం పథకాలకు నిధులు కేటాయిస్తారు. ఎన్‌హెచ్‌ఎంలోనూ సర్కారు చొరబడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రం నిధులను సొంత పథకాలకు బదలాయించుకుంటోంది. చివరికి బాలింతల సొమ్మును కూడా వదలడం లేదు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.ఆరువేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. పీఎంఎంవీవైకి సంబంధించిన నిధులు కేంద్రం ఎప్పటిప్పుడు విడుదల చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విదల్చలేదు. పైగా కేంద్రం బాలింతలకు ఇచ్చే నిధులను కూడా వాడేసుకుంటోంది. ఇలా రూ.61.07 కోట్ల బకాయిలు క్లియర్‌ చేయలేదు. ఆరోగ్యశ్రీలో రూ.420 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన చిన్నారులకు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం ప్రకటించింది. అనాథలైన వారిని 182 మందిని గుర్తించింది. వారికి రూ.10 లక్షల చొప్పున రూ.18.20 కోట్లు చెల్లించాలి. ఈ నిధులూ విడతల వారీగా చెల్లించారు. రూ.18 కోట్లు ఒకేసారి ఇవ్వలేని దుస్థితిలో ఆరోగ్యశాఖ ఉందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


జిల్లాల్లో మరీ కష్టం...

జిల్లాల ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉంది. మూడో దశను ఎదుర్కొవడానికి కలెక్టర్ల వద్ద కొవిడ్‌కు సంబంధించి ఒక్క రూపాయి కూడా లేదు. పైగా మొదటి, రెండో దశకు సంబంధించి రూ.387.25 కోట్లు బకాయిలున్నాయి. కొవిడ్‌ సమయంలో పని చేయడానికి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో వేల మందిని ఆరోగ్యశాఖ నియమించుకుంటుంది. కానీ వారికి సకాలంలో వేతనాలు చెల్లించలేకపోతోంది. జిల్లాల్లో రూ.69.72 కోట్లు కేవలం వీరికి జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇవీ కాకుండా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పేరుతో జిల్లాల్లో రూ.29.81 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులు కూడా విడుదల చేయలేదు.

Updated Date - 2021-08-02T08:22:45+05:30 IST