Abn logo
Sep 26 2021 @ 09:05AM

Srikakulam: దూసుకొస్తున్న గులాబ్ తుఫాన్

అమరావతి/శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్ తుఫాన్ దూసుకొస్తుంది. ఒడిశాలోని గోపాల్‎పూర్‎కు ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్ల, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం తూర్పు దిశగా 440 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. గులాబ్ తుఫాన్ కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం కళింగపట్నం సమీపంలో ఈ రోజు  సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్ళరాదన్న ఏపీ విపత్తు శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్డుకు మూడో ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేసింది.