ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా

ABN , First Publish Date - 2022-01-15T07:36:58+05:30 IST

28 వాహనాలపై అధికారులు కేసులు నమోదు చేసి, 3.16 లక్షల జరిమానా విధించారు.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా

చిత్తూరు సిటీ, జనవరి 14: జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసే బస్సులపై నిఘా పెట్టడమే కాక వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా బెంగళూరు - తిరుపతి, బెంగళూరు - చెన్నై రహదారుల్లో తిరిగే ప్రైవేట్‌ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. టికెట్‌ ధరల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకుంటున్నారు. వాహనానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోతే జరిమానా విధిస్తున్నారు. గత రెండురోజులుగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ఆర్టీవో కార్యాలయాల పరిధిలో 28 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3.16 లక్షల జరిమానా వసూలు చేసినట్లు డీటీసీ బసిరెడ్డి చెప్పారు. రవాణాశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని, టాక్స్‌, పర్మిట్‌, ఫిట్‌నెస్‌ లేని వాహనాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బస్సుల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోయినా, టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించినా ప్రయాణికులు 9154294722 నెంబరుకు ఫిర్యాదు చేయాలని డీటీసీ సూచించారు. 

Updated Date - 2022-01-15T07:36:58+05:30 IST