బహిష్కరణ కలకలం!!

ABN , First Publish Date - 2021-03-01T05:35:22+05:30 IST

మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హైకమాండ్‌ చేసిన ప్రకటన జిల్లా వ్యాప్తంగా రాజకీయ చర్చకు తావిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి రాథోడ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ ఉట్నూర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన

బహిష్కరణ కలకలం!!
రాథోడ్‌ రమేష్‌

కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ సస్పెన్షన్‌

బీజేపీలో చేరికపై ఊగిసలాట

ఖానాపూర్‌ సెగ్మెంట్‌లో దుమారం 

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ ఆసక్తి

జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణలు  

నిర్మల్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హైకమాండ్‌ చేసిన ప్రకటన జిల్లా వ్యాప్తంగా రాజకీయ చర్చకు తావిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి రాథోడ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ ఉట్నూర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తుండడంతో పాటు ఈ విషయంలో అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నుంచి రమేష్‌ రాథోడ్‌ బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు సాగిస్తూనే కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రత్యర్థులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అయితే రాథోడ్‌ బీజేపీలో చేరేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారన్న సమాచారం మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం రాథోడ్‌ను బహిష్కరించి న వ్యవహారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. ఎలాంటి షోకాజ్‌ నోటీసులు గాని, పరోక్ష హెచ్చరికలు లేకుండానే రమేష్‌ రాథోడ్‌ ను ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించడం పట్ల జిల్లావ్యాప్తంగా ఆయన అనుచరవర్గంలో అసంతృప్తి రేగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల రాథోడ్‌ వర్గీయుల్లోనే కాకుండా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో సైతం వ్యతిరేకత మొదలైదంటున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం రాథోడ్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు సాగించినట్లు ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే ఎంపీ సోయం బాపురావుతో కలిసి ఆయన తన చేరిక విషయమై చర్చించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అంతటా రాథోడ్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆయన పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తుండడం, బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుండడాన్ని కాంగ్రెస్‌లోని ఆయన ప్రత్యర్థి వర్గాలు ఓ అవకాశంగా మలుచుకున్నాయంటున్నారు. దీనిని అస్త్రంగా మలుచుకొని వారు కొద్దిరోజుల నుంచి వరుస ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేసి రాథోడ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి జిల్లాకు చెందిన పార్టీలోని కొంతమంది పెద్దలు కూడా పరోక్షంగా సహకరించారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా  రాథోడ్‌ జిల్లాలో బలమైన రాజకీయనేతగా గుర్తింపు పొందారు. టీడీపీలో జడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా వ్యవహరించిన రాథోడ్‌ రాజకీయ దురంధుడిగా పేరున్న మాజీ కేంద్రమంత్రి వేణుగోపాచారితో ఓ దశలో  అమీతుమీకి సిద్ధమయ్యారన్న ప్రచారం ఉంది. టీడీపీ హయాంలో రాథోడ్‌ జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి కూడా ఎదిగారంటున్నారు. ఆ తరువాత ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన రాథోడ్‌ టీడీపీలో ఇమడలేక టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అయితే ఖానాపూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ రాథోడ్‌కు ఇవ్వకపోవడంతో ఆయన వెనువెంటనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం, అలాగే వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో రాథోడ్‌ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. దీని కారణంగా చాలా సంవత్సరాల నుంచి రాథోడ్‌తో సరిపడని కాంగ్రెస్‌ నాయకులు ఆయనపై వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎట్టకేలకు ఆ ప్రయత్నా లు ఫలించాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

చర్చకు తావిస్తున్న రాథోడ్‌ వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అధిష్ఠానం తనను పార్టీ నుంచి బహిష్కరించిన వ్యవహారంపై  రాథోడ్‌ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదని, అలాంటిది తనను పార్టీ నుంచి బహిష్కరించడం ఏంటని ప్రశ్నించారు. అయితే పార్టీలో సభ్యత్వం లేని రాథోడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ టికెట్‌ను ఎలా ఇచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్టీ అధిష్ఠానం రాథోడ్‌కు ఉన్న వ్యక్తిగత ప్రాబల్యం కారణంగా టికెట్‌ను ఇచ్చినప్పటికీ.. ఆయన తన బహిష్కరణ సమయంలో చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ టికెట్‌పై ఓటమి చెందడమే కాకుండా ఆ తరువాత జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాల్లో కూడా రాథోడ్‌ ఉత్సాహంగా పాల్గొనడం, అలాగే అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీలపై విమర్శలు చేసి ఆ పార్టీలో కూడా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. అలాంటిది తన రాజకీయ మనుగడ కోసం ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండడం, దీనికి తోడు ప్రత్యర్థులు ఆయన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండడం లాంటి అంశా లన్ని ఆయన వేటుకు దోహదపడ్డాయంటున్నారు. ఈ దశలో రాథోడ్‌ తన బహిష్కరణపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండి ఉంటే ఆయన పరిణతి వెల్లడయ్యేదంటున్నారు. అయితే రాజకీయాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించిన రాథోడ్‌ వ్యూహాత్మకంగా తన ప్రత్యర్థులను తిప్పి కొట్టేందుకు ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చక్రం తిప్పిన నేతగా గుర్తింపు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీడీపీ హవా నడుస్తున్న సమయంలో రమేష్‌ రాథోడ్‌ జడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా దీటైనా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారన్న పేరుంది. తనకు రాజకీయంగా చేయూతనిచ్చిన అప్పటి కేంద్రమంత్రి వేణుగోపాల చారిపైనే ఆయన పరోక్షంగా తిరుగుబాటు చేసి ప్రత్యేక అనుచరవర్గాన్ని రూపొందించుకున్నారు. ఓ దశలో జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో టీడీపీ తెరమరుగు అయినప్పటి నుంచి ఆయనకు రాజకీయ ఎదురీత తప్పడం లేదు. టీఆర్‌ఎస్‌లో చేరిక రమేష్‌ రాథోడ్‌ ఖానాపూర్‌ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. అయితే అక్కడి టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు దక్కడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యా రు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి సైతం ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో ఎదురవుతున్న ప్రస్తుత పరిణామాలు దృష్ట్యా ఆయన మళ్లీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లంబాడా తెగకు చెందిన రాథోడ్‌ రమేష్‌ చేరికను గోండు తెగకు చెందిన ఎంపీ సోయం బాపురావు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే రాథోడ్‌ ఢిల్లీలో సోయం బాపురావునే కలిసి జరిపిన రహస్య చర్చలు రెండు పార్టీల్లోనూ కలకలం రేపాయి. 

బీజేపీపై ఊగిసలాట.. టీఆర్‌ఎస్‌లో ఆసక్తి

వరుసగా ఓటమి పాలైనప్పటికీ రాథోడ్‌కు ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచే కాకుండా ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో కొంత మేరకు అనుచరవర్గం ఉంది. ముఖ్యంగా ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఇప్పటికీ ఆయన బలమైన నాయకుడిగానే కొనసాగుతున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరేందు కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి చెందిన గిరిజన తెగ నేతలు ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దూకుడుగా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూ ప్రత్యర్థి వర్గాలకు ఎప్పటికప్పుడు చెక్‌ పెట్టే సామర్థ్యం ఉన్న రాథోడ్‌ బీజేపీలో చేరితే సీనియర్‌ నేతలకు కొత్త చిక్కులు వచ్చే అవకాశాలుంటాయన్న భావనతోనే ఆయన చేరికను కొంతమంది అడ్డుకుంటున్నారన్న ప్రచా రం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం ఆయన చేరిక విషయంలో ఇప్పుడే స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా వేచిచూసే ధోరణి అవలంభించాలని  సీనియర్‌ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. బీజేపీలో రాథోడ్‌ చేరిక వ్యవహారం ఇలా కొనసాగుతుండగా.. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆసక్తికి కారణమవుతోంది. రాథోడ్‌ రాజకీయంగా బలహీనపడితే ముఖ్యంగా ఖానాపూర్‌ సెగ్మెంట్‌లో తమ కు గట్టి ప్రత్యర్థులు ఉండబోరన్న భావనతో గులాబీ పార్టీ ఉందంటున్నారు. 

Updated Date - 2021-03-01T05:35:22+05:30 IST