ప్రాణం కాపాడుకోవాలంటే ఇంట్లోనే ఉండాలి

ABN , First Publish Date - 2020-03-30T11:14:14+05:30 IST

ప్రాణం కాపాడుకోవాలంటే ఇంట్లోనే ఉండాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు.

ప్రాణం కాపాడుకోవాలంటే ఇంట్లోనే ఉండాలి

 డిప్యూటీ సీఎం నారాయణస్వామి


గంగాధరనెల్లూరు/వెదురుకుప్పం/శ్రీరంగరాజపురం/కార్వేటినగరం/పాలసముద్రం, మార్చి 29: ప్రాణం కాపాడుకోవాలంటే ఇంట్లోనే ఉండాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం గంగాధరనెల్లూరు నియోజక వర్గంలోని కార్వేటినగరం, వెదురుకుప్పం, పెనుమూరు,           గంగాధరనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్‌ఐ, మెడికల్‌ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. కరోనా వైరస్‌పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. తొలుత పాలసముద్రంలో సమావేశం జరగాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో రద్దయ్యింది. ప్రణాళికలో లేని ఎస్‌ఆర్‌పురం మండలంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. స్వీయ నిర్బంధంలో ఉండి మనల్ని మనమే కాపాడుకోవాలని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.


చిత్తూరు ఆర్డీవో రేణుక, స్థానిక అధికారులు పాల్గొన్నారు. కాగా.. రేషన్‌ సరకుల పంపిణీని కూడా వెదురుకుప్పం, కార్వేటినగరం, పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం, గంగాధరనెల్లూరు మండలాల్లో లాంఛనంగా డిప్యూటీ సీఎం ప్రారంభించారు. నియోజక వర్గంలో 243 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటిలో 20 చౌకదుకాణాలకు ఇంకా నిత్యావసర సరుకులు సరఫరా కాలేదు. చాలాచోట్ల లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటించలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం పూట కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం వెసులుబాటు కల్పిస్తే ప్రజలు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు. గంగాధరనెల్లూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో పోలీసులు ఓవైపు హెచ్చరిస్తున్నా జనం సామాజిక దూరం పాటించడం లేదు. 


Updated Date - 2020-03-30T11:14:14+05:30 IST