రాకపోకలపై నిఘా

ABN , First Publish Date - 2020-05-11T10:25:55+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో దుకాణాలు, వివిధ సంస్థలు తెరుచు కున్నాయి.

రాకపోకలపై నిఘా

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1191 మంది హోం క్వారంటైన్‌

 2684 మంది హోం క్వారంటైన్‌ పూర్తి 

నేడు జిల్లాను గ్రీన్‌జోన్‌గా ప్రకటించే అవకాశం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల):లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో దుకాణాలు, వివిధ సంస్థలు తెరుచు కున్నాయి. మరమగ్గాల పరిశ్రమలో ఉత్పత్తి మొదలైంది. మరోవైపు ఆరెంజ్‌ జోన్‌గా ఉన్న రాజన్న సిరిస్లిల జిల్లా గ్రీన్‌జోన్‌లోకి మారనుంది. అధికారికంగా సోమవారం ప్రకటిస్తారని భావిస్తున్నారు. గ్రీన్‌జోన్‌లోకి మారితే సడలింపులు పెరగనున్నాయి. అధికార యంత్రాంగం లాక్‌డౌన్‌ నిబంధనలతోపాటు మాస్క్‌ లు ధరించడం, భౌతిక దూరంపాటించడం వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. 


సడలింపులతో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. వచ్చిన వారిని హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిలో 3,875 మందిని గుర్తించారు. వీరిలో 2,684 మంది హోం క్వాంరటైన్‌ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 1,191మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. జిల్లా నుంచి మర్కజ్‌కు  వెళ్లివచ్చిన ముగ్గురికి నెగెటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.  


వలస కార్మికుల ఎదురుచూపులు 

సిరిసిల్ల జిల్లాలో ఉన్న 7వేల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 3 వేల మంది కార్మికులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్నారు. 


కాలినడకన బిహార్‌కు

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూర్‌వద్ద చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు బిహార్‌ నుంచి వచ్చిన కార్మికులు కాలినడకన ప్రయా ణమయ్యారు. డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాల వద్ద కాంట్రాక్టర్‌ వసతులు కల్పించలేదని, పస్తులు ఉంటున్నామని కార్మికులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, నగదు  తమకు అందలేదని, కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్నామని తెలిపారు. 23 మంది కార్మికులు కాలినడకన బయల్దేరారు.  

Updated Date - 2020-05-11T10:25:55+05:30 IST