సేద్యం.. ఇం‘ధన’ భారం

ABN , First Publish Date - 2021-06-16T07:15:21+05:30 IST

ప్రభుత్వ పథకాలు, రాయితీలు సకాలంలో అందక పెట్టుబడి ఖర్చులు నానాటికీ రెట్టింపవుతున్న ప్రస్తుత తరుణంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు అన్నదాతలను మరింత కుంగదీస్తున్నాయి.

సేద్యం.. ఇం‘ధన’ భారం
పొలం దున్నుతున్న ట్రాక్టర్‌

డీజిల్‌ ధరల పెరుగుదలతో 

రైతన్నలపై అదనపు బరువు

డీజిల్‌ ధర లీటర్‌ రూ. 96  

సెంచరీ దాటిన పెట్రోలు

వ్యవసాయం యాంత్రీకరణ నేపథ్యంలో తీవ్ర ప్రభావం 

ఎకరం సాగుకు అదనంగా రూ.2000 వరకూ మోత

ట్రాక్టర్ల యజమానులు, రైతుల ఆందోళన


పెట్రో ధరల పెంపు అన్నదాతలకు గుదిబండగా మారింది. వ్యవసాయం పూర్తి యాంత్రీకరణ దిశగా వెళ్లింది. దుక్కి దున్నకం మొదలుకుని పంటకోతలు, మందుల పిచికారీ, రవాణా తదితరాలన్నింటికీ డీజిల్‌, పెట్రోలుపైనే ఆధారపడాల్సి ఉంది. మునుపెన్నడూ లేనంతగా వాటి ధరలు రికార్డులు బద్దలుకొడుతున్నాయి. గత నెలరోజుల్లో 15సార్లు పెరిగాయి. ఆ భారం ప్రత్యక్షంగానే రైతులపై పడుతోంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. దుక్కులు దున్నేందుకు ఎక్కువమంది బాడుగ ట్రాక్టర్లపై ఆధారపడుతున్నారు. డీజిల్‌ ధరలకు రెక్కలు రావడంతో బాడుగలు పెరిగాయి. రుతుపవనాలు సహకరిస్తే మరో వారంలో పూర్తిస్థాయిలో వ్యవసాయ పనులు ఊపందుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరిగిన పెట్రో ధరలు రైతులకు పెనుభారంగా పరిణమించనున్నాయి. ఎకరాకు సుమారు రూ.2వేల వరకు పెట్టుబడి ఖర్చులు పెరగనున్నాయి. 

ఒంగోలు(జడ్పీ)/అద్దంకి/చీరాల, జూన్‌ 15: ప్రభుత్వ పథకాలు, రాయితీలు సకాలంలో అందక పెట్టుబడి ఖర్చులు నానాటికీ రెట్టింపవుతున్న ప్రస్తుత తరుణంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు అన్నదాతలను మరింత కుంగదీస్తున్నాయి. జిల్లాలో అధికంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల మీద ఇంధన ధరల ప్రభావం అధికంగా ఉంటోంది. ఇప్పటివరకు ఎరువులు, పురుగుమందులు, కూలి ఖర్చులు మాత్రమే భారం అనుకుంటే ఆ జాబితాలో ఇంధనం కూడా చేరిందని వారు వాపోతున్నారు. పెరిగిన ఽపెట్రోలు, డీజిల్‌ ధరల వల్ల రబీ, ఖరీఫ్‌ సీజన్లలో పెట్టుబడి వ్యయంలో పది శాతం మేర అధికమై తమకు మరింత భారం అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కనిపించని ఎడ్ల సేద్యం

గతంలో వ్యవసాయదారుల కుటుంబాల్లో ప్రతి ఇంటికీ ఓ ఎడ్ల జత ఉండేది. కాస్త మోతుబరులైతే ఆ సంఖ్య ఎక్కువగా ఉండేది. కాలగమనంలో ఎడ్లతో సేద్యం చేసేవారి సంఖ్య తగ్గింది. వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. దుక్కి దున్నకం దగ్గర నుంచి విత్తనాలు వెదబెట్టే వరకు ట్రాక్టర్లతో రకరకాల పరికరాలతో సేద్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడ్ల ప్రాఽధాన్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఊరికి పది జతల ఎడ్లు ఉన్నాయంటే ఎక్కువే. దీంతో క్రమేణా అందరూ సేద్యానికి ట్రాక్టర్లపై ఆధారపడటం ఆనవాయితీ అయింది. అందులో సొంత ట్రాక్టర్లు ఉన్న వారు కొందరైతే, ఎక్కువమంది బాడుగ ట్రాక్టర్లుతో సేద్యం చేయించుకునేవారే. సాగు చేసిన తర్వాత నుంచి ఎరువులు, పురుగుమందులు, కోతలు, నూర్పిళ్లు అంతా యంత్రాలే చేస్తుండడంతో సాగు ఖర్చు రెట్టింపైంది.


ఎకరం సాగుకు ఇంధనానికే అదనంగా రూ.600 భారం

పెరిగిన డీజిల్‌ధరలు కారణంగా దున్నకానికే రైతులు అదనంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇప్పటికే పోషకాలు అందించే పచ్చిరోట్ట పైర్లు దుక్కి దున్నడానికి అదనంగా ఖర్చు చేశారు. డీజిల్‌ పెరిగిన నేపథ్యంలో టాక్టర్ల యజమానులు కూడా సేద్యం ధరలను పెంచేశారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో దున్నకానికి ఎకరానికి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు ఖర్చయితే అదే ఇప్పుడు దాదాపు రూ.2వేలు దాటింది. గొర్రు తోలకం ఎకరాకు గత ఏడాది రూ.600కాగా ప్రస్తుతం రూ.800లకు పెరిగింది. నాగలి దుక్కి రూ1800 నుంచి రూ.2200, రోటోవేటర్‌ గంటకు రూ.1100 నుంచి రూ.1200, మాగాణి దమ్ము చేయటానికి రూ.1300 నుంచి రూ.1500లకు పెరిగింది.  డీజిల్‌ ధరలు రోజురోజుకూ ఎగబాకుతుండటంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే సమయానికి సాగు ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న,సన్నకారు రైతులు సొంత ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు లేకపోవడంతో అద్దె వాటిపై ఆధారపడతారు. వారికి అద్దె ఖర్చులతో పాటు పెరిగిన ఇంధన ధరలు వారికి మరింత గుదిబండగా మారనున్నాయి.


ఇంజన్లకు ఎక్కువ ఖర్చు

పొలాలకు నీరందించే కాలువల వ్యవస్థ సమర్థంగా లేకపోవడంతో ఇంజన్లు పెట్టి నీటిని తోడి తమ పైరును తడిపే పరిస్థితే జిల్లాలో అధికంగా ఉంది. గతంలో డీజిల్‌ ధర రూ.72 ఉండగా ప్రస్తుతం అది రూ.96కు చేరింది. లీటరుకు దాదాపు రూ.24వరకు రైతన్నలపై అదనపు భారం పడుతోంది. డీజిల్‌ ఇంజన్‌తో తక్కువలో తక్కువ ఐదు గంటల సమయంలో ఒక ఎకరాకు ఒకసారి తడి అందుతుంది. గంటకు లీటరు డీజిల్‌ అవసరమవుతుంది. ఈ లెక్కన ఒక్కో తడికి అదనంగా రూ.140 మేర భారం అన్నదాతపై పడుతోంది.


పెట్రోలుతో పనిచేసే  స్ర్పేయర్లు

జిల్లాలో సాగయ్యే పంటలకు స్ర్పేయర్లతోనే మందులు పిచికారి చేస్తుంటారు. లీటరు పెట్రోలుతో రెండున్నర ఎకరాలకు ఒకసారి పురుగుమందులను స్ర్పే చేయడానికి వీలుంటుంది. పెట్రోలు ధర ప్రస్తుతం వంద దాటింది. ఇది కూడా అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.


రవాణా కూడా భారం

కల్లాల్లో నుంచి పంటను ఇంటికి తరలించాడానికి, కొనుగోలు కేంద్రాలకు తమ ఉత్పత్తులను తీసుకెళ్లడానికి, కూలీల రవాణాకు ఎక్కువశాతం రైతులు ట్రాక్టర్లనే ఉపయోగిస్తుంటారు. పెరిగిన పెట్రోలు ధరలతో రవాణా  ఖర్చులు కూడా తడిసిమోపెడవుతున్నాయని రైతులు చెబుతున్నారు. అసలే మద్దతు ధరలు అంతంతమాత్రంగా ఉండి పెట్టుబడి ఖర్చులు కూడా గిట్టుబాటు కాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన తమను ఇంధన ధరలు మరింత అగాధంలోకి తోసేస్తున్నాయని వారు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం వల్ల కూడా తమకు దూరాభారం అవుతోందని, ఆర్‌బీకేలలో కొంటారని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అది జరగడం లేదని వారు విమర్శిస్తున్నారు.

Updated Date - 2021-06-16T07:15:21+05:30 IST