ఇసుక తవ్వకాల్లో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-06-27T05:45:01+05:30 IST

మానకొండూరు మండలంలోని శ్రీనివాస్‌నగర్‌, లింగాపూర్‌, వెల్ది, ఊటూర్‌ గ్రామాల పరిధిలోని మానేరు వాగులో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.

ఇసుక తవ్వకాల్లో ఇష్టారాజ్యం
మానేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు (ఫైల్‌)

- సాండ్‌ట్యాక్స్‌ నిబంధనలు గాలికిప్రభుత్వ ఆదాయానికి గండికొడుతు అక్రమార్కు

మానకొండూర్‌, జూన్‌ 26: మానకొండూరు మండలంలోని శ్రీనివాస్‌నగర్‌, లింగాపూర్‌, వెల్ది, ఊటూర్‌ గ్రామాల పరిధిలోని మానేరు వాగులో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. సాండ్‌ట్యాక్స్‌ నిబంధనలు పాటించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఆయా గ్రామాల పరిధిలో ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇసుకరీచ్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్సార్వోల నిర్వాహకంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. సాండ్‌టాక్స్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఈ రీచ్‌ల ద్వారా ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఒక ట్రాక్టర్‌కు సాండ్‌ట్యాక్స్‌ ద్వారా ఒకటి నుంచి రెండు ట్రిప్పులు మాత్రమే సమాచారం అందుతుంది. సదరు సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఎస్సార్వోలు ట్రాక్టర్లను ఇసుక రీచ్‌లోకి అనుమనుతులు ఇవ్వాలి. కానీ కొంతమంది ఇసుక యజమానులతో ఎస్సార్వోలు కుమ్మక్కై సాండ్‌ట్యాక్స్‌ నుంచి ఎలాంటి సందేశం లేకుండానే ట్రాక్టర్లను ఇసుక రీచ్‌లలోకి అనుమతిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇసుకరీచ్‌ల నుంచి ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ పర్మిషన్‌ పొంది ఇసుక తరలించాల్సి ఉంది. కాగా అక్రమార్కులు రాత్రి నుంచి ఉదయం వేళ్లల్లో సైతం ఎస్సార్వోల అండ దండలతో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలుమార్లు పోలీసులు దాడి చేసి ట్రాక్టర్లను పట్టుకున్నా అక్రమార్కులు ఇసుక రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-27T05:45:01+05:30 IST