కోరికలకు కళ్లెం వెయ్యాలి!

ABN , First Publish Date - 2020-06-26T05:30:00+05:30 IST

కోరికలను పూరించడం చాలా కష్టం. సముద్రంలా తెరిచిన కొద్దీ పుడుతూనే ఉంటాయి. అలాగే అగ్నిలాగా దీన్ని ఆర్పడం కూడా చాలా కష్టం. అయితే దానికి ఓ ఉపాయాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత తృతీయ అధ్యాయం...

కోరికలకు కళ్లెం వెయ్యాలి!

కోరికలను పూరించడం చాలా కష్టం. సముద్రంలా తెరిచిన కొద్దీ పుడుతూనే ఉంటాయి. అలాగే అగ్నిలాగా దీన్ని ఆర్పడం కూడా చాలా కష్టం. అయితే దానికి ఓ ఉపాయాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత తృతీయ అధ్యాయం నలభై ఒకటో శ్లోకంలో చెప్పాడు. 


  • తస్మాత్‌ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ!
  • పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశనమ్‌!!

మనిషికి ఉండే జ్ఞానం, విజ్ఞానం... కోరిక ఈ రెండిటినీ నాశనం చేస్తుంది. కోరికలు మనతో మహా పాపాలన్నీ చేయిస్తాయి. ఏదో పదవి పొందాలి, ఏదో పీఠం మీద ఉండాలి, పది మంది మన చుట్టూ తిరుగుతూ ఉండాలి... ఇలాంటి కోరికలు అనేకం. ‘‘భరతవర్షంలో శ్రేష్ఠుడివైన ఓ అర్జునా! నువ్వు యుద్ధాన్ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సక్రమంగా చేయాలంటే నీ మనస్సును నిగ్రహించుకో! ఎవరి మీదా ప్రత్యేకమైన ప్రేమలు లేకుండా, అనవసర ద్వేషాలు లేకుండా ధర్మానికి, సత్యానికి కట్టుబడి యుద్ధం చేయి’’ అని బోధ చేశాడు శ్రీకృష్ణపరమాత్మ. పురుష ప్రయత్నం ఎంత గట్టిగా ఉండాలో పరమాత్మ చెబుతున్నాడు. చేతులు నలిపేసుకునైనా సరే, దంతాలు పటపటా కొరికేసైనా సరే, కాలు మీద కాలు, మెడ మీద కాలు వేసేసుకునైనా సరే... ఏం చేసయినా ఇంద్రియాలను జయించాలి. ఎంత యుద్ధమైన చేసి ముందు ఇంద్రియాలను జయించాలి. కానీ మనమేం చేస్తున్నాం. ఇంద్రియ వ్యామోహానికి లోనై చేసే పాపాలన్నీ చేసేసి, కాశీకి వెళితేనో, గంగలో మునిగితేనో ఇవన్నీ పోతాయని అనుకుంటాం. అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. చేసే కర్మకు బాధ్యత వహించి తీరాల్సిందే. మనిషిని ఇంద్రియ వ్యామోహాలకు గురిచేసే శత్రువులు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. వీటికి మూలం కోరికలు! ఆ కోరికలను అదుపులో ఉంచుకోవాలి.


-గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-06-26T05:30:00+05:30 IST