ఆరేళ్లయినా తీరని కాంక్ష

ABN , First Publish Date - 2020-08-13T09:55:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకొ చ్చి ఆరేళ్లవుతోంది. రెండు పర్యాయాలు వరుసగా అధికారం చేపట్టింది.

ఆరేళ్లయినా తీరని కాంక్ష

భర్తీకాని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌ పాలకవర్గం 

ఆశావహుల్లో తీవ్ర నిరుత్సాహం 

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తీరుపై అసంతృప్తి 

ఎవరి పేరయినా సిఫారసు చేయాలంటూ ఒత్తిడి


ఆమనగల్లు : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకొ చ్చి ఆరేళ్లవుతోంది. రెండు పర్యాయాలు వరుసగా అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఆమనగల్లు మార్కెట్‌ పాలకవర్గాన్ని ఏర్పాటుచేస్తే ఆరుగురు చైర్మన్లు, మరో ఆరుగురు వైస్‌ చైర్మన్లు, పలువురు పాలకవర్గ సభ్యులుగా పదవులను అనుభవించేవారు.. ఇదీ ఇక్కడి ద్వితీ య శ్రేణి నాయకత్వంలో వినిపించేమాట. కానీ ఆరేళ్లయినా ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌ పాలకవర్గాన్ని భర్తీ చేయకపోవడంతో నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తమకు పదవులు దక్కుతాయని ఆపార్టీ ద్వితీయశ్రేణి నేతలెందరో భావించారు. తీరా రెండు పర్యాయాలు అధికారాన్ని దక్కించుకున్నా ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లి మండలాలతో విస్తరించి ఉన్న ఆమనగల్లు మార్కెట్‌ పాలకవర్గం నియామకానికి నోచుకోలేదు. చైర్మన్‌, ఇతర పాలకవర్గ పదవులుపై  ఆశలు పెంచుకున్న చాలామంది నాయకులు గత ఎన్నికల్లో అహర్నిశలు శ్రమించారు. కొందరైతే పార్టీ బలోపేతం కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. తీరా రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ జైపాల్‌యాదవ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.


మార్కెట్‌ కమిటీ పాలకవర్గం నియామకం దిశగా నేటికీ చర్యలు చేపట్టలేదు. దీంతో మార్కెట్‌ చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న కొందరు నాయకులు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇతర ప్రాంతాల్లో మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించినా, ఆమనగల్లులో ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ వైఖరిపై ఇటీవల ఆపార్టీ శ్రేణులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరిని మార్కెట్‌ చైర్మన్‌గా నియమిస్తే ఏమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాలకవర్గ నియామకాన్ని చేపడితే ఆశావహులందరికీ అవకాశం వచ్చేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఇటీవల చైర్మన్‌, పాలకవర్గ నియామకంపై చాలా మంది నాయకులు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌పై ఎవరి మార్గాన వారు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నా ఆయన మాత్రం దాటవేత ధోరణి అవలంబిస్తూ వస్తున్నారని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆశావహులంతా తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారు. 


ముగింపుదశకు రిజర్వేషన్‌ కాలపరిమితి

గతంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, అప్పటి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మధ్య గ్రూపు తగాదాల కారణంగా ఐదేళ్లు మార్కెట్‌ చైర్మన్‌ నియామకం జరగలేదు. ప్రస్తుతం పాలకవర్గ నియామాకానికి పార్టీలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు పెద్దగా అడ్డు కూడా లేదు. రిజర్వేషన్లలో భాగంగా ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ పదవి జనరల్‌కు కేటాయించారు. మార్కెట్‌ చైర్మన్‌ పదవికి కేటాయించిన రిజర్వేషన్‌ కాలపరిమితి కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈనేపథ్యంలో ఎవరో ఒకరి పేరు చైర్మన్‌ పదవికి సిఫారసు చేసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పార్టీకి, రైతులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌ కేటగిరీకి కేటాయించడంతో మార్కెట్‌ చైర్మన్‌ పదవికోసం మొదట్లో డజన్‌ మంది ఆశపడ్డారు. పరిస్థితుల దృష్ట్యా చివరకు నలుగురు నాయకుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఆతర్వాత జనరల్‌కు కేటాయించిన స్థానాన్ని వారికే మొదటిసారిగా అవకాశం ఇస్తామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పార్టీ శ్రేణులతో ప్రకటించడంతో ముగ్గురు పేర్లే తెరపైకి వచ్చాయి. ఇక చైర్మన్‌ పదవి భర్తీ అవుతుందని అందరూ భావించినా.. నెలల కాలంగా మళ్లీ ఎమ్మెల్యే నాన్చుడు ధోరణి అవలంబిస్తూ రావడం పట్ల నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇది క్రమంగా ఆశావాహుల్లో నిరుత్సాహం నిండి పార్టీ బలహీనానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-08-13T09:55:13+05:30 IST