అయ్యో పాపం.. ఈ 11 నెలల చిన్నారికి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్‌ను ఇచ్చినా..

ABN , First Publish Date - 2021-08-03T20:54:39+05:30 IST

అరుదైన వ్యాధితో బాధపడుతోందా 11 నెలల చిన్నారి. ప్రాణాలు నిలబడాలంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ తప్పనిసరి. ఆ తల్లిదండ్రులు కలలో కూడా అంత భారీ మొత్తాన్ని సమకూర్చలేరు.

అయ్యో పాపం.. ఈ 11 నెలల చిన్నారికి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్‌ను ఇచ్చినా..

ఇంటర్నెట్ డెస్క్: అరుదైన వ్యాధితో బాధపడుతోందా 11 నెలల చిన్నారి. ప్రాణాలు నిలబడాలంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ తప్పనిసరి. ఆ తల్లిదండ్రులు కలలో కూడా అంత భారీ మొత్తాన్ని సమకూర్చలేరు. ఈ క్రమంలో వాళ్లు దాతలపై ఆధారపడ్డారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.16కోట్లు జమచేశారు. పాపకు ఇంజెక్షన్ అందడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అయితే వారి సంతోషం మూణ్ణాల్ల ముచ్చటే అయింది. ఇంజెక్షన్ ఇచ్చి రెండు నెలలైన తర్వాత ఆదివారం నాడు.. ఆ పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం ప్రారంభించింది. దీంతో భయపడిన తల్లిదండ్రులు ఆమెను పూణేలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ 13 నెలల పాప తుదిశ్వాస విడిచింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.


పూణేకు చెందిన వేదిక అనే 13 నెలల చిన్నారికి ఎస్ఎమ్ఏ(స్పైనల్ మస్కులర్ ఎంట్రాఫీ) అనే అరుదైన వ్యాధి సోకింది. దీని వల్ల పిల్లలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నెమ్మదిగా వారి కదలికలు సన్నగిల్లుతాయి. చివరకు చిన్నారులు మరణించడం జరుగుతుంది. దీనికి జోల్‌గెన్స్‌మా అనే ఇంజెక్షన్ ఒక్కటే ఔషధం అని చెప్తారు. దీని ఖరీదు రూ.16కోట్లు. షిండే దంపతుల కుమార్తె వేదిక ఈ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బు సేకరించిన తల్లిదండ్రులు రూ.16కోట్లు పెట్టి ఇంజెక్షన్ కొన్నారు. దాన్ని వేదికకు అందించడంతో విరాళాలు ఇచ్చిన దాతలు, వేదిక కుటుంబం చాలా సంతోషించారు. ఆ తర్వాత నెలరోజుల వరకూ వేదిక ఆరోగ్యంగానే కనిపించింది. ఆ తర్వాత మళ్లీ కొంచెం ఇబ్బందులు కనిపించాయి. ఆదివారం నాడు అసలు ఊపిరి తీసుకోవడానికే వేదిక ఇబ్బంది పడటం ప్రారంభించింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స తీసుకుంటూ వేదిక కన్నుమూసింది.

Updated Date - 2021-08-03T20:54:39+05:30 IST