చిన్ననీటి వనరులపై శీతకన్ను

ABN , First Publish Date - 2021-01-21T06:12:54+05:30 IST

అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల పరిధిలో శారదా నదిపై గల ఆనకట్టలు, గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

చిన్ననీటి వనరులపై శీతకన్ను
పేరంటాలపాలెం గ్రోయిన్‌

శారదా నదిపై ధ్వంసమైన గ్రోయిన్లు

పూడుకుపోయిన పలు కాలువలు

ఏడాదిన్నర నుంచి మరమ్మతులకు నోచుకోని వైనం

ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వం

వేలాది ఎకరాల ఆయకట్టుకు అందని సాగునీరు


అనకాపల్లి, జనవరి 20: అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల పరిధిలో శారదా నదిపై గల ఆనకట్టలు, గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయకట్టుకు నీరందక వేలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం మరమ్మతులకైనా ఒక రూపాయి విడుదల చేయలేదు. ఇరిగేషన్‌ అధికారులు అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపడమే తప్ప, నిధులు మాత్రం మంజూరుకావడం లేదు. 

అనకాపల్లి మండల పరిధిలో పెద్దేరు నదిపైౖ తగరంపూడి, శారదా నదిపై సీతానగరం, తుమ్మపాల, చెర్లోపలి, యల్లయ్య గ్రోయిన్లు ఉన్నాయి. మునగపాక మండలంలో నాగులాపల్లి గ్రోయిన్‌, గొడారి ఆనకట్ట, కశింకోట మండలంలో ఉగ్గినపాలెం, కాశీమదుం, పేరంటాలపాలెం, వెదురుపర్తి గ్రోయిన్లు ఉన్నాయి. 


తగరంపూడి గ్రోయిన్‌: పెద్దేరుపై నిర్మించిన ఈ గ్రోయిన్‌ కింద 576 ఎకరాల ఆయకట్టు ఉంది. తెలుగుదేశం హయాంలో రూ.50 లక్షల తో పునర్నిర్మాణం చేశారు. గత ఏడాది వర్షా కాలంలో నదిలో వరద ఉధృతికి గ్రోయిన్‌ దెబ్బతిన్నది. రూ.48 లక్షలతో మరమ్మతులు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.


సీతానగరం గ్రోయిన్‌: శారదా నదిపై నిర్మించిన ఈ గ్రోయిన్‌ ద్వారా సీతానగరం, కుంచంగి, వెంకుపాలెం గ్రామాలకు చెందిన 721.33 ఎకరా కు సాగునీరు అందాలి. వరదల కారణంగా పూర్తిగా ఛిద్రమైంది. దీంతో ఆయకట్టుకు సక్రమంగా నీరు అందడం లేదు. మరమ్మతులకు రూ.73.5 లక్షలు మంజూరు చేయాలంటూ అధికారులు ప్రతిపాదనలు పంపారు.


చెర్లోపలి గ్రోయిన్‌: అనకాపల్లి పట్టణానికి సమీపంలో వున్న ఈ గ్రోయిన్‌ కింద 1,168 ఎకరాల ఆయకట్టు ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం ఇది శిథిలావస్థకు చేరుకుంది. తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. రైతులు తాటిచెట్లు, ఇసుక బస్తాలు అడ్డంగా వేసుకొని పొలాలకు నీరు పారించుకుంటున్నారు. గ్రోయిన్‌ మరమ్మతులకు రూ.1.17 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు.


ఎల్లయ్య గ్రోయిన్‌: శారదా నదిపై వున్న ఈ గ్రోయిన్‌ ద్వారా అనకాపల్లి, జగ్గయ్యపేట అగ్రహారం, ఉమ్మలాడ, తోటాడ గ్రామాల పరిధిలో 1,952 ఎకరాలకు నీరందాలి. గత ఏడాది ఇసుక తవ్వకాల కోసం అక్రమార్కులు దీనిని ధ్వంసం చేశారు. దీంతో ఆయకట్టుకు నీరు సరిగా అందడం లేదు. గ్రోయిన్‌ మరమ్మ తులకు రూ.9 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. 


నాగులాపల్లి గ్రోయిన్‌: నాగులాపల్లి, ఒంపోలు గ్రామాల పరిధిలో  720 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది వరదలకు ఇది ధ్వంసం అయ్యింది. కాలువల్లో పూడిక పేరుకు పోవడంతో పొలాలకు నీరు అందడం లేదు. గ్రోయిన్‌కు మరమ్మతులు చేయడంతోపాటు కాలువల్లో పూడిక తీయించాలి. కానీ ఇరిగేషన్‌ అధికారులు ఎటువంటి ప్రతిపాదనలు తయారు చేయలేదు. 

గొడారి ఆనకట్ట: మునగపాక మండల పరిధిలో ఉన్న దీని ద్వారా మునగపాక, తిమ్మరాజుపేట, అరబుపాలెం, హరిపాలెం, కొండకర్ల గ్రామాలకు చెందిన 2,121 ఎకరాలకు సాగునీరు అందాలి. 2012లో వచ్చిన వరదలకు గ్రోయిన్‌ కొట్టుకుపోయింది. తాత్కాలిక మరమ్మతు చేసినా ఫలితం వుండడం లేదు. రూ.20 లక్షలతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. 


కాశీమదుం గ్రోయిన్‌: కశింకోట, బయ్యవరం, వెదురుపర్తి, పెదపాడు, తిమ్మరాజుపేట గ్రామాలకు చెందిన 930 ఎకరాల ఆయకట్టు ఉంది. వరదల కారణంగా ఈ గ్రోయిన్‌ కొట్టుకుపోయింది. సాగునీటి కాలువలు పూడుకుపోయాయి. ఆయకట్టుకు నీరు అందడం లేదు. మరమ్మతులకు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. 

 

వెదురుపర్తి గ్రోయిన్‌:  కశింకోట మండలంలోని ఈ గ్రోయిన్‌ పూర్తిగా శిథిలమయ్యింది. ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టకపోవడంతో  వెదురుపర్తి, పెదపాడు గ్రామాలకు చెందిన 751 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. మరమ్మతులకు రూ.56 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.  


పేరంటాలపాలెం గ్రోయిన్‌: సుమారు 120 ఎకరాలకు నీరు అందించే ఈ గ్రోయిన్‌ ప్రస్తుతం ఎక్కడ వుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నదిలో వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. తర్వాత పునర్నిర్మాణ పనులు చేపట్టలేదు. ఇరిగేషన్‌ అధికారులు రూ.43.5 లక్షలతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. 


ఉగ్గినపాలెం గ్రోయిన్‌: కశింకోట మండలం తేగాడ వద్దనున్న ఈ గ్రోయిన్‌ కింద కొత్తపల్లి, ఉగ్గినపాలెం, తేగాడ, బుచ్చెయ్యపేట గ్రామాల్లో 525 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కూడా పూర్తిగా ధ్వంసం అయ్యింది. గ్రోయిన్‌ పునర్నిర్మాణానికి రూ.89 లక్షలతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు.


రూ.5.48 కోట్లతో ప్రతిపాదనలు పంపాం

- హనుమంతరావు, ఏఈ, ఇరిగేషన్‌

మా పరిధిలోని గ్రోయిన్ల మరమ్మ తులు, కాలువల అభివృద్ధి పనులకు రూ.5.48 కోట్లు మంజూరు చేయాలని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. నాగులాపల్లి గ్రోయిన్‌ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయలేదు. 

Updated Date - 2021-01-21T06:12:54+05:30 IST