పతన ఆర్థికమూ పాక్షిక స్వేచ్ఛలూ

ABN , First Publish Date - 2021-03-06T06:12:12+05:30 IST

ఆర్థికవ్యవస్థ క్షీణిస్తోంది. పౌరస్వేచ్ఛలు సన్నగిల్లుతున్నాయి. ఈ వైపరీత్యాలు దేశ శ్రేయస్సుకు దోహదం చేయవు. ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రాజ్యాంగ విహితులు అందరూ పూనుకోవాలి. పంజాబ్....

పతన ఆర్థికమూ పాక్షిక స్వేచ్ఛలూ

ఆర్థికవ్యవస్థ క్షీణిస్తోంది. పౌరస్వేచ్ఛలు సన్నగిల్లుతున్నాయి. ఈ వైపరీత్యాలు దేశ శ్రేయస్సుకు దోహదం చేయవు. ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రాజ్యాంగ విహితులు అందరూ పూనుకోవాలి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ప్రతిఘటనా మార్గాన్ని ఎంచుకున్నారు. అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఓటర్ల ముందు మరో మార్గం ఉంది.


భారత ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవ పథంలో ఉందా లేదా అనేది ఒక చర్చనీయాంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆర్థికవ్యవస్థ 0.4 శాతం పెరుగుదల సాధించిందన్న ఎన్‌ఎస్‌ఓ అంచనాపై ప్రభుత్వం బ్రహ్మానందపడిపోతోంది, ఘనంగా చెప్పుకుంటోంది. గణాంక తప్పిదాలను పరిగణనలోకి తీసుకుంటే 0.4 శాతం పెరుగుదల అంటే అది సున్నా శాతం అయినా కావచ్చు లేదా 0.8 శాతం అయినా కావచ్చు. 


దేశ ఆర్థికవ్యవస్థ సత్వరమే పునరుద్ధరణ కావాలని మనం కోరుకుంటున్నాం. కనీసం వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018–-19 ఆర్థిక సంవత్సరంలో వలే రూ.140.03 లక్షల కోట్ల స్థాయిని లేదా 2019-–20 వలే రూ.145.09 లక్షల కోట్ల స్థాయిని అందుకోవడం శుభస్కరమవుతుంది. ఆ రెండు ఆర్థిక సంవత్సరాలలోనూ వృద్ధిరేట్లు తగ్గిపోయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ వరుసగా 6.1 శాతం, 4.0 శాతం పెరుగుదలను సాధించింది. 


ఆ మరుసటి సంవత్సరం అంటే 2020–-21లో కరోనా మహమ్మారి దేశాన్ని అన్ని విధాలా కుదిపివేసింది. అసలే అసమర్థ నిర్వహణతో కుదేలైపోయిన ఆర్థికవ్యవస్థ మహమ్మారి దెబ్బకు పూర్తిగా మాంద్యంలోకి జారిపోయింది. గత నాలుగు దశాబ్దాలలో ఇలా ఆర్థికవ్యవస్థ మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి. ఎన్‌ఎస్‌ఓ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (నిలకడ గల ధరలలో) రూ.134.09 లక్షల కోట్ల జీడీపీతో ముగియనున్నది. 2019–-20లో కంటే 2020-–21లో ఆర్థికవ్యవస్థలో వృద్ధి -8.0 శాతం తక్కువగా ఉంది. నిజానికి అది అంతకంటే ఘోరంగా ఉండవచ్చు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 0.4 శాతం పెరుగుదలను సాధించినప్పటికీ, 2020–-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించిన అంచనాల ప్రాతిపదికన చూస్తే అనేక అంశాలు కలవరం కలిగిస్తున్నాయి. అవి: (1) 2020-–21లో ఆర్థికవ్యవస్థ పెరుగులకు ప్రధాన కారణం వ్యవసాయరంగం నమోదు చేసిన 3.9 శాతం వృద్ధిరేటు, నిర్మాణరంగం సాధించిన 6.2 శాతం వృద్ధిరేటు. అయితే మైనింగ్, తయారీరంగం, వర్తకం, హోటల్స్, రవాణా రంగాలలో పెరుగుదల గణనీయంగా క్షీణించింది. (2) స్థూల స్థిరీకృత పెట్టుబడి కల్పన రూ.41,44,957 కోట్లు మాత్రమే. 2018-–19, 2019-–20 ఆర్థిక సంవత్సరాలలో కంటే ఇది తక్కువగా ఉండడమే కాక జీడీపీలో కేవలం 30.9 శాతమే. (3) ఎగుమతుల విలువ రూ.25,98,162 కోట్లు కాగా దిగుమతుల విలువ రూ.27,33,144 కోట్లు. ఇవి రెండూ గత రెండు ఆర్థిక సంవత్సరాలలో కంటే తక్కువ. జీడీపీలో ఇవి 19.4 శాతం, 30.4 శాతంగా ఉన్నాయి. (4) తలసరి జీడీపీ రూ.1 లక్ష నుంచి రూ.98,928లకు తగ్గిపోయింది. బిలియనీర్లు (వీరి సంఖ్య 2020లో 40కి పెరిగింది) మినహా ప్రతి ఒక్కరూ సాపేక్షంగా పేదరికంలోకి జారిపోయారు. కోట్లాది మంది దారిద్ర్యరేఖ దిగువకు కూలిపోయారు. ఇప్పటికే ఈరేఖ దిగువున ఉన్న కుటుంబాలు మరింత కటిక పేదరికం కోరల్లో చిక్కుకోవడంతో పాటు అప్పులపాలయ్యాయి. (5) మాంద్యమూ, మహమ్మారీ ఆర్థికవ్యవస్థనే కాదు విద్య, ప్రజారోగ్య రంగాలనూ కుదేలుపరిచాయి. పేద కుటుంబాల బాలలకు పోషకాహారం కనీసస్థాయిలో కూడా లభించని విపత్కర పరిస్థితులను కల్పించాయి.


ఇదీ మన ఆర్థికవ్యవస్థ పరిస్థితి. ఆశాజ్యోతులు ఎంతకూ మిణుకుమిణుకు మంటున్నాయి తప్ప అంతకుమించి ప్రకాశించడం లేదు. ప్రైవేట్ పెట్టుబడులు పత్తా లేనప్పుడు ఏ ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది? కనుక చిన్నపాటి పురోగతికి బ్రహ్మానంద పడిపోనవసరం లేదు. నాలుగవ త్రైమాసికంతో పాటు ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించిన అంచనాలు వెలువడేంతవరకు వేచి ఉండడం మంచిది. 


ఆర్థికం ఇలా అఘోరిస్తున్నప్పుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయా? స్వేచ్ఛా సూచీలలో మనదేశం స్థానం ఇంకాస్త పడిపోయింది. ప్రపంచ పత్రికాస్వాతంత్ర్యం సూచీలో భారత్, మొత్తం 180 దేశాలలో 142వ స్థానంలో ఉంది. మానవస్వేచ్ఛా సూచీలో 162 దేశాలలో మన దేశం 111వ స్థానంలో ఉంది. ఇవి చెబుతున్న వాస్తవమేమిటి? భారత్‌లో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు తగ్గిపోయాయనే కాదూ? ‘ఫ్రీడమ్ హౌజ్’ అనే అమెరికా మేధోమండలి కూడా ఇదే వాస్తవాన్ని ధ్రువీకరించింది. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలలో పరిగణనలోకి తీసుకున్న 100 దేశాలలో భారత్ స్థానం 71 నుంచి 67కి పడిపోయిందని ‘ఫ్రీడమ్ హౌజ్’ నివేదిక పేర్కొంది. భారత్ పాక్షికంగా మాత్రమే స్వేచ్ఛాదేశమని ఆ మేధో మండలి వ్యాఖ్యానించింది. ఎక్కడెక్కడివారో అలా అన్నారు, ఇలా అన్నారని చెప్పుకోవడమెందుకు, ఇటీవలి సంవత్సరాలలో మన సామాన్య ప్రజల అనుభవాలలోకి వచ్చిన కఠోర వాస్తవాలలో తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు క్రమంగా హరించుకుపోతున్నాయనేది కూడా ఒకటి కాదూ? 


మన మీడియా స్వేచ్ఛాయుతంగా వ్యవహరించగలుగుతోందా? ఇంచుమించు ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు అన్నీ కేంద్రంలోని పాలకులకు విధేయంగా వ్యవహరిస్తున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వానికి, అధికార పక్షానికి ‘హిజ్ మాస్టర్ వాయిస్’ లా వ్యవహరిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారమే మహిళలు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలకు వ్యతిరేకంగా నేరాలు పెరిగిపోతున్నాయి. నేరస్థులు చాలా నిర్భీకంగా దుశ్చర్యలకు పాల్పడడానికి కారణమేమిటి? ఉగ్రవాదం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి దాకా ప్రతి దానికీ ముస్లింలను బలిపశువులను చేయడం వాస్తవం కాదా? కేంద్రప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరించడం లేదా? క్రిమినల్ చట్టాలు మరింత అణచివేతకు దోహదం చేయడం లేదా? పన్నులచట్టాలు, పన్ను వసూళ్ల పాలన చట్టబద్ధంగా వ్యవహరించే పౌరులకు సైతం దుర్భర పరిస్థితులను సృష్టించడం లేదా? పోలీసు, దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నాయా? ఆర్థిక విధానాలు కుబేరులకు సానుకూలంగా ఉంటూగుత్తాధిపత్యాలను పెంపొందించడానికే తోడ్పడుతున్నాయి. ఇవన్నీ తిరుగులేని వాస్తవాలు కాదా? 


ఆర్థికవ్యవస్థ క్షీణిస్తోంది. పౌరస్వేచ్ఛలు సన్నగిల్లుతున్నాయి. ఈ వైపరీత్యాలు దేశ శ్రేయస్సుకు దోహదం చేయవు. ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రాజ్యాంగ విహితులు అందరూ పూనుకోవాలి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ప్రతిఘటనా మార్గాన్ని ఎంచుకున్నారు. అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఓటర్ల ముందు మరో మార్గం ఉంది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-03-06T06:12:12+05:30 IST