విగ్రహాల ధ్వంసం.. వైసీపీ-బీజేపీ కుట్ర

ABN , First Publish Date - 2021-01-09T08:13:45+05:30 IST

‘‘విగ్రహాల ధ్వంసం వైసీపీ, బీజేపీ ఉమ్మడి కుట్ర. ఇది పకడ్బందీ వ్యూహంతో జరుగుతున్న విధ్వంసం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ పేర్కొన్నారు.

విగ్రహాల ధ్వంసం.. వైసీపీ-బీజేపీ కుట్ర

  • టీడీపీని క్లోజ్‌ చేయడమే వాటి ఉద్దేశం
  • దోషులను పట్టుకునే ప్రయత్నమేదీ?
  • ముస్లిం, క్రైస్తవ ఓట్లతో వైసీపీకి,హిందూ ఓట్లతో బీజేపీకి లబ్ధి!
  • ఈ పన్నాగం బాబుకూ అర్థమైంది
  • అందుకే ఘటనలు జరిగిన చోట్ల బీజేపీ కంటే ఆయనే ముందున్నారు
  • కానీ క్రైస్తవులపై వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది
  • దర్యాప్తు బాధ్యత ఆ అధికారికా?
  • సిటింగ్‌ జడ్జి పర్యవేక్షణలో జరిగితేనే దోషులు బయటికి: హర్షకుమార్‌ 


రాజమహేంద్రవరం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘విగ్రహాల ధ్వంసం వైసీపీ, బీజేపీ  ఉమ్మడి కుట్ర. ఇది పకడ్బందీ వ్యూహంతో జరుగుతున్న విధ్వంసం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ పేర్కొన్నారు. ‘130కి పైగా దేవాలయాలు, దేవతామూర్తుల మీద దాడులు జరిగాయి. రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలూ దోషులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే, ఇది ఈ రెండు పార్టీలు కలసి ఆడుతున్న కుట్ర’ అని శుక్రవారమిక్కడ ధ్వజమొత్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా హిందువుల ఓట్లు బీజేపీ.. ముస్లిం, క్రైస్తవ ఓట్లు వైసీపీ పొందాలని పన్నాగం పన్నారని.. తద్వారా టీడీపీని క్లోజ్‌ చేయాలనేదే వాటి ఉద్దేశమని తెలిపారు. ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు అంబేడ్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేశారు. అవి నేనే చేయించానన్నారు. అప్పటి స్థానిక మంత్రితోపాటు బొత్స సత్యనారాయణ కూడా ఎంక్వయిరీ చేయించారు. విగ్రహాలు పగిలిన ప్రాంతాల్లోని టవర్ల నుంచి ఫోన్లు తెలుసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించారు. కేవలం 4 రోజుల్లో దోషులను పట్టుకున్నారు. ఎంత నిశితంగా పరిశీలన జరిగిందంటే.. రాత్రి 12 గంటల సమయంలో అమలాపురంలో ఉన్నారనే కారణంతో విశాఖపట్నంలో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు పోలీసులు కావాలనుకుంటే విగ్రహాల ధ్వంసం చేసిన వారిని పట్టేసుకోగలరు. పట్టుకోవడం లేదంటే కేంద్రం నుంచి వస్తున్న ఆదేశాలే కారణం. కొంతకాలంగా జగన్మోహన్‌రెడ్డి మైనారిటీ, దళిత వర్గాలపై పగ పట్టినట్టు వ్యవహరించడం వల్ల ఆయనకు ఈ వర్గాలు దూరమయ్యాయి. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక రానుంది. ఈ సమయంలో మత విద్వేషాలు సృష్టిస్తే బీజేపీ, వైసీపీ లాభపడవచ్చు. తెలుగుదేశం నష్టపోతుంది. దీనిని చంద్రబాబు అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. ఆయన బీజేపీకి స్థానం ఇవ్వకుండా విగ్రహాలు విధ్వంసం చేసిన ప్రాంతాల్లో తానే ముందు పర్యటించారు. బీజేపీ వెనుకబడింది. కానీ ఆయన క్రైస్తవులను ఏమీ అనకుండా ఉంటే బావుండేది’ అని హర్షకుమార్‌ వ్యాఖ్యానించారు.


దాడులపై దర్యాప్తునకు ఒక ఆఫీసర్‌ను వేశారని.. ఆయన ఓ సంస్థ నడుపుకొంటున్నారని.. ఆయన్నెలా నియమిస్తారని ప్రశ్నించారు. ‘పైగా ఉద్యోగ విరమణ తర్వాత ఆయనకు వైసీపీ టికెట్‌ ఇస్తారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్మోహన్‌రెడ్డి ఏమి చెబితే అదే రిపోర్ట్‌ ఇస్తాడాయన. సుప్రీంకోర్టు/హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపితేనే దోషులు బయటకు వస్తారు. లేకపోతే రారు’ అని స్పష్టం చేశారు. ‘విజయసాయిరెడ్డి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. తెలుగుదేశం వాళ్లే దాడులు చేస్తున్నారని ఆరోపించడం ఏంటి? టీడీపీ వాళ్లే చేశారని పట్టుకుని చూపించాలి’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలను హర్షకుమార్‌ తప్పుబట్టారు. పెద్దాచిన్నా తెలుసుకోనక్కర్లేదా అని ప్రశ్నించారు.


వైసీపీ నిర్లక్ష్యం వల్లే దళితులపై దాడులు

‘రాయలసీమలో స్నేహలత అనే అమ్మాయికి ఏడాది నుంచి పోలీసు రక్షణ అడిగినా ఇవ్వలేదు. చివరకు రేప్‌ చేసి, పెట్రోలు పోసి చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం క్లియర్‌గా ఉంది. కర్నూరులో మూడుచర్ల అనే గ్రామంలో ఓ వ్యక్తిని చంపేశారు. మరో ఇద్దరు కులాంతర వివాహం చేసుకుంటే దారి కాచి చంపేశారు. పులివెందులలో నాగమ్మ అనే మహిళను రేప్‌ చేసి చంపేశారు. ఒంగోలులో ఇద్దరు ప్రేమికులకు ఆగస్టు 14న వివాహం. అమ్మాయి రాజంపేట రెడ్డి, అబ్బాయి ఎస్సీ.  కడప నుంచి ఆరు కార్లలో వచ్చి, అబ్బాయి తమ్ముడిని తండ్రిని కార్లలో ఎక్కించుకుని కొట్టి, అమ్మాయిని తీసుకుపోయారు.


కిరణ్‌కుమార్‌ను చంపేసినా, శిరోముండనంలో రాష్ట్రపతి జోక్యం చేసుకున్నా లెక్కలేదు. జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. వారిప్రతి ఒక్కరి కుటుంబానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకూ పరిహారం ఇవ్వవలసిన బాధ్యత సీఎంపై ఉంది. ఇవన్నీ తప్పించుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రామతీర్థం దేవాలయానికి బీజేపీ వాళ్లు వెళ్తే నష్టమేంటి? పరిశీలించి వస్తారు. వారిని అడ్డుకుంటే బీజేపీకి ఇంకా ప్రచారం వస్తుంది. కానీ ఉద్యమాన్ని ప్రేరేపించడమే లక్ష్యం. ఈ క్రైస్తవ ప్రభుత్వం, జగన్‌ ప్రభుత్వం దేవాలయాల్లోకి తమను రానీయడం లేదు కాబట్టి, హిందువులంతా ఒక తాటిపైకి రావాలని.. జగన్‌కు హిందువులంటే పడదు.. అందువల్ల బీజేపీకి ఓటేయాలి. ఇతడిని తరిమికొట్టాలని రెచ్చగొట్టి బీజేపీ హిందువుల ఓట్లు పొందాలి.. హిందువులంతా జగన్‌ మీద కక్షకట్టారని వైసీపీ దళితులు, మైనారిటీల్లో ప్రచారం చేసి, వారంతా జగన్‌కు ఓటేసేలా చేయాలి.. ఇది స్పష్టమైన ప్లానింగ్‌. హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ముందుపెట్టి గెలిచారు. ఇక్కడ బైబిలా, భగవద్గీతా అని చెప్పి  గెలవాలి. విగ్రహాలను కూల్చివేస్తే, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. అదీ సంగతి’ అని చెప్పారు. జగన్‌ హయాంలో ఎంతమంది ఎస్సీలను పోలీసులతో చంపించారో.. ఎక్కడెక్కడ ఏమి జరిగిందో వారంరోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తాన న్నారు. ఎస్సీలు, బీసీలు, కాపులకు ఒకలోన్‌ ఇవ్వలేదని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ కింద బడ్జెట్‌లో ఎస్సీలకు రూ.16 వేల కోట్లు, ఎస్టీలకు రూ.7.5 కోట్లు కేటాయించారని..అవి ఎలాఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. ‘నాతోపాటు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు కూడా స్కాలర్‌షి్‌పతో చదువుకున్నారు.


ఇవాళ ఇది డిగ్రీకే పరిమితం. పీజీకి తీసేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇవి ఉన్నాయి. నీవు ఇచ్చినవి కావు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వైఎస్‌ ఇచ్చారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీలకూ తీసేశావ్‌. తీయడానికి నీకేం హక్కుంది? ఇందులో 50శాతం వాటా కేంద్రం ఇస్తుంది. నీవు ఇవ్వకపోతే మానేయ్‌. కేంద్రం వాటా కూడా తిరస్కరిస్తున్నావంటే, ఎస్సీలపై ఎంత ద్వేషం ఉందో అర్థమవుతోంది’ అని హర్షకుమార్‌ విరుచుకుపడ్డారు.

Updated Date - 2021-01-09T08:13:45+05:30 IST