డిటెక్టివ్‌ బీర్బల్‌!

ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST

రామయ్య మంచి పనిమంతుడు. రాజావారి తోటలో పనులన్నీ చూసుకునే వాడు. సాదా సీదాగా ఉంటూ, ఎప్పుడూ తోటలోనే ఏదో ఒక పనిచేస్తూ ఉండేవాడు. పనిచేయగా వచ్చిన డబ్బును ఖర్చుపెట్టకుండా ఒక రహస్య ప్రదేశంలో

డిటెక్టివ్‌ బీర్బల్‌!

రామయ్య మంచి పనిమంతుడు. రాజావారి తోటలో పనులన్నీ చూసుకునే వాడు. సాదా సీదాగా ఉంటూ, ఎప్పుడూ తోటలోనే ఏదో ఒక పనిచేస్తూ ఉండేవాడు. పనిచేయగా వచ్చిన డబ్బును ఖర్చుపెట్టకుండా ఒక రహస్య ప్రదేశంలో దాచుకునేవాడు. ఒకరోజు రామయ్య దాచుకున్న డబ్బును ఎవరో దొంగతనం చేశారు. దాంతో రామయ్య బీర్బల్‌ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ‘‘నేను జీవితకాలం కష్టపడి సంపాదించిన వెయ్యి బంగారు నాణేలు ఎవరో దొంగలించారు’’ అంటూ ఏడుస్తూ బీర్బల్‌కు చెప్పుకున్నాడు.


‘‘వాటిని  ఎక్కడ దాచావు?’’ అని అడిగాడు బీర్బల్‌. ‘‘తోటలో ఉన్న పియర్‌ చెట్టు కింద తవ్వి దాచి పెట్టుకున్నాను’’ అని చెప్పాడు రామయ్య. ‘‘అక్కడ ఎందుకు దాచావు?’’ అని అడిగాడు బీర్బల్‌. ‘‘రోజంతా తోటలోనే పనిచేస్తుంటాను కదా! ఎప్పుడూ చూసుకోవచ్చు. అక్కడైతే భద్రంగా ఉంటుందని దాచాను’’ అని అన్నాడు రామయ్య. ‘‘ఆ ప్రదేశం గురించి ఇంకెవరికైనా తెలుసా?’’ అని ప్రశ్నించాడు బీర్బల్‌. ‘‘లేదు. నా ఒక్కడికే తెలుసు’’ అని సమాధానం ఇచ్చాడు రామయ్య. చెట్టు కింద తవ్విన వారే బంగారు నాణేలు తీశారు. అక్కడ తవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఆలోచించాడు బీర్బల్‌. మరుసటి రోజు పట్టణంలో ఉన్న ఆయుర్వేద వైద్యులందరినీ పిలిపించాడు. ‘‘పియర్‌ ట్రీలో ఏ భాగమైనా మందుగా పనికొస్తుందా?’’ అని ప్రశ్నించాడు.


వారిలో ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడొకరు ‘‘పియర్‌ ట్రీ వేర్లను, మరికొన్ని హెర్బ్స్‌ను కలిపి ఒక పేస్టు తయారుచేసి కామెర్ల వ్యాధితో బాధపడుతున్న సేఠ్‌ హజారిమాల్‌కు ఇచ్చాను’’ అని చెప్పాడు. వెంటనే హజారిమాల్‌ను పిలిపించాడు బీర్బల్‌. ‘‘నువ్వు కామెర్ల వ్యాధి తగ్గడం కోసం పియర్‌ ట్రీ వేర్లు, హెర్బ్స్‌తో తయారుచేసిన మందు తీసుకున్నావా?’’ అని హజారిమాల్‌ను ప్రశ్నించాడు బీర్బల్‌. ‘‘అవును’’ అన్నాడు హజారిమాల్‌. ‘‘పియర్‌ చెట్టు వేర్లు నీకు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు?’’ అని అడిగాడు బీర్బల్‌. ‘‘మా పనివాడు తెచ్చాడు’’ అన్నాడు హజారిమాల్‌. అయితే వెంటనే నీ పనివాణ్ణి పిలువు అని ఆదేశించాడు బీర్బల్‌. కాసేపయ్యాక పనివాడు బీర్బల్‌ ముందు నిలుచున్నాడు. ‘‘పియర్‌ చెట్టు వేర్లు తవ్వి తీసుకొచ్చావా?’’ అని ప్రశ్నించాడు బీర్బల్‌. ‘‘అవును’’ అన్నాడు పనివాడు.


‘‘ఆ చెట్టు ఎక్కడుంది? అని అడిగితే రాజావారి తోటలో’’ అని సమాధానం ఇచ్చాడు. ‘‘అయితే అక్కడ దొరికిన బంగారు నాణేల సంచి వెంటనే తెచ్చి ఇవ్వు’’ అన్నాడు బీర్బల్‌. దాంతో బిత్తర పోయాడు పనివాడు. ‘‘బంగారునాణేల సంచి తిరిగి తెచ్చిస్తే నీకు శిక్ష లేకుండా చేస్తా! లేదంటే...’ అని బెదిరించాడు బీర్బల్‌. దాంతో పనివాడు తన తప్పు ఒప్పుకుని, పరుగెత్తుకుంటూ వెళ్లి సంచిని తెచ్చి ఇచ్చాడు.  బీర్బల్‌ ఆ నాణేల సంచిలో నుంచి ఐదు నాణేలను పనివాడికి ఇచ్చాడు.


తరువాత రామయ్యను పిలిచి బంగారు నాణేల సంచిని ఇచ్చేశాడు. నిర్లక్ష్యంగా దాచుకున్నందుకు నీ సంచిలో నుంచి ఐదు నాణేలను తీసుకున్నాను. మళ్లీ ఇంకోసారి తెలివితక్కువ పనులు చేయకు అని మందలించి పంపించాడు. రామయ్య మనసులో బీర్బల్‌కు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.


Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST