‘డీటాక్స్‌ డైట్‌’ ఎలా చేయాలి?

ABN , First Publish Date - 2020-08-01T07:44:18+05:30 IST

‘డీటాక్స్‌ డైట్‌’ మంచిదని, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే బాగుంటుందని, జీర్ణకోశానికి

‘డీటాక్స్‌ డైట్‌’ ఎలా చేయాలి?

‘డీటాక్స్‌ డైట్‌’ మంచిదని, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే బాగుంటుందని, జీర్ణకోశానికి విశ్రాంతి ఇవ్వొచ్చని, శరీరంలో ఉన్న మలినాలను తొలగించొచ్చని... ప్రతీ శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను. అయితే దీనివల్ల తలనొప్పి వస్తోంది. సాయంత్రానికి నీరసం వస్తోంది. ఇలా రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలి? డీటాక్స్‌ డైట్‌ ఎలా చేయాలి?

-శ్రీదేవి, హైదరాబాద్‌


డీటాక్స్‌ డైట్‌, ఉపవాసం శరీరానికి ఒకవిధంగా మేలు చేస్తాయి. మరొక విధంగా చెడు చేస్తాయి. డీటాక్స్‌ అంటే శరీరంలో ఉన్న టాక్సిన్లను తొలగించడం. ఏ టాక్సిన్‌ ఏ ఆహారాన్ని తొలగిస్తుందనే విషయం నిజానికి తెలియదు. కానీ జీర్ణకోశం, కాలేయం, చర్మం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మన శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని నిరంతరం తొలగిస్తూనే ఉంటాయి. ఇదే సరైన డీటాక్సిఫికేషన్‌. మరి డీటాక్స్‌ డైట్‌ సంగతి ఏంటి? అంటే... వాడుకలో చాలా రకాల డీటాక్స్‌ డైట్స్‌ ఉన్నాయి. 1. ఉపవాసం (ఇప్పుడు మీరు చేస్తున్నది). దీనిలో భాగంగా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఉపవాసం చేస్తారు కొందరు. 2. పండ్లు, కూరగాయలు మాత్రమే తీసుకోవడం (వారానికి ఒకసారి. ఇది చాలా మేలు చేస్తుంది), 3. కేవలం నిమ్మరసం, ఉప్పు కలిపిన నీళ్లు మాత్రమే తాగి ఉండటం, 4. కొలోన్‌ క్లీన్సింగ్‌ (పెద్ద ప్రేగు శుభ్రం చేయడం... దీనిని ప్రత్యేకంగా ఎనిమా ఇచ్చి చేస్తారు). 5. విరోచనకారిణి (లాక్సేటివ్స్‌) ఉపయోగించడం.


ఎలా చేయాలంటే...

- సమతుల ఆహారం తీసుకోవాలి. పీచుపదార్థం సమృద్ధిగా ఉండాలి. అప్పుడు మలబద్ధకం లేకుండా ప్రతిరోజూ సుఖ విరోచనమై పెద్ద పేగులో పేరుకున్న విషపదార్థాలన్నీ పోతాయి. వారానికి ఒకసారి పండ్లు, కూరగాయలు మాత్రమే తినడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. పేగుల్లో పేరుకున్న మలం విసర్జన జరుగుతుంది. నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. దీనివల్ల జీర్ణకోశం, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ప్రతీరోజూ చాలామంది డీటాక్స్‌ వాటర్‌ అని నిమ్మ బద్దలు, కీరా ముక్కలు వేసిన నీళ్లు తాగుతారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌ అవుతుంది. 

- మూత్రపిండాల ఆరోగ్యం సరిగా ఉండాలంటే రోజుకు కనీసం 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి. డీటాక్స్‌ వాటర్‌ కూడా ఉపయోగపడుతుంది. అవసరానికి మించి ప్రొటీన్‌ పౌడర్లు, సొంతంగా సప్లిమెంట్స్‌ వాడకం మానెయ్యాలి. ఇవి మూత్రపిండాలు, కాలేయంపైన అధిక ఒత్తిడిని కల్గించడమే కాకుండా, హాని కూడా చేయొచ్చు. 

కాబట్టి మీరు ప్రతీరోజూ సమతుల ఆహారం తీసుకుని, మలబద్ధకం లేకుండా చూసుకుని, వారానికి ఒకసారి పండ్లు, వెజిటబుల్‌ సూప్స్‌, నీళ్లతో ఉపవాసం వేస్తే నీరసం రాదు. మధుమేహం ఉన్నవారు మాత్రం ఉపవాసాలు చేయకూడదు. 

 డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 



Updated Date - 2020-08-01T07:44:18+05:30 IST