దేవాదాయం.. పరాధీనం

ABN , First Publish Date - 2021-06-22T07:09:06+05:30 IST

జిల్లాలోని దేవాలయాల భూముల అవకతవకలను వెలికి తీసేందుకు ఎన్‌పోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి.

దేవాదాయం.. పరాధీనం
ఉదాసీమఠం భూముల్లో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు

జిల్లాలో ఆలయ భూములు అన్యాక్రాంతం 

 రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు 

 న్యాయ వివాదాల పరిష్కారంపై దృష్టి 

నిర్మల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని దేవాలయాల భూముల అవకతవకలను వెలికి తీసేందుకు ఎన్‌పోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి. ఈ మేరకు దేవాదాయశాఖ అక్రమణకు గురైన భూముల లెక్కలను తేల్చేందుకు సిద్ధమవుతోంది. గతకొద్ది సంవత్సరాల నుంచి దేవాలయాల భూములను కొంతమంది తమకున్న పలుకుబడి, పరపతితో కబ్జా చేసినట్లు ఫిర్యాదులున్నాయి. మొదటలీజుల భూములను అక్రమించుకోగా ఆ తరువాత ఆ భూములను తమ సొంతం చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతోపాటు దేవాలయాల భూ ముల రికార్డులను తారుమారు చేయడం, ఆ భూముల విస్తీర్ణాన్ని తలకిందులు చేసి ఆక్రమణలకు పాల్పడ్డారన్న ప్రచారం ఉంది. ఏళ్ల నుంచి దేవాదాయశాఖ అధికారులు ఈ భూములపై సరియైున దృష్టి కేంద్రీకరించకపోవడంతో ఈ అక్రమణలకు అడ్డు లేకుండాపోయింది. ముఖ్యం గా ఉమ్మడి రాష్ట్రహయాంలో దేవాలయాల భూములను కొంతమంది పథకం ప్రకారం తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత దేవాదాయశాఖ తన భూముల వివరాల సేకరణలో నిమగ్నమైంది. పాత రికార్డులు చాలా చోట్ల మాయమైపోయినట్లు విమర్శలున్నాయి. రెవెన్యూశాఖ వద్ద అలాగే దేవాదాయశాఖ వద్ద ఉన్న రికార్డులను సైతం తారుమారు చేసినట్లు ప్రచారం ఉంది. జిల్లాలో మొత్తం దేవాదాయశాఖ పరిధిలో 72 ఆలయాలు ఉన్నట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. ఈ ఆలయాల పరిధిలో 1381.7 ఎకరాల భూమి ఉంది. ఇదంతా రికార్డులకే పరిమితమవుతుండగా ఇందులో నుంచి చాలా ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు విమర్శలున్నాయి. మరి కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతో ఈ భూముల వివాదాలు కొనసాగుతున్నాయి. కుభీర్‌ మండలంలోని విఠలేశ్వరస్వామి ఆలయభూములు, అలాగే నర్సింహస్వామి ఆలయభూములు, బాసర ఆలయానికి సంబందించి మహారాష్ట్రలోని బాలాపూర్‌లోని భూములు కొంతమేరకు అక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు ఉండడమే కాకుండా ఈ వ్యవహారం ప్రస్తు తం కోర్టులో కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్‌ వద్ద ఉన్న ఉదాసీమఠం భూములు సైతం ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులున్నాయి. దేవాదాయశాఖ అధికారులు 2.06 ఎకరాల భూమి ఉదాసీమఠంకు చెందినదిగా చెబుతున్నారు. గతంలో దీని విస్తీర్ణం ఎక్కువగా ఉండేదని, ఆక్రమణల కారణంగా విస్తీర్ణం తగ్గిపోవడమే కాకుండా రికార్డులను సైతం తారుమారు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం భూములను ఆక్రమించిన వారికి దేవాదాయశాఖ నోటీసులు సైతం జారీ చేసింది. ఈ వ్యవహారం కోర్టు కు ఎక్కడంతో ప్రస్తు తం యథాతధ స్థితి కొనసాగుతోందంటున్నారు. అలాగే కుభీ ర్‌ మండలంలోని విఠలేశ్వర ఆలయానికి సంబందించి 28.07 ఎకరాల భూమిపై కూడా కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. కుభీర్‌ మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, అలాగే విఠలేశ్వర ఆలయానికి సంబందించి ఆలయభూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుభీర్‌లోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి సంబంధించి 5.10 ఎకరాల భూమి, బాసర వద్ద గల విఠలేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన 18.10ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాసర ఆలయానికి సంబంధించి 22 ఎకరాల భూమి వ్యవహారం ప్రస్తుతం ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మహరాష్ట్రలోని బాలాపూర్‌లో గల 14 ఎకరాలు, బాసరలో 8 ఎకరాలున్నట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 

రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌

దేవాలయాల భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు రక్షించి రికార్డులను సరి చేయడమే కాకుండా వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగనున్నాయంటున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ జిల్లాల వారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసి ఆక్రమణకు గురైన భూముల లెక్కలను వెలుగులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. దేవాలయ ట్రిబ్యునల్‌లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పక్కన పెట్టి మిగతా భూములను ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు పరిశీలించనున్నాయి. జిల్లాలోని 72 దేవాలయాల భూములు, వాటి ఆదాయ వ్యయాలను కూడా ఈ ఎన్‌పోర్స్‌మెంట్‌ బృందం పరిశీలించనుంది. దేవాదాయశాఖ వద్ద ఉన్న భూముల రికార్డులను అలాగే రెవెన్యూశాఖ వద్ద ఉన్న రికార్డులను ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిర్ధారించనున్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌ ద్వారా భూ వ్యవహారాలన్నీ కొనసాగుతున్నందున ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు పాత రికార్డులను సైతం తిరగతోడనున్నట్లు పేర్కొంటున్నారు. కాగా ఆలయాల వారీగా భూ లెక్కలను నిగ్గు తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు దేవాదాయశాఖ పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే భూముల లెక్కలను తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగబోతున్నాయన్న ప్రచారంతో సంబంధితశాఖ అధికారులు ముందుగానే అప్రమత్తమవుతున్నారంటున్నారు. తమ వద్ద ఉన్న పాత రికార్డులను సరిచేయడం, అలాగే క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న భూముల స్థితిగతులను తెలుసుకోవడం లాంటి పనిలో తలమునకలవుతున్నారంటున్నారు. 

మంత్రి హెచ్చరికలతోనే 

దేవాదాయ భూములు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైనట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ శాఖకు నేతృత్వం వహిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దీనిపై సంబంధిత అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోని దేవాలయ భూముల స్థితిగతులపై ఆయన సంబందిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్ష ద్వారా ఆయన భూముల ఆక్రమణలపై ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో స్థానికుల ద్వారా అలాగే ఇంటిజెన్స్‌ ద్వారా దేవాలయాల భూముల ఆక్ర మణలపై మంత్రి అల్లోల ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగానే మంత్రి ఇక భూముల లెక్కలు తేల్చాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఇప్పటికే పలుసార్లు భూములపై విచారణ జరిగినప్పటికి పెద్దగా ఫలితం తేలలేదు. ఎట్టకేలకు ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను రంగంలోకి దించాలని మంత్రి నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే జిల్లాల వారిగా ఎన్‌పోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగబోతున్నందున జిల్లాలోని 72 దేవాలయాలకు సంబంధించిన భూముల లెక్కలతో పాటు ఆధాయవ్యయాలు, ఆ ఆలయాల స్థితి గతులు వెల్లడికానున్నట్లు పేర్కొంటున్నారు. దేవాదాయశాఖ మంత్రిగా ఇప్పటికే పలు దేవాలయాల అభివృద్దికి, కొత్త ఆలయాల నిర్మాణాలకు రూ. 100కోట్లకు పైగా మంజూరు చేయించారు. అలాగే దేవాలయాల భూములను కాపాడి ఈ భూముల ద్వారా ఆలయాలకు అదనపు ఆదా యం సమకూర్చాలని మంత్రి భావిస్తునట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-06-22T07:09:06+05:30 IST