Abn logo
May 4 2021 @ 02:57AM

అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు దెయ్యమా?

  • మీరు ఎలా ఖతం పట్టిస్తారో నాకు తెలుసు
  • చావునైనా భరిస్తాను..కానీ ఆత్మ గౌరవాన్ని చంపుకోను
  • మంత్రిగా కాదు.. మనిషిగా చూడాలన్నా
  • కేసులకు భయపడే వ్యక్తిని కాదు
  • మీకోసం అమ్ముడుపోకుండా కొట్లాడా
  • ఇప్పుడు అసహ్యించుకునేలా దుష్ప్రచారం
  • ఇందుకు మీ శక్తినంతా ప్రయోగిస్తున్నారు
  • కోర్టుకెళ్తా.. దోషినైతే ఏ శిక్షకైనా సిద్ధం
  • దేవరయాంజాల్‌ భూ వివాదంపై కమిటీ వేయాలి.. రైతులను ఆగం చేయొద్దు
  • మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ ఆత్మగౌరవంతో లేరు: ఈటల రాజేందర్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): ‘‘చావునైనా భరిస్తాను కానీ.. ఆత్మగౌరవాన్ని చంపుకోను. కేసులకు, అరెస్టులకు భయపడే వ్యక్తిని కాదు. నయీం లాంటి హంతక ముఠా చంపే కుట్ర చేసినా భయపడలేదు’’ అని అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తాను పదవుల కోసం పెదవులు మూసేవాడిని కాదని తెలిపారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత సోమవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ సమీపంలోని తన నివాసంలో ఈటల విలేకరులతో మాట్లాడారు. ‘‘మీ శిష్యరికంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. మీరంటే ఏమిటో నాకు తెలుసు. ఒక పని ఎత్తుకుంటే వాడిని ఎలా ఖతం పట్టిస్తారో తెలుసు. నాపై కూడా పని చేస్తారని తెలుసు. చావునైనా భరిస్తాను కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోను’’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఈటల అన్నారు. ఉద్యమంలో కేసీఆర్‌ ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారని, డబ్బులను నమ్ముకోలేదని, అధర్మానికి, అణచివేతకు భయపడలేదని తెలిపారు. అలాంటి ఉద్యమ నాయకుడు నేడు ఈటల రాజేందర్‌ అనే మామూలు వ్యక్తిపై తన శక్తినంతా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీని, రెవెన్యూ, ఏసీబీ, అటవీ తదితర శాఖలను ముఖ్యమంత్రే స్వయంగా పిలిపించుకొని తాను అసైన్డ్‌ భూములను ఆక్రమించుకున్నానని చర్చోపచర్చలు పెడుతున్నారని పేర్కొన్నారు. తాను వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నట్లు, వేల కోట్లు సంపాదించినట్లు, కుంభకోణాలు చేసినట్లు యావత్‌ తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా తనపై దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారానికి ఒడిగట్టడం ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గౌరవాన్ని, స్థాయిని పెంచవని, తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. 


మేము ఎవరమో గుర్తుకు రావాలి కదా..!

 ‘‘మనుషులపై చర్యలు తీసుకునే ముందు, ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మేము ఎవరమో మీకు గుర్తుకు రావాలి కదా! నీ పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగేలా పోరాటాం చేశాను. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపాను. అమ్ముడు పోకుండా నీకోసం కొట్లాడాను. ఇవేవీ గుర్తుకు రాలేదా? నన్ను ఏం చేస్తారు? అరెస్టు చేస్తారా? ఎన్ని రోజులు జైల్లో పెడతారో చెప్పండి’’ అని సీఎం కేసీఆర్‌ను ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. తన వ్యాపారంతోపాటు సంపాదన, ఆస్తులపై నిజాయితీగా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, అక్రమాలున్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని అన్నారు.  ‘‘రాజ్యం మీది కాబట్టి.. అధికారులు మీరు చెప్పినట్లు వినొచ్చు. కానీ, మాకు నోటీసులు ఇవ్వకుండానే భూములు కొలవచ్చా? చట్టబద్ధంగా సీఎంగా ఎన్నికై, అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే సమంజసం కాదు. అయినా అసైన్డ్‌ భూముల విషయంలో నా పేరు పెట్టడమేంటి? అవి జమున పేరిట ఉన్నాయి. మీ అధికారులకు వావి వరుసలు లేవా? జమున భర్త స్థానంలో నా కొడుకు పేరు రాశారు. ఇదేం పద్ధతి? మీకు కూడా కుటుంబసభ్యులు ఉన్నారు కదా?’’ అని ఈటల ప్రశ్నించారు. సీఎం ఏది చెబితే ఏసీబీ, కలెక్టర్‌ ఆ రిపోర్టు ఇస్తారని, అధికారాలు ఉన్నందున తమపై కేసు పెట్టుకోండని అన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తామని, దోషిగా తేలితే శిక్షకు సిద్ధమని ప్రకటించారు. అచ్చంపేటలో రైతులను ప్రలోభపెట్టి మాట్లాడించారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. సర్పంచ్‌ ఎలా మాట మార్చారో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో స్పష్టంగా చూపించారని, తనపై ఎంత ద్వేషం ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలునని పేర్కొన్నారు. 


మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవంతో లేరు

మంత్రిగా తాను గౌరవం కోరుకున్నానని ఈటల తెలిపారు. మంత్రిగా కాకపోయినా.. కనీసం మనిషిగా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. తానొక చేదు నిజాన్ని చెబుతున్నానని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఆత్మగౌరవంతో ఉన్నామని అనుకోవడం లేదని తెలిపారు. తాను ముఖ్యమంత్రికి సూటిగా చెప్పగలిగానని, మిగతావాళ్ల విషయం వారి సంబంధాలను బట్టి ఉంటుందని అన్నారు. తాను వారితో సర్దుబాటు కానంతా మాత్రాన వేధించడం, చట్టాన్ని, వ్యవస్థను పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఉద్యమానికి బయలుదేరే ముందు తానొక్కడినే తెల్ల బట్టకట్టుకుని వచ్చానని ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ రోజు కూడా తానొక్కడినే కావచ్చని, తనకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తనకు సానుభూతి చూపించకపోవచ్చని, అయినా.. తనకు మంత్రి పదవి కంటే కూడా ఆత్మగౌరవం గొప్పదని పేర్కొన్నారు. చాలా విషయాలు ఉన్నాయని, ప్రస్తుతం చెప్పలేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధే ఆత్మగౌరవం కాదని, తన పోరాటమంతా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపేందుకేనని వెల్లడించారు. తనను అభిమానించే నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే ఆందోళనలు చేయాలని కోరారు. 

ధైర్యం ఉంది కాబట్టే కేసీఆర్‌తో కలిసి నడిచాను..

కేసులకు, అరెస్టులకు భయపడనంత ధైర్యం ఉంది కాబట్టే ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచానని, నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన ప్రలోభాలకు లొంగలేదని ఈటల రాజేందర్‌ తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు తన ఆస్తిని కుదువపెట్టి సహాయం చేశానని, ఆ పత్రికలో తాను భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు కథనాలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరయాంజాల్‌లోని భూ వివాదంపై కమిటీ వేయాలని, తనను అడ్డుపెట్టుకుని ఇతర రైతులను ఆగం చేయొద్దని అన్నారు. రేపు సివిల్‌సప్లై మీద కూడా ఆరోపణలు చేస్తారని ఈటల వ్యాఖ్యానించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం బియ్యం తీసుకుందని, వాటిని మిల్లర్ల నుంచి తీసుకుని ఇచ్చామని, అందులో ఎలాంటి తప్పూ జరగలేదని తెలిపారు. ‘‘ఇలాంటి చర్యలకు లొంగను. జైలుకైనా పోతా. నా ఆస్తులు పూర్తిగా పోయినా సరే.. ఆత్మను మాత్రం అమ్ముకోను’’ అన్ని అన్నారు. తమ్ముడూ అని గౌరవించిన వారికి నేడు దెయ్యాన్ని ఎలా అయ్యానని ప్రశ్నించారు. 19 ఏళ్ల రాజకీయ జీవితంలోపార్టీకి, కేసీఆర్‌కు, ప్రభుత్వానికి ఎలాంటి మచ్చలేకుండా పనిచేశానని తెలిపారు. ‘‘కారు గుర్తుపై గెలిచావు కాబట్టి.. రాజీనామా చేయాలని అంటారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటాను. అభివృద్ధి మాత్రమే ఆత్మగౌరవం కాదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెలంగాణ భవన్‌ను ఆక్రమించుకుంటామంటే కాపలాగా ఉన్నాను. ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం?’’ అని ఈటల అన్నారు. 


హైకోర్టులో ఈటల పిటిషన్‌..

తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే.. జమున హేచరీస్‌ అసైన్డ్‌ భూములను ఆక్రమించుకుందంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబడుతూ ఈటల రాజేందర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement
Advertisement