దేశీయ వినియోగంతోనే అభివృద్ధ

ABN , First Publish Date - 2021-07-13T06:49:38+05:30 IST

భారత్ దేశీయమార్కెట్ చిన్నదే కనుక సత్వర, సమగ్ర ఆర్థికాభివృద్ధికి ఎగుమతులపై దృష్టిని కేంద్రీకరించడం తప్పనిసరి అని ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు...

దేశీయ వినియోగంతోనే అభివృద్ధ

భారత్ దేశీయమార్కెట్ చిన్నదే కనుక సత్వర, సమగ్ర ఆర్థికాభివృద్ధికి ఎగుమతులపై దృష్టిని కేంద్రీకరించడం తప్పనిసరి అని ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియం అన్నారు. జాతీయ వనరులను మన సొంత ప్రజల వినియోగానికి ఉపయోగించడం ‘దేశీయ వినియోగం’ కాగా అవే వనరులను విదేశీయుల వినియోగానికి సమకూర్చడం ‘ఎగుమతులు’ కిందకు వస్తుంది. ఇది ఎవరూ కొట్టివేయలేని, తిరస్కరించలేని సత్యం. దేశీయ వినియోగం పెరుగుదల లేదా మన ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సుసాధ్యమేనన్న ఆశాభావం మన మాజీ సీఈఏ మహాశయునిలో ఏ కోశానా కన్పించడం లేదు! 


సరే, అరవింద్ సుబ్రమణియం వాదన ననుసరించి ఎగుమతులకు ప్రాధాన్యమిచ్చే విషయాన్ని పరిశీలిద్దాం. ఇటీవలికాలంలో మన ఎగుమతుల రికార్డును పరిశీలిస్తే అదేమంత మంచిశకునంగా కన్పించడం లేదు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అంక్టాడ్ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ‌ట్రేడ్ అండ్ డెవెలప్‌మెంట్) తాజా నివేదిక ఏమి వెల్లడించిందో చూడండి. 2021 మొదటి త్రైమాసికంలో చైనా ఎగుమతులు, 2019లో అదే త్రైమాసికంలో జరిగిన వాటి కంటే 25 శాతం అధికంగా ఉన్నాయి. మరి ఇదే కాలంలో దక్షిణాసియా ఎగుమతులు 2 శాతం తగ్గాయి! ‘ఇందులో భారత్‌దే పెద్ద వాటా’ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఎగుమతుల విషయంలో మన రికార్డు అధ్వాన్నంగా ఉండడానికి ప్రధాన కారణం మన ప్రభుత్వోద్యోగుల పెత్తందారీతనం, అక్రమార్జన ఆరాటమేనని నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వం ఎగుమతుల రంగంలో ఆన్‌లైన్ సదుపాయాలను ప్రవేశపెట్టడాన్ని ఎగుమతిదారులు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, సంబంధిత ప్రభుత్వోద్యోగులు నిరంకుశంగా వ్యవహరిస్తూ తమను నానా వేధింపులకు గురి చేస్తున్నారని కూడా వారు వాపోతున్నారు. ముంబైకి చెందిన ఒక ఎగుమతిదారు తన అవస్థలను నా వద్ద వెళ్ళబోసుకున్నాడు. ఆయన తనకు వచ్చిన ఆర్డర్ల ప్రకారం ఒక నిర్దిష్ట సరుకును నిర్దిష్ట తేదీలోగా పంపించవలసి ఉంది. కంటైనర్ సకాలంలోనే ఓడరేవుకు చేరింది. అయితే కస్టమ్స్ అధికారి దానికి వెంటనే అనుమతి నివ్వలేదు. ఆ కంటైనర్‌లోని ప్రతి సరుకు, ఎగుమతిదారు వెల్లడించిన విధంగా 25 కిలోల బరువు ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సిఉందని ఆ అధికారి ఖండితంగా చెప్పాడు. అందుకు కనీసం రెండురోజుల వ్యవధి పడుతుంది. ఈ జాప్యం వల్ల దిగుమతిదారుకు గడువు లోగా ఆ సరుకు అందదు. వ్యాపార నిబంధనల ప్రకారం ఎగుమతిదారు భారీ జరిమానా చెల్లించవలసివస్తుంది. దీంతో గత్యంతరం లేక ఆ ఎగుమతిదారు రూ.50 వేలు లంచంగా ఇచ్చి ఆ సరుకు రవాణాకు అనుమతి సాధించుకున్నాడు. అవినీతిపరులైన అధికారులను తొలగించి నిజాయితీపరులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలను అదే ఎగుమతిదారు ప్రశంసించాడు. అయితే ఈ సానుకూల మార్పు ఉన్నతస్థాయిలో మటుకు మాత్రమే జరిగింది గానీ, కిందిస్థాయిలో విస్తృతంగా ఉన్న అవినీతి నిర్మూలనకు తోడ్పడలేదు. 


దేశీయ వినియోగం ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి దోహదం చేయదని మాజీ సీఈఏ అరవింద్ సుబ్రమణియం గట్టిగా అభిప్రాయపడుతున్నారు. నిజంగానే మన ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు 2014 నుంచి ఏటా తగ్గిపోతుండగా సెన్సెక్స్ అంతకంతకూ పైకి ఎగబాకుతోంది. అర్థికవ్యవస్థ మొత్తంగా సంకోచిస్తుండగా అందులో భాగమైన బడా పారిశ్రామికవేత్తలు మరింతగా సంపద్వంతులవుతున్నారు. ఆర్థికరంగంలో ఈ వైరుద్ధ్యానికి కారణం ప్రస్తుత ప్రభుత్వం అమలుపరచిన ఆర్థికవిధానాలే నని చెప్పక తప్పదు. పెద్దనోట్ల రద్దు చిన్న పరిశ్రమలను చావుదెబ్బ తీసింది. తమ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నగదు రూపేణా నిర్వహించుకోవడమే వాటి మనుగడకు విఘాతమయింది. నోట్లరద్దు దుష్ప్రభావాల నుంచి పెద్ద పరిశ్రమలు తప్పించుకున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశమంతటినీ ఒకే మార్కెట్‌గా మార్చివేసింది. అయితే ఈ అపూర్వ మార్పు వల్ల అంతర్ రాష్ట్ర వాణిజ్యంలో ఉన్న పెద్దపరిశ్రమలు మాత్రమే లబ్ధి పొందాయి. ఎక్కడైనా ఒకటే పన్ను చెల్లించే సదుపాయంతో అవి తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా సత్వరమే రవాణా చేయగలుగుతున్నాయి. జీఎస్టీకి ముందు బడా పారిశ్రామికవేత్తలు ‘సి’ఫార్మ్స్ పొందడానికి చాలా సమస్యల నెదుర్కొనే వారు. అలాగే ఆక్ట్రాయి (రవాణా పన్ను) విషయంలో ప్రభుత్వాధికారులతో ఎడతెగని సంప్రతింపులు జరపవలసివచ్చేది. కేవలం సొంత రాష్ట్రానికి పరిమితమైన చిన్న పరిశ్రమలు అప్పట్లో పెద్ద పరిశ్రమలతో పోటీ పడగలిగేవి. 


జీఎస్టీతో ఈ పరిస్థితి మారిపోయింది. హరిద్వార్‌లో కర్టెన్‌లను ఉత్పత్తి చేసే ఒక వ్యాపారికి ఉత్తరాఖండ్ మార్కెట్‌లో ఎటువంటి అవకాశాలు లేకుండా పోయాయి. సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి జీఎస్టీ పుణ్యమా అని తాను ఉత్పత్తి చేసే కర్టెన్‌లను ఉత్తరాఖండ్‌కు తేలిగ్గా రవాణా చేస్తుండడంతో హరిద్వార్ వ్యాపారి తీవ్రంగా నష్టపోయాడు. జాతీయ రహదారుల అభివృద్ధిలో ప్రభుత్వం పెట్టిన భారీ పెట్టుబడులు కూడా ఇటువంటి ప్రభావాన్నే చూపుతున్నాయి. పెద్ద పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమలు ఆ హైవేలను తక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. తమ సరుకులను మార్కెట్‌కు రవాణా చేసేందుకు అవుతున్న వ్యయం  చిన్నపరిశ్రమలకు స్వల్పస్థాయిలో మాత్రమే తగ్గగా పెద్ద పరిశ్రమలకు మరింత ఎక్కువగా తగ్గింది. చిన్న పరిశ్రమలు మనుగడ కోల్పోవడం వల్ల ఉద్యోగిత తగ్గిపోయింది. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో డిమాండ్ కొరవడింది. 


ప్రభుత్వం అన్ని రంగాలలో సమస్యల నెదుర్కొంటోంది. ప్రభుత్వోద్యోగుల పెత్తందారీతనం వల్ల ఎగుమతులు తగ్గిపోయాయి. ప్రభుత్వం అమలుపరిచిన ఆర్థిక విధానాలవల్ల దేశీయ మార్కెట్ కుదేలయిపోయింది. ప్రభుత్వోద్యోగులను అదుపు చేయడమనేది చాలాకష్టం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ కూడా అనివార్యంగా ఉద్యోగిస్వామ్య వ్యవస్థపైనే ఆధారపడుతుంది. దేశీయ ఆర్థికవిధానాలను మార్చుకోవడమే చాలా సులభతరం. మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టే పెట్టుబడుల దిశ మారాలి. మెట్రోపాలిస్‌లకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యమివ్వాలి. చిన్న పట్టణాలలో రహదారులను ఇతోధికంగా మెరుగుపరిచి విద్యుత్‌ను అవిరామంగా సరఫరా చేయాలి. ప్రభుత్వ విధానాలలో ఇటువంటి మార్పులు జరగని పక్షంలో మన ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడవు. ఎగుమతులకు ప్రాధాన్యమిచ్చే విధానాలు విదేశీయులకు మాత్రమే తోడ్పడతాయి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-07-13T06:49:38+05:30 IST