అభివృద్ధి అంతంతే!

ABN , First Publish Date - 2022-01-26T04:21:03+05:30 IST

వికారాబాద్‌ మున్సిపాలిటీ కొత్త పాలకవర్గానికి ఈ నెల 27తో రెండేళ్లు పూర్తవుతోంది. ఇప్పటి వరకు పట్టణంలో రూ.18.83కోట్లతో వివిధ పనులు చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తేవడంలో పాలకవర్గం విఫలమైందనే విమర్శల వస్తున్నాయి.

అభివృద్ధి అంతంతే!
మినీ ట్యాంక్‌బండ్‌కు నోచని శివసాగర్‌ చెరువు

  • రెండేళ్లలో అన్నీ కలిపి వచ్చిన నిధులు రూ.18.83కోట్లు
  •  ప్రత్యేక నిధులు రాబట్టని పాలకవర్గం
  •  అంతర్గత కుమ్ములాటలే కారణం
  •  వికారాబాద్‌ మునిసిపల్‌ పాలకవర్గానికి   రేపటికి రెండేళ్లు
  •  రెండున్నరేళ్లకు కొత్త చైర్‌పర్సన్‌ వస్తారనే ప్రచారం!

వికారాబాద్‌ మున్సిపాలిటీ కొత్త పాలకవర్గానికి ఈ నెల 27తో రెండేళ్లు పూర్తవుతోంది. ఇప్పటి వరకు పట్టణంలో రూ.18.83కోట్లతో వివిధ పనులు చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తేవడంలో పాలకవర్గం విఫలమైందనే విమర్శల వస్తున్నాయి. అదీగాక    ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల మధ్య సఖ్యత లేకపోవడం కూడా అభివృద్ధికి ఆటంకంగా మారింది. ప్రస్తుత చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు మరో ఆర్నెల్లలో  మారుతాయనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఆశించిన స్థాయినలో అభివృద్ధి పనులు చేయలేదనే వాదన వినిపిస్తోంది.

వికారాబాద్‌, జనవరి 25: వికారాబాద్‌ జిల్లా కేంద్రం.. దశాబ్దాల చరిత్ర కలిగిన మునిసిపాలిటీ.. 28 వార్డుల నుంచి 34 వార్డులకెదిగిన పట్టణం. పాలకవర్గం రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌  పార్టీకి చెందినదే.. అయినా అభివృద్ధి పనులు మాత్రం నామమాత్రంగానే జరిగాయి. పట్టణాభివృద్ధికి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారు. మునిసిపల్‌ పాలకవర్గం పగ్గాలు చేపట్టి ఈనెల 27తో రెండేళ్లు  పూర్తవుతుంది. ఈ కాలంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పాలకవర్గం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టలేకపోయింది. వికారాబాద్‌లో అభివృద్ది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే సంజీవరావు సమయంలో రూ.20కోట్లతో చేసిన పనులే ప్రధానంగా కన్పిస్తున్నాయి. శివారెడ్డిపేట-ఆలంపల్లి బీటీరోడ్డు పనులు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రూ.5 కోట్లతో వికారాబాద్‌లో మినీట్యాంక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా పనులు ప్రారంభం కాలేదు. శివారెడ్డిపేట చెరువును మినీట్యాంక్‌బండ్‌గా చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌, అప్పటి కలెక్టర్‌ పౌసుమిబసు పరిశీలించారు. ఐతే పనులు ముందుకు సాగడం లేదు. అరకొరరోడ్లు, పార్కుల పనులు తప్ప ఇతర అభివృద్ధి చేయడం లేదు.

రెండేళ్లలో రూ.18.83కోట్ల వెచ్చింపు

రెండేళ్లలో మునిసిపాలిటికీ రూ.18.83 కోట్లు మంజూరయ్యాయి. ఎస్‌ఎ్‌ఫసీ, 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు, పట్టణ ప్రగతి, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద సమకూరిన నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్‌కు నిధులేవీ ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీ బడ్జెట్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులు వస్తేనే ఏవైనా పనులు చేపట్టే ఆస్కారం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి  నిధులు తేవడంలో విఫలం

టీఆర్‌ఎస్‌పార్టీ కౌన్సిలర్లు, పార్టీ పెద్దల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా వికారాబాద్‌ మున్సిపాలిటీ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్న వాదన వినిపిస్తోంది. నిధులు తేవడంలో అందరినీ సమన్వయం చేసుకుంటే ఫలితం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విలీన గ్రామాల్లో కనిపించని అభివృద్ధి

మునిసిపాలిటీలో కొత్తగా విలీనమైన గిరిగెట్‌పల్లి, మద్గుల్‌, చిట్టంపల్లి, బూర్గుపల్లి, గుడుపల్లి, ధన్నారం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కరువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపాలిటీలో విలీనమైన తరువాత గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీలుగా ఉన్నప్పుడు తమకు ఉపాధి పనులు చేసుకునే అవకాశం ఉండేదని, మునిసిపాలిటీలో విలీనం చేసిన తరువాత తమకు వచ్చే కూలి పనులు దొరకండం లేదని, పన్నులు మాత్రం చెల్లిస్తున్నామని విలీన గ్రామాల ప్రజలు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 ఆరు నెలల్లో కొత్త చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌?

ఇదిలా ఉంటే, చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ పదవుల కోసం పోటీ పడిన వారి మధ్య సయోధ్య కుదిరి పదవీ కాలాన్ని ఒక్కో పక్షం రెండున్నరేళ్లు పంచుకోవాలని నిర్ణయించుకుంది.  అ ఒప్పందం ప్రకారమైతే మరో  ఆరు నెలల్లో కొత్త చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ రాబోతున్నారనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌, కమిషనర్ల మధ్య సఖ్యత లేదు: - సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌

అభివృద్ధిలో వికారాబాద్‌ బల్దియా వెనుకబడడానికి ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌, కమిషనర్ల మధ్య సఖ్యత లేకపోవడమే ప్రధాన కారణం. అందుకే ప్రత్యేక నిధులు రావడం లేదు. గతంలో కాంగ్రెస్‌ పాలకవర్గంలో రూ.20కోట్ల నిధులొచ్చాయి. కాంగ్రెస్‌ కౌన్సిలర్ల వార్డుల్లో రూ.10 లక్షల నుంచి 15లక్షలు కేటాయించి, పాలకపార్టీ వార్డుల్లో మ్రాతం రూ.40లక్షల నుంచి 50లక్షలతో పనులు చేసుకున్నారు. అభివృద్ధిలో వివక్ష చూపడం, నిధులు తేలేని చైర్‌పర్సన్‌ దిగిపోయి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, అప్పుడే పట్టణ అభివృద్ధి జరుగుతుంది.

మున్ముందు మరింత అభివృద్ధి చేస్తాం:- మంజులరమేష్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

వికారాబాద్‌ పట్టణ అభివృద్ధిని  వేగవంతం చేస్తాం. ప్రతీ  వార్డుకు రూ.40లక్షల నుంచి 60లక్షల వరకు కేటాయించాం. సీసీరోడ్లు, విద్యుత్‌ స్తంభాలు, వైకుంఠధామాలు, డ్రైనేజీ, పైపులైన్లకు విరివిగా నిధులు వెచ్చిం చాం. 24 నెలల పాలనలో 18 నెలలు కరోనాతో ఇబ్బందులు వచ్చాయి. అవినీతి జరుగకుండా సేవలందించాం. త్వరలో ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి బీజేఆర్‌ చౌరస్తా వరకు రోడ్డు పనులు చేపడతాం.

Updated Date - 2022-01-26T04:21:03+05:30 IST