ప్రగతి పథాన

ABN , First Publish Date - 2021-10-11T05:17:45+05:30 IST

ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన సిద్దిపేటకు జిల్లా హోదా కల్పించి నేటికి ఐదేళ్లు నిండింది. 2016 అక్టోబరు 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ జిల్లా ప్రారంభమైంది. సీఎం చొరవ, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి కృషితో తెలంగాణ రాష్ర్టానికే సిద్దిపేట జిల్లా రోల్‌మాడల్‌గా నిలుస్తున్నది. అభివృద్ధి, పర్యాటకం, రోడ్డు రవాణా, సాగునీటి, పారిశ్రామిక రంగాల్లో ఆదర్శంగా మారింది.

ప్రగతి పథాన

జిల్లా ఆవిర్భవించి నేటికి ఐదేళ్లు

కలెక్టరేట్‌, సీపీ ఆఫీస్‌, మెడికల్‌ కాలేజీ భవనాల నిర్మాణం

రైల్వేలైన్‌, పార్కులు, పర్యాటక సొబగులు

నాలుగు రిజర్వాయర్ల నిర్మాణంతో సస్యశ్యామలం

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 10 : ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన సిద్దిపేటకు జిల్లా హోదా కల్పించి నేటికి ఐదేళ్లు నిండింది. 2016 అక్టోబరు 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ జిల్లా ప్రారంభమైంది. సీఎం చొరవ, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి కృషితో తెలంగాణ రాష్ర్టానికే సిద్దిపేట జిల్లా రోల్‌మాడల్‌గా నిలుస్తున్నది. అభివృద్ధి, పర్యాటకం, రోడ్డు రవాణా, సాగునీటి, పారిశ్రామిక రంగాల్లో ఆదర్శంగా మారింది.


కలెక్టరేట్‌, సీపీ ఆఫీస్‌ల ఏర్పాటు

జిల్లా ఏర్పాటైన మరుసటి ఏడాది 2017 అక్టోబరు 11వ తేదీన సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దుద్దెడ గ్రామ శివారులో నూతన కలెక్టరేట్‌ భవనం, పోలీస్‌ కమిషనరేట్‌ భవనం, ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందులో కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాలను ఇటీవలే ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు నాలుగున్నరేళ్ల పాటు తాత్కాలిక కార్యాలయాల్లో ఈ రెండు శాఖల పరిపాలన వ్యవస్థ కొనసాగింది. ఇక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనం కూడా పూర్తయ్యి తరగతులు నడుస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు సంవత్సరాలకు సంబంధించిన మెడిసిన్‌ విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇక్కడే వెయ్యి పడకలతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్నది. మరో ఏడాదిలో ఇది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లా ఆవిర్భావ సమయాన మంత్రి హరీశ్‌రావు మెడికల్‌ కళాశాల ప్రస్తావన తేవడంతో సీఎం కేసీఆర్‌ సైతం అంగీకరించి మంజూరు చేశారు. 


ఐదేళ్లలో నాలుగు రిజర్వాయర్లు

సిద్దిపేట జిల్లా ఏర్పడే నాటికి ఇక్కడ కరువు కరాళ నృత్యం చేస్తున్నది. నేడు పుష్కలమైన నీటి వనరులతో విలసిల్లుతున్నది. నాడు సాగునీటి వనరులు లేక రైతాంగం తలలు పట్టుకునే పరిస్థితి నెలకొన్నది. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో నాలుగు రిజర్వాయర్లు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఐదేళ్ల వ్యవధిలో నాలుగు రిజర్వాయర్లు నిర్మాణం పూర్తయి ప్రస్తుతం గోదావరి జలాలతో కళకళలాడుతున్నాయి. గడిచిన రెండేళ్లలోనే అనంతగిరి, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లను అధికారికంగా ప్రారంభించగా.. ఇటీవలే మల్లన్నసాగర్‌లో ట్రయల్‌రన్‌ను నిర్వహించి 10 టీఎంసీల నీటిని నింపారు. మొత్తంగా ఈ నాలుగు రిజర్వాయర్లు కలిపి 71.5 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. త్వరలోనే హుస్నాబాద్‌ ప్రాంతంలో 8.5 టీఎంసీల గౌరవెల్లి రిజర్వాయర్‌ పూర్తవనున్నది. 


అభివృద్ధిలో నంబర్‌వన్‌

 -సిద్దిపేట జిల్లా కేంద్రం కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఇక్కడే కొనసాగుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులంతా స్థానికంగా నివాసం ఉంటున్నారు. 

- పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్‌పూల్‌, క్రికెట్‌ స్టేడియం, ఫుట్‌బాల్‌ స్టేడియం ఆవిష్కృతమయ్యాయి.

- నాగులబండ వద్ద 560 ఎకరాలలో అర్బన్‌ పార్కు, గజ్వేల్‌లో మరో అర్బన్‌ పార్కును ఏర్పాటు చేశారు. 

- సిద్దిపేట సమీపంలోనే రాజీవ్‌ రహదారిపై టూరిజం హోటల్‌ నిర్మాణమైంది.

- జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిని నిర్మించారు. 

- రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌, కోమటిచెరువులో కేబుల్‌బ్రిడ్జి, బోటింగ్‌, అడ్వెంచర్‌ పార్కు, రాక్‌గార్డెన్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దారు.

- రైతుబజార్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను నిర్మించారు. 

- సిద్దిపేటలో చెత్తపై పాఠాలు బోధించే స్వచ్ఛబడి, కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసే ఏబీసీ సెంటర్‌, వ్యర్థాలతో సిద్ధం చేసిన పార్కు, ప్రత్యేక డంపుయార్డులను ఏర్పాటు చేశారు. 

- సిద్దిపేటకు అతి సమీపంలోని నర్సాపూర్‌ శివారులో రైల్వేస్టేషన్‌ను నిర్మిస్తున్నారు. 

- సిద్దిపేట సమీపంలోని మిట్టపల్లి వద్ద జిల్లా కోర్టు, జడ్పీ భవనాల నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించారు.

- సిద్దిపేట డిగ్రీ కళాశాలకు అటానమస్‌ హోదా, పీజీ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీల ఏర్పాటు, నాలుగు పాలిటెక్నిక్‌ కళాశాలలు, వెటర్నరీ కళాశాల, ములుగులో ఫారెస్టు కళాశాల, హర్టికల్చర్‌ యూనివర్సిటీ నిర్మాణం జిల్లా ఏర్పాటు తర్వాతే ఆచరణలోకి వచ్చాయి. 

- బ్యాంకుల ముఖ్యమైన కార్యాలయాలను స్థాపించారు. 


వ్యాపార కేంద్రంగా..

సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు కూడా ఈ ప్రాంతం వాణిజ్య, వ్యాపారాలకు చిరునామాగా నిలిచింది. అయితే జిల్లా కేంద్రం ఏర్పాటయ్యాక కార్పోరేట్‌ వ్యాపారాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. హైదరాబాద్‌ తర్వాత సిద్దిపేటలోనే తమ కంపెనీల ఔట్‌ లెట్‌లను ఇక్కడ ప్రారంభించారంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ, జాతీయస్థాయి వస్త్ర, ఎలక్ర్టికల్‌ దుకాణాలు, కార్పొరేట్‌ హోటళ్లు, విద్యాసంస్థలు నెలకొల్పబడ్డాయి. ఇక జిల్లా కేంద్రం వల్ల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలసిల్లుతున్నది. 


Updated Date - 2021-10-11T05:17:45+05:30 IST