కాంగ్రెస్‌ ముందుచూపుతోనే దేశం అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-06T06:43:44+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వాల ముందుచూపుతోనే అభివృద్ధి సాధ్యమై ప్రపచంపటంలో భారతదేశం సగర్వంగా నిలిచిందని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ముందుచూపుతోనే దేశం అభివృద్ధి
పాదయాత్ర పోస్టర్‌ విడుదల చేస్తున్న పొన్నం ప్రభాకర్‌

వేములవాడ, ఆగస్టు 5: కాంగ్రెస్‌ ప్రభుత్వాల ముందుచూపుతోనే అభివృద్ధి సాధ్యమై ప్రపచంపటంలో భారతదేశం సగర్వంగా నిలిచిందని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం వేములవాడలో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట కేవలం బీజేపీ ప్రభుత్వమే మొత్తం అభివృద్ధి చేసినట్లు ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలను తిప్పికొడతామన్నారు. స్వతంత్ర పోరాటం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ దేశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిందన్నారు. నెహ్రూగా  ప్రధాని ఉన్న సమయంలో ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల ఏర్పాటుతోనే ప్రపంచంలో అతి పెద్ద వంద కంపెనీలకు సీఈవోలుగా ఉన్న ఘనత సాధించారన్నారు. పేదల కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, టెక్నాలజీలో రాజీవ్‌గాంధీ, ఆర్థిక సంస్కరణలు, మాంద్యం నుంచి దేశాన్ని కాపాడిన ప్రధానులు పీవీ నర సింహారావు, మన్మోహన్‌సింగ్‌ వంటి నాయకుల వల్లే దేశం అభివృద్ధిలో నిలిచి స్థిరంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీతో సామాన్య ప్రజలను వేధిస్తోందన్నారు. 

దేశ అభివృద్ధిలో కాంగ్రెస్‌ పాత్రను వివరిస్తాం

ఆగస్టు 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌  తరుపున పాద యాత్ర చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్‌ వివరించారు. గంభీ రావుపేట మండలం పెద్దమ్మ ఎక్స్‌ రోడ్‌ నుంచి ప్రారంభించి ఎల్కతుర్తి వరకు 7శాసనసభ నియోజకవర్గాలు, మూడు జిల్లాలు, 14 మండలాలు 70 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీ పాత్రను ప్రజలకు వివరిస్తామన్నారు. బండి సంజయ్‌ హయాంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని  ప్రశ్నించారు. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ గెలిచిన నాటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. మతం, ఆలయాల పేరుతో ప్రతీ అంశాన్ని బండి సంజయ్‌ రాజకీయం చేస్తున్నారని, రాష్ట్ర విభజన హామీలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని సంజయ్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రభుత్వానికి, ఈటల రాజేందర్‌కు మధ్య జరిగిన సంఘర్షణగా భావించడం వల్ల ఈటల రాజేందర్‌ గెలుపొందారన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 108 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి డిపాజిట్‌ కూడా దక్కలేదని గుర్తుంచుకోవాలన్నారు. సోనియాగాంధీని ఈడీ పేరుతో వేధిస్తున్న కేంద్రం, అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన కేసీఆర్‌ను ఎందుకు జైల్‌లో పెట్టడం లేదని ప్రశ్నించారు. అనంతరం పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, జడ్పీటీసీ నాగం కుమార్‌, నాయకులు సంగీతం శ్రీనివాస్‌, సాగరం వెంకటస్వామి, కూస రవీందర్‌,  చంద్రశేఖర్‌, చిలుక రమేశ్‌, పిల్లి కనకయ్య, వకులాభరణం శ్రీనివాస్‌, ఏటీ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T06:43:44+05:30 IST