రాజకీయాలకు అతీతంగా వార్డుల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-02-18T04:45:06+05:30 IST

రాజకీయాలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా వార్డుల అభివృద్ధి
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి, మేయర్‌ హరివెంకటకుమారి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

 మంత్రి ముత్తంశెట్టి 

పెందుర్తి, ఫిబ్రవరి 17: రాజకీయాలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 96వ వార్డు పరిధి ప్రశాంతినగర్‌ వద్ద గురువారం పెందుర్తి- పులగాలిపాలెం రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి- పులగాలిపాలెం రోడ్డు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌  తీసుకువెళ్లి నిధుల మంజూరుకు కృషి చేశారన్నారు. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ జీవీఎంసీలోని ప్రతి వార్డు అభివృద్ధికి రూ.1.5 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, వైసీపీ రూరల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, వైసీపీ నాయకులు బి.భగవాన్‌జయరామ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొర్లె రామునాయుడు, వైసీపీ వార్డు అధ్యక్షుడు ఎల్‌బీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అధికారుల తీరుపై పీలా అసహనం

పెందుర్తి- పులగాలిపాలెం రహదారి విస్తరణ పనుల శంకుస్థాపను వైసీపీ కార్యకర్తల సమావేశంలా మార్చేశారని, జీవీఎంసీ నిధులతో చేపట్టే కార్యక్రమానికి వైసీపీ హడావిడి ఏమిటని అధికారులపై స్థానిక కార్పొరేటర్‌, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రహదారి విస్తరణకు జీవీఎంసీ కౌన్సిల్‌లో తీర్మానం చేయడంతో రూ.1.98 కోట్ల నిధులు మంజూరయ్యాయని, శిలా ఫలకం వెనుక వైసీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ప్రొటోకాల్‌కు విరుద్ధమన్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. దీనికి నిరసనగా రోడ్డుపైనే కొబ్బరికాయ కొట్టి ఆయన వెనుదిరిగారు. 


Updated Date - 2022-02-18T04:45:06+05:30 IST