ప్రగతిలో ప్రకాశిద్దాం !

ABN , First Publish Date - 2021-08-16T05:07:05+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ద్వారా వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథాన నడిపిద్దామని జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పినిపే విశ్వరూప్‌ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఆయా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈసందర్బంగా వివరించారు.

ప్రగతిలో ప్రకాశిద్దాం !
ఒంగోలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి అభివందనం చేస్తున్న మంత్రి, ఎంపీ, కలెక్టర్‌, ఎస్పీ

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి విశ్వరూప్‌

పరేడ్‌ గ్రౌండ్‌లో జెండావిష్కరణ, గౌరవ వందనం స్వీకరణ

400 మందికి ప్రశంసా పత్రాలు అందజేత

వచ్చే ఏడాది మార్చికి వెలిగొండ తొలిదశ

రామాయపట్నం పోర్టు, సోలార్‌ ప్రాజెక్టుల పురోగతి

ఉపాధిలో మూడవస్థానం, సచివాలయ వ్యవస్థతో పారదర్శకం

జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వెల్లడి

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఉదయం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌ జాతీయజెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన 400 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లాయంత్రాంగం ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాలో జిల్లా అభివృద్ధి, వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, వాటి  పురోగతిని వివరిస్తూ ప్రజలందరి సహకారంతో జిల్లాకు ప్రగతిపథాన నడిపిద్దామన్నారు.

రాష్ట్రప్రభుత్వం ద్వారా వివిధ  వర్గాల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథాన నడిపిద్దామని జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పినిపే విశ్వరూప్‌ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఆయా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈసందర్బంగా వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి సొరంగం పూర్తయిందని, 2021-22లో ఈ ప్రాజెక్టుకు రూ.1595 కోట్లు బడ్జెట్‌ కేటాయించారని పేర్కొన్నారు. స్టేజ్‌-1లోని అన్ని పనులు వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు, స్టేజ్‌-2 పనులు 2023 సెప్టెంబరుకు పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రామాయపట్నం పోర్టు భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. గుడ్లూరు మండలం చేవూరు, రావూరు గ్రామాల వద్ద పోర్టు నిర్మాణం జరుగుతుందన్న మంత్రి వివరించారు. పోర్టు కోసం 847 ఎకరాలు, పారిశ్రామిక హబ్‌ కోసం 3,773 ఎకరాలు వెరసి 4,620 ఎకరాల భూసేకరణ చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు 157ఎకరాలు పోర్టు కోసం సేకరించి ఏపీ మారిటైం బోర్డుకు అప్పగించగా నెలాఖరుకు మిగిలిన భూమిని అందిస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 165కోట్లు అవసరం కాగా రూ.55.36 కోట్లు విడుదలయ్యాయని, అందులో రూ.25కోట్లు ఖర్చు చేశారన్నారు. 


వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌

జిల్లాలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. అందులో దొనకొండ మండలంలో వెయ్యికి బదులు 600మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ సాగుతున్నదని తెలిపారు. మరో  ప్రాజెక్టు సీఎస్‌పురం మండలం పెద్దగోగులపల్లిలో ఫేజ్‌-1 కింద 600 మెగా వాట్ల ప్రాజెక్టుకు కూడా భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం అమలులో రూ.605 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో మూడవ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. 4.15 లక్షల కుటుంబాలకు చెందిన 7.65లక్షల మందికి కోటి 94లక్షల పనిదినాలు కల్పన ద్వారా రూ.410 కోట్లు వేతన రూపంలో అందాయని వివరించారు. మెటీరియల్‌ కోటా ద్వారా గ్రామాల్లో నిర్మిస్తున్న వివిధ భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.186కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. 


జలకళలో ముందున్నాం..

జల కళ పథకంలో 226 బోర్ల తవ్వకంతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. జిల్లాలోని అన్ని ఆవాసాలకు తాగునీటి కల్పన కోసం రూ. 5,633కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.277.77కోట్లతో లక్షా 62వేల గృహాలకు కొళాయిల ద్వారా నీటి సరఫరా చేయడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 20,984గృహాలకు ఏర్పాటుచేసినట్లు వివరించారు. జిల్లాలో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కొవిడ్‌ నియంత్రణతో పాటు వైరస్‌ సోకిన బాధితులకు నిరంతర సేవలు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్లస్థలాలు, ఇంటి నిర్మాణాలు, కాలనీలు ఏర్పాటుపై వివరించారు. కాగా స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రదర్శించిన శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి స్టాల్స్‌ను రద్దు చేశారు. ఈ వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ మలిక గర్గ్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు.


జిల్లా అంతటా మువ్వన్నెల జెండా రెపరెపలు

ఇదిలాఉండగా భారత 75వ స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల కార్యాలయాలు తదితర వేలాది ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి సభలు, సమావేశాలు నిర్వహించారు. ఒంగోలులోని ప్రధాన పార్టీల కార్యాలయాలు అన్నింటిలోనూ జెండా ఆవిష్కరణలు ఏర్పాటుచేశారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ స్థానం అధ్యక్షుడు నూకసాని బాలాజీ, వైసీపీ కార్యాలయం వద్ద మేయర్‌ గంగాడ సుజాత, సీపీఐ, సీపీఎం కార్యాలయాల వద్ద ఆ పార్టీ కార్యదర్శులు ఎంఎల్‌ నారాయణ పూనాటి ఆంజనేయులు, జనసేన కార్యాలయం వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు రియాజ్‌, ప్రకాశం భవన్‌పై జేసీ టీఎస్‌చేతన్‌, పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మలికగర్గ్‌లు ఆవిష్కరించారు. గ్రామాల్లోనూ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా వేడుకలు జరిగాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ రైతు ఉద్యమానికి సంఘీభావంగా రైతుసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద జాతీయజెండా, రైతు జెండాలను రైతుసఘాల నేతలు ప్రదర్శించి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.  









Updated Date - 2021-08-16T05:07:05+05:30 IST