అభివృద్ధి అడుగులు..అవార్డుకు దారులు

ABN , First Publish Date - 2022-04-11T05:44:52+05:30 IST

: అభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రణాళికలో ఆదర్శంగా నిలిచిన జిల్లాలోని మూడు గ్రామాలు అవార్డులను సాధించాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలకు అందజేస్తున్న దీనదయాల్‌ ఉపాధ్యాయ సశక్తీకరణ్‌ పురస్కారానికి జిల్లాలోని మూడు పంచాయతీలు ఎంపికయ్యాయి.

అభివృద్ధి అడుగులు..అవార్డుకు దారులు
ఎర్రవల్లి గ్రామం

దీనదయాల్‌ సశక్తీకరణ్‌ పురస్కారానికి ఎంపికైన మూడు గ్రామాలు

జాతీయస్థాయిలో మెరిసిన జక్కాపూర్‌, బూరుగుపల్లి, ఎర్రవల్లి


నారాయణరావుపేట/సిద్దిపేట అర్బన్‌/జగదేవ్‌పూర్‌, ఏప్రిల్‌ 10 : అభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రణాళికలో ఆదర్శంగా నిలిచిన జిల్లాలోని మూడు గ్రామాలు అవార్డులను సాధించాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా  కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలకు అందజేస్తున్న దీనదయాల్‌ ఉపాధ్యాయ సశక్తీకరణ్‌ పురస్కారానికి జిల్లాలోని మూడు పంచాయతీలు ఎంపికయ్యాయి. నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్‌, సిద్దిపేట అర్బన్‌ మండలంలోని బూరుగుపల్లి, గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామాలకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి ఈ మూడు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఈఅవార్డులను అందజేయనుంది. పురస్కారంతో పాటు రూ.10 లక్షల బహుమతిని అందుకోనున్నారు. 

సిద్దిపేట నియోజకవర్గంలోని జక్కాపూర్‌, బూరుగుపల్లి గ్రామాలు మంత్రి హరీశ్‌రావు సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల రూపురేఖలు మారాలనే సంకల్పంతో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం జక్కాపూర్‌ గ్రామస్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మంత్రి తోడ్పాటుతో గ్రామంలో సంపూర్ణ పారిశుధ్యం నిర్వహణకు డంపింగ్‌యార్డు నిర్మాణం చేసి ఇంటింటికీ చెత్త బండితో తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఇక్కడ సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేసి హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. దీంతో పాటు గ్రామంలో పల్లెపకృతి వనం, శ్మశానవాటిక, నర్సరీలో మొక్కల పెంపకం, సామూహిక గొర్రెల షెడ్లు, పశువుల హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉచిత దహన సంస్కారాలను నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ పండ్ల మొక్కలు, వాటితో పాటు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్రమం తప్పకుండా గ్రామ సభలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి ప్రజలను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలతో జాతీయస్థాయిలో జక్కాపూర్‌ మెరిసింది. బూరుగుపల్లి గ్రామంలోని అందరి కృషితో సర్పంచ్‌ మౌలిక వసతులకు నడుం బిగించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్కల పెంపకంతో ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలోని సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి పంచాయతీ అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచింది. గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామస్థులతో గ్రామసభ ఏర్పాటుచేసుకొని అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు ప్రాధాన్యతా క్రమంగా నిర్ణయించారు. దాని ప్రకారం పనులు చేపట్టారు. ప్రణాళిక అమలు, అభివృద్ధి పనుల తీరుపై ప్రతీ మూడు నెలలకోసారి సమావేశమై సమీక్షించుకున్నారు. వారు నిర్ధేశించుకున్న ప్రకారంగా అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలిచారు. దీంతో ఎర్రవల్లి గ్రామం పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక విభాగంలో జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైంది.


జీవితాంతం రుణపడి ఉంటా 

జాతీయస్థాయిలో మా గ్రామానికి అవార్డు రావడం సంతోషంగా ఉంది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు, గ్రామ ప్రజల సహకారం, పాలకవర్గం కృషితో దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ సశక్తికరణ్‌ పురస్కారం మాగ్రామానికి దక్కింది. ప్రజలకు, మంత్రి హరీశ్‌రావుకు జీవితాంతం రుణపడి ఉంటాను 

- దుర్గం పర్శరాములు, సర్పంచ్‌, జక్కాపూర్‌ 


అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది

మాగ్రామానికి జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టి మౌలిక వసతుల కల్పనలో ముందడుగు వేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజల ఐక్యత ఎంతో ఉపయోగపడింది. అవార్డు రావడానికి సహకరించిన మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు.

-కమలాకర్‌రావు, సర్పంచ్‌, బూరుగుపల్లి


చాలా సంతోషంగా ఉంది 

ఎర్రవల్లి గ్రామానికి జాతీయస్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన ఎర్రవల్లికి గతంలో నిర్మల్‌ పురస్కార్‌ రావడం జరిగింది. ఈసారి అభివృద్ధి ప్రణాళిక విభాగంలో జాతీయస్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.

-భాగ్యభిక్షపతి, సర్పంచ్‌, ఎర్రవల్లి

Updated Date - 2022-04-11T05:44:52+05:30 IST