అందరి కోసం అభివృద్ధి వ్యూహాలు

ABN , First Publish Date - 2022-07-12T06:27:42+05:30 IST

పేదల్లో నిరుపేదల కోసం, అణగారిన వర్గాల కోసం, దివ్యాంగుల కోసం పనిచేసే సంక్షేమరాజ్యం భారతదేశంలో ఏర్పడాలన్నదే తన ఆకాంక్ష అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ...

అందరి కోసం అభివృద్ధి వ్యూహాలు

పేదల్లో నిరుపేదల కోసం, అణగారిన వర్గాల కోసం, దివ్యాంగుల కోసం పనిచేసే సంక్షేమరాజ్యం భారతదేశంలో ఏర్పడాలన్నదే తన ఆకాంక్ష అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన మరణానికి ముందు బ్లాగులో పేర్కొన్నారు. కాని ఈ సంక్షేమ రాజ్యం అమలులోకి రావాలంటే పెద్ద ఎత్తున వనరులు సమీకరించాల్సి ఉంటుందని, అందుకోసం అనేక రకాల ఆదాయ మార్గాలను చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆదాయాలు పెరగాలంటే ఆర్థికాభివృద్ధి గణనీయంగా జరగాలి. ఆర్థికాభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఏర్పడడం, భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఈ ఆర్థికాభివృద్ధి వాతావరణానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక సంధానకర్తగా వ్యవహరించి సరైన వాతావరణం కల్పించాలి. ఇదొక దీర్ఘకాలిక స్వప్నం అని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన ఆ స్వప్నం సాక్షాత్కారం కోసమే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అంతకుముందు కొన్ని దశాబ్దాల పాటు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న కుళ్లిపోయిన వ్యవస్థల్ని రూపుమాపడం, కొత్త వ్యవస్థల్ని నిర్మించడం. కాలం చెల్లిన చట్టాలను నిర్మూలించడం అన్నిటికన్నా కొత్త ఆలోచనా విధానాన్ని ఏర్పర్చడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. మోదీ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రి అయిన అరుణ్ జైట్లీ ఈ మార్గం నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 


అందరికీ భాగస్వామ్యం ఏర్పర్చకుండా అభివృద్ధి సాధ్యమా? సరైన అభివృద్ధి లేకుండా అందరికీ భాగస్వామ్యం కల్పించడం సాధ్యమా? అని అరుణ్ జైట్లీ తొలి స్మారకోపన్యాసంలో నరేంద్రమోదీ వేసిన ప్రశ్నకు కీలక ప్రాధాన్యత ఉన్నది. సంపద సృష్టించకుండా సంపదను ఎలా పంచిపెట్టగలం అన్నదే ఈ ప్రశ్న సారాంశం. మన విధానకర్తలు ఎదుర్కొంటున్న సందిగ్ధాలు, సవాళ్లను ఈ ప్రశ్న ప్రతిబింబిస్తుందని మోదీ స్వయంగా చెప్పారు. అభివృద్ధి అంటే జనాలకు తాయిలాలు పంచిపెట్టి ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే జనాకర్షక విధానం కాదు అన్న అరుణ్ జైట్లీ అభిప్రాయమే బిజెపి ఆర్థిక దృక్పథం. జనాకర్షక ఒత్తిడులు మా విధానాలపై ప్రభావం చూపడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదు అని మోదీ స్పష్టం చేశారు. అందుకే సామాన్య ప్రజల గురించి మాట్లాడినప్పుడల్లా ప్రధానమంత్రి అభివృద్ధి గురించి ప్రస్తావించడాన్ని గమనించాలి. సంపన్నులు, మధ్యతరగతి వర్గాలు మాత్రమే కాదు, దేశంలో సామాన్యులు, అట్టడుగున ఉన్న వారందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని అరుణ్ జైట్లీ స్మారకోపన్యాసంలో మోదీ చెప్పిన మాటలకు లోతైన అర్థం ఉన్నది. సరైన వృద్ధి లేకుండా అందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం సాధ్యం కాదు అన్నది ప్రభుత్వాధినేతగా తన 20 సంవత్సరాల అభివృద్ధి సారం అని మోదీ అన్నారు. అందువల్లే బాగా ఆలోచించి అందరికీ అభివృద్ధి ఫలాలు అందే విధంగా తమ విధానాలను రూపకల్పన చేసుకున్నామని, తమ విధానాలు ప్రతి ఒక్కరికీ మేలు చేసేందుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు.


ఇవాళ బిజెపి ఆర్థిక విధానాల గాఢత గురించి తెలియకుండా దేశంలో బిజెపి యేతర ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల అవినీతి సామ్రాట్టులు చేస్తున్న విమర్శలకు ప్రధానమంత్రి తన ఉపన్యాసంలో స్పష్టమైన సమాధానం చెప్పారు, గత 8 సంవత్సరాల కాలంలో మోదీ ప్రభుత్వం అత్యంత వేగంగా అమలుచేస్తున్న అభివృద్ధి విధానాలు అందరికీ మేలు చేస్తున్నాయా లేదా అన్న విషయం ఆయన విమర్శకులు చర్చించాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశంలో 9 కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, 12 కోట్ల మందికి పైగా పేదలకు మరుగుదొడ్లు, 45 కోట్లకు పైబడిన జనధన్ ఖాతాలు, నిరుపేదలకు 3 కోట్ల పక్కా గృహాలు లభించడం అభివృద్ధిలో అందరి భాగస్వామ్యానికి నిదర్శనం కాదా? 50 కోట్ల మంది ప్రజలకు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం మోదీ సంక్షేమ రాజ్య స్వప్నంలో భాగం కాదా? 2014 సంవ‌త్స‌రానికి ముందు 10 సంవ‌త్స‌రాల కాలంలో స‌గ‌టున 50 వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటు జరిగితే, గత 7–8 సంవ‌త్స‌రాల కాలంలోనే 209 కొత్త వైద్య క‌ళాశాల‌లు ఏర్పాట‌య్యాయి. గ‌త 7–8 సంవ‌త్స‌రాల కాలంలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా సీట్లు 75 శాతం పెరిగాయి. ఇది మోదీ సమగ్ర దృష్టిలో భాగం కాదా?


‘పిఎం స్వనిధి’ పథకంలో వీధి వ్యాపారులను చేర్చడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అభ్యుదయ జిల్లాలపై దృష్టి కేంద్రీకరించడం, హర్ ఘర్ జల్ ద్వారా ఆరున్నర కోట్ల నల్లా కనెక్షన్లు అందించడం, స్వమిత్ర పథకం ద్వారా సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు ఆస్తి హక్కులు కల్పించడం 80 లక్షల మందికి పైగా ఇప్పటికే ఆస్తికార్డులు ఇవ్వడం ద్వారా రుణసదుపాయం కల్పించడం, ఉడాన్ పథకం ద్వారా విమానయానం అందరికీ అందుబాటులోకి తేవడం, కనీస ప్రజా సౌకర్యాల కల్పన, సంక్షేమ పథకాలు, వివిధ సేవలు ప్రజలకు అందించడం కోసం 5 లక్షల కామన్ సర్వీసు కేంద్రాలు, ఈ సంజీవని ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సలహా అందించడం మొదలైన వాటి ద్వారా అభివృద్ధి సామాన్యులకు చేరడం లేదా?


పీవీ, మన్మోహన్ హయాంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లోనై సంస్కరణలు చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి ఆర్థిక సంస్కరణలు ఒక విధానం. జాతి ప్రయోజనం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం సంస్కరణలు చేపట్టాలన్నదే తారక మంత్రం. నిత్యజీవితంలో మనం వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం కనపడుతుంది. ఉదాహరణకు కొవిడ్ వాక్సిన్ తయారీలో మన దేశంలో ప్రైవేట్ కంపెనీలు అద్వితీయమైన కృషి చేశాయి. వెనుక ప్రభుత్వ యంత్రాంగం బృహత్తరంగా పనిచేసింది. ప్రజలకోసం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఎంత సమర్థవంతంగా పనిచేసిందో చెప్పడానికి ఇది నిదర్శనం. నేడు ప్రపంచంలో అత్యాధునిక అంతరిక్ష సేవలు అందించే దేశాల్లో భారతదేశం ఒకటి. ఇందులో కూడా ప్రైవేట్ రంగం చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నదని ఎంతమందికి తెలుసు?


గడచిన ఎనిమిదేళ్లలో పర్యాటక రంగం కూడా దేశ అభివృద్ధిలో భాగమై, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సంస్కృతి, పర్యాటక రంగం అంటే పాతకట్టడాలపై వేల కోట్లు వృధా చేయడం కాదు. ఈ కట్టడాల్ని చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలుగా తీర్చిదిద్ది దేశ విదేశాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించేలా చేయగలగడం. ఉదాహరణకు- గుజరాత్‌లోని నర్మదా ప్రాజెక్టు వద్ద సర్దార్ పటేల్ ఎత్తైన విగ్రహాన్ని నిర్మించి పర్యాటక కేంద్రంగా మార్చడం ద్వారా అక్కడి ఆదివాసీ జనావాసాలు అభివృద్ధి అయ్యాయి. కాంగ్రెస్ జమానాలో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న అనేక రహదారి, రైల్వే, సొరంగ మార్గాలు, రేవులు, విమానాశ్రయాలు మోదీ హయాంలో పూర్తయ్యాయి. తద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. సంకుచిత రాజకీయాలు చేస్తూ కుటుంబీకుల బొక్కసాలను నింపుకునే వారికి మోదీ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని అందుకోవడం సాధ్యం కాదు. ప్రజలు మాత్రం మోదీ విధానాల్ని, భారతీయ జనతా పార్టీని చేతులు చాచి ఆహ్వానిస్తున్నారు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-07-12T06:27:42+05:30 IST