ఆరునెలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-06-12T04:55:58+05:30 IST

నర్సాపూర్‌ పటణానికి సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆరునెలల్లో పూర్తి చేస్తామని కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు.

ఆరునెలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
నర్సాపూర్‌ పట్టణాభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌

నత్తనడకన మనోహరాబాద్‌ పంచాయతీ భవన నిర్మాణంపై అసహనం


నర్సాపూర్‌, జూన్‌ 11 : నర్సాపూర్‌ పటణానికి సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆరునెలల్లో పూర్తి చేస్తామని కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాలయంలో పట్టణ ప్రగతిపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన రూ.4 కోట్ల పనులను వేగవంతం చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.


సీఎం మంజూరు  చేసిన నిధులతో మున్సిపల్‌ భవనం, స్టేడియం, సమీకృతమార్కెట్‌, డంపుయార్డు, వైకుంఠధామం నిర్మాణ పనులను చేపట్టినట్లు వివరించారు. మున్సిపల్‌ భవనం టెండరు ప్రక్రియ పూర్తయిందని వారం రోజులలో ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. అదేవిధంగా మిగతా పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్‌ హరీశ్‌ కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయిమోద్దీన్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 




నెలాఖరులోగా డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు పూర్తవ్వాలి

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), జూన్‌ 11 : మనోహరాబాద్‌, రామాయపల్లి, కోనాయపల్లి(పీటీ)లలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు నర్సింహులును మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ ఆదేశించారు. పనుల్లో జాప్యం చేయొద్దంటూ కలెక్టర్‌ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం మనోహరాబాద్‌ తహసీల్దారు కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మనోహరాబాద్‌ గ్రామ పంచాయతీ భవనం నత్తనడకన సాగడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. మనోహరాబాద్‌లోని ప్రధాన రహదారి నిర్మాణంలో జాప్యంపై రోడ్లు భవనాలశాఖ ఇంజనీరును కలెక్టర్‌ ప్రశ్నించారు.


రోడ్డు మధ్యలో డివైడర్‌ నిర్మించకుండా వదిలివేయడంతో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని, పనులను త్వరగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండలంలో పంటల సాగు, ఎరువులు, విత్తనాలపై ఏవో స్రవంతిని వివరాలడిగి తెలుసుకున్నారు. సమీక్షలో తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, తహసీల్దారు భిక్షపతి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ నర్సింహులు, రోడ్లు భవనాలశాఖ ఏఈ రవీందర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహరాబాద్‌ ప్రధాన రోడ్డు, గ్రామ పంచాయతీ భవనం, రామాయపల్లిలోని డబుల్‌బెడ్రూం ఇళ్లను కలెక్టర్‌ హరీశ్‌ పరిశీలించారు.


Updated Date - 2021-06-12T04:55:58+05:30 IST