విధ్వంసకర రాజకీయాలపై బీజేపీకి ఆసక్తి లేదు : దేవేంద్ర ఫడ్నవీస్

ABN , First Publish Date - 2021-08-01T23:57:29+05:30 IST

విధ్వంసకర రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదని మహారాష్ట్ర

విధ్వంసకర రాజకీయాలపై బీజేపీకి ఆసక్తి లేదు : దేవేంద్ర ఫడ్నవీస్

ముంబై : విధ్వంసకర రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అటువంటి ఆలోచనలు బీజేపీకి ఉండబోవన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేవేంద్ర ఆదివారం స్పందించారు. 


దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ, విధ్వంసకర రాజకీయాలపై తమకు నమ్మకం లేదన్నారు. ఇది బీజేపీ సంస్కృతి కాదన్నారు. బీజేపీకి తనదైన సిద్ధాంతం, పని సంస్కృతి ఉన్నట్లు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు, పని సంస్కృతి నిర్మాణాత్మకమైనవి, అభివృద్ధిపై దృష్టి పెట్టేవి అని తెలిపారు. తాము ముందుగా ఎవరిపైనా దాడి చేయబోమని తెలిపారు. అయితే ఎవరైనా తమపై దాడికి దిగితే, తాము దీటుగా స్పందిస్తామని చెప్పారు. 


ప్రసాద్ లాడ్ వ్యాఖ్యలు

శివసేన ప్రాబల్యంగల మహిమ్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ శనివారం మాట్లాడుతూ, తాను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారన్నారు. ‘సేన భవన్’ను కూల్చేస్తామని శివసేన భయపడుతోందన్నారు. సమయం వచ్చినపుడు మనం ఆ పని కూడా చేయగలమన్నారు. 


సేన భవన్‌కు దివంగత బాల్ థాకరేకు గొప్ప అనుబంధం ఉండటంతో బీజేపీ లాడ్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే వివరణ ఇవ్వాలని లాడ్‌కు చెప్పింది. దీంతో లాడ్ ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. దివంగత బాల్ థాకరే అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. సేన భవన్ పవిత్రమైనదని పేర్కొన్నారు. సేన భవన్‌కు వ్యతిరేకంగా తాను ఎలా మాట్లాడగలనని ప్రశ్నించారు. బీజేపీ శక్తిమంతమైనదనేది తన ఉద్దేశమని తెలిపారు. శివసేనపై తన బలాన్ని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నిరూపించుకుంటుందని చెప్పారు. 


Updated Date - 2021-08-01T23:57:29+05:30 IST