కొత్త గడబిడ

ABN , First Publish Date - 2022-01-27T06:30:21+05:30 IST

ఉమ్మడి జిల్లా విభజన... కొత్త జిల్లాల ఏర్పాటుపై తీవ్ర గందరగోళం నెలకొంది. పశ్చిమ నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాజమండ్రి జిల్లాలోకి వెళ్లగా, కృష్ణా జిల్లా నుంచి మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన నూజివీడును పశ్చిమలోకి తేనున్నారు.

కొత్త గడబిడ

చిచ్చురేపిన జిల్లాల విభజన

నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరం

తీరంలో రాజుకున్న నిరసనలు.. రేపు బంద్‌కు పిలుపు

చిన వెంకన్నకు స్థాన చలనం..  రాజమండ్రిలో చేర్చడంపై ఆందోళన

కొవ్వూరు, కుక్కునూరు రెవెన్యూ డివిజన్లు మాయం

ఉన్న మండలాలు కొన్ని అటూ మరికొన్ని ఇటు 

ఎవరికి నష్టం.. ఎవరి లాభంపై కసరత్తు

ఉమ్మడి జిల్లా విభజన... కొత్త జిల్లాల ఏర్పాటుపై తీవ్ర గందరగోళం నెలకొంది. పశ్చిమ నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాజమండ్రి జిల్లాలోకి వెళ్లగా, కృష్ణా జిల్లా నుంచి మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన నూజివీడును పశ్చిమలోకి తేనున్నారు. కొల్లేరుకు ఆలవాలమైన కైకలూరు ఇక్కడికే చేరనుంది. కొత్త జిల్లాల ప్రతిపాదన సమయంలో నూజివీడు వాసులు అభ్యంతరాలెన్నో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. రెవెన్యూ డివిజన్‌గా కొనసాగిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మరో ప్రాంత పరిధిలోని జిల్లాకు మార్చడాన్ని నిరసన వ్యక్తం చేశారు. అభ్యంతరాల స్వీకరణ కు ఇంకా గడువు ఉన్నందున ఆలోగా మరోసారి తమ అభ్యంతరాలను వ్యక్తం చేయనున్నారు. ఇప్పటి వరకు కైకలూరు వాసులు అటు గుడివాడ వైపు లేదా భీమవరం వైపు ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఇప్పుడు ఆ రూటు మార్చి ఏలూరువైపు చూడాల్సి వస్తోంది. నూజివీడు వాసులు అత్యధికంగా రోజువారీ పనుల కోసం విజయవాడను కేంద్రంగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఏలూరువైపు తొంగి చూడాలి. అక్కడే ఉన్న రెవెన్యూ డివిజన్‌లోను మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. 

– (ఏలూరు–ఆంధ్రజ్యోతి)

నరసాపురం జిల్లాగా సరికొత్త ప్రతిపాదన ప్రకటించినా జిల్లా కేంద్రంగా నరసాపురం ఉండాలా ? భీమవరం ఉండాలా ? అనే దానిపై వివాదాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా కొనసా గించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరాన్ని ఒప్పుకునేది లేదని అధికార పక్షంతోపాటు మిగతా పార్టీ నేతలంతా బుధవారం నిరసనలకు దిగారు. భీమవరం ప్రతిపాదన ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌ తెర ముందు కు వచ్చింది. భీమవరం రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా రూపాంతరం చెంద నున్న పరిస్థితుల్లో ఇది సరికాదని ఎక్కువ మంది అభిప్రాయ పడ్డారు. భీమవరం వాసులు మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిం చారు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడం సముచిత మేనని అభిప్రాయపడుతున్నారు. రానురాను నరసాపురం, భీమవరం మధ్య వద్దు, కావాలి అనే కారణాలతో వేడెక్కించే వారి సంఖ్య పెరగనుంది. 

 చిన్న వెంకన్నను దాటిస్తారా 

పశ్చిమలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నిడదవోలు, కొవ్వూరు గోపాలపురాలను తూర్పున వున్న రాజమహేంద్రవరం జిల్లాగా ప్రకటి స్తూ విలీనం చేశారు. ఈ లెక్కన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల కాస్తా ఇప్పుడు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లనుంది. ఏలూరుకు అత్యంత చేరువగా వున్న ఈ పుణ్యక్షేత్రంను యధాతధంగా కొనసాగించాల్సిందిగా కొందరు ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. ఆ నేపథ్యంలో చిన వెంకన్న ఎక్కడ ఉండాలనే అంశంలో వివాదం రాజుకుంది. మరోవైపు కీలక మైన పోలవరం ప్రాజెక్టు పశ్చిమలోనే మిగలనుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతంలో కలిపే అవకాశం ఉందన్న రూమర్లకు తెరదించారు. 

 డివిజన్లలో అటు ఇటు

ఉమ్మడి పశ్చిమలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, కొవ్వూరు, కుక్కునూరు రెవెన్యూ డివిజన్లు ఉండేవి. కొత్త జిల్లాల ప్రతిపాదనతో కుక్కునూరు, కొవ్వూరు డివిజన్లు అదృశ్యం కానున్నాయి. ఇవి నరసాపురం, జంగారెడ్డిగూడెంలలో విలీనం కానున్నాయి. ఏలూరు డివిజన్‌లోని కొన్ని మండలాలు నూజివీడులోను, గుడివాడలోని కొన్ని మండలాలు ఏలూరులోను కలవనున్నాయి. డివిజన్‌ కేంద్రం తమకు దూరం కావడంతో వీటిపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. నూజివీడులోని చాట్రాయి, ముసునూరు, నూజివీడు, ఆవిరిపల్లితోపాటు చింతలపూడిలోని చింతలపూడి, లింగపాలెం విలీనం చేస్తారు. ఏలూరు డివిజన్‌లోని ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు మండలాలతో సహా వీటికి అదనంగా కృష్ణా నుంచి మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి ఏలూరు పరిధిలోకి వస్తాయి.  రెండు మండలాలు నూజివీడులో విలీనం కాగా, నాలుగు మండలాలు ఏలూరుకు వస్తాయి. కుక్కునూరు డివిజన్‌గా వున్న వేలేరుపాడు, కుక్కునూరు  జంగారెడ్డిగూడెంలో విలీనమవుతాయి. పోలవరం పరిధిలోని మండలాలు, చింతలపూడి పరిధిలోని కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలు ఇదే డివిజన్‌లోకి వస్తాయి. పెద్ద విస్తీర్ణంలో ఉన్న నరసాపురం డివిజన్‌ కాస్త తగ్గి భీమవరం డివిజన్‌గా ఏర్పడనుంది. నరసాపురం డివిజన్‌లో ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గ మండలాలు ఉండగా, అదే కొత్తగా ఏర్పడుతున్న భీమవరం రెవెన్యూ డివిజన్‌లో వీరవాసరం, భీమవరం, ఆకివీడు, ఉండి, పాలకొల్లు, కాళ్ళ, తణుకు, అత్తిలి, ఇరగవరం, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు వస్తాయి. ఈ కొత్త డివిజన్లలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలన్నీ చేరువైనట్టే. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలు కొవ్వూరులోను, మరికొన్ని ఏలూరులోను, ఇంకొన్ని నరసాపురంలోను ఉండేవి. ఇప్పుడు వాటిలో మార్పులు, చేర్పులు తెచ్చారు. ఈ పర్యావసానంగా రెవెన్యూ డివిజన్‌ కేంద్రం కొన్ని ప్రాంతాలకే సుదూరమే కానున్నాయి. కలిదిండి నుండి గుడివాడ తక్కువ దూరం కాగా, ఏలూరు రావాలంటే కాస్తంత వ్యయ ప్రయాసలకోర్చాల్సిందే. కుక్కునూరు డివిజన్‌ మాయం చేసి ఆ ప్రాంతాన్ని పూర్వపు పద్ధతిలోనే జంగారెడ్డిగూడెం డివిజన్‌లోకి చేర్చారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలు.

రేపు నరసాపురం తీరంలో బంద్‌  : అఖిలపక్షం

నరసాపురం, జనవరి 26 : నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమించాలని బుధవారం ఇక్కడ సమావేశమైన అఖిలపక్ష నాయకులు తీర్మానిం చారు. గురువారం సబ్‌ కలెక్టర్‌ను, ఎమ్మెల్యేను కలవాలని, శుక్రవారం తీర ప్రాంత బంద్‌కు పిలుపుని వ్వాలని నిర్ణయించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని అన్ని పంచాయతీల నుంచి జిల్లా కేంద్రం నరసాపురంలోనే కొనసాగించాలని తీర్మానించాలని నిర్ణయించారు. ఉద్యమ కన్వీనర్‌గా సీపీఐ నాయకులు నెక్కంటి సుబ్బారావును ఎన్నుకున్నారు. పొత్తూరి రామరాజు (టీడీ పీ), ఇలపకుర్తి ప్రకాష్‌ (బీజేపీ), దొండపాటి స్వాములు(వైసీపీ), కోటిపల్లి వెంకటేశ్వరరావు(జనసేన) తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. 


తీరంపై చిన్నచూపు

జిల్లా కేంద్రం నరసాపురమే ఉంటుందంటూ మభ్యపెట్టారు. మెడికల్‌ కాలేజీ తరలిపోయినప్పుడు జిల్లా కేంద్రం వస్తుందంటూ నమ్మించారు. ఇక్కడ కేంద్రం ఏర్పాటుకు అన్ని సౌకర్యాలున్నా.. భీమవరంలో పెట్టడం తీర ప్రాంతం వైపు చిన్నచూపు చూడటమే. వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి.  

– షరీఫ్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌


ప్రజల్ని మోసం చేశారు

వైసీపీ నేతలు ప్రజలను మోసం చేశారు. ఏడాది క్రితం తాము దీనిపై ఆందోళన చేస్తే.. అవహేళన చేశారు. జిల్లా కేంద్రం నరసాపురం అవుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఏమి జరిగింది. దీనికి వారు సమాధానం చెప్పాలి. తిరి గి సాధించేందుకు పోరాటాలకు సిద్ధం కావాలి. 

– బండారు మాధవనాయుడు, మాజీ ఎమ్మెల్యే


పక్కదారి పట్టించేందుకే..

పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే అర్ధరాత్రి కొత్త జిల్లాలను తెరపైకి తీసుకొచ్చారు. రివర్స్‌ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం చర్చ కూడా జరగకుండా రాత్రికి రాత్రి ఆన్‌లైన్లో కేబినె ట్‌ మీటింగ్‌ జరిపి కొత్త జిల్లాలను ప్రకటించడం విడ్డూరంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేకం కాదు. 

– తోట సీతారామలక్ష్మి ,టీడీపీ నరసాపురం అధ్యక్షురాలు 


Updated Date - 2022-01-27T06:30:21+05:30 IST