Abn logo
Oct 23 2021 @ 00:52AM

యూపీని విభజిస్తేనే సమాఖ్యకు బలం

ఒక సమాఖ్య రాజ్యంలోని అన్ని భాగాలకూ సమ ప్రాధాన్యం ఉండాలి. భారత్‌లో వైశాల్యంలోనూ, జనాభాపరంగానూ అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం’ సభ్యుడు కె ఎమ్ పణిక్కర్ 1955లోనే ప్రతిపాదించారు. డాక్టర్ అంబేడ్కర్ ఆ సూచనను సమర్థించారు. 2011లో మాయావతి యూపీని పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమ్‌ప్రదేశ్ అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసనసభలో ఆమోదింప చేశారు.


ఆధునిక భారతదేశ భౌగోళికపట నిర్మాత ఒక తెలుగువాడు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైన తరువాత మిగతా భాషాబృందాల వారు కూడా ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేశారు. భాషాప్రయుక్త సూత్ర ప్రాతిపదికన రాష్ట్రాల సరిహద్దులను పునఃనిర్ణయించడం కోసం ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం’ (ఎస్‌ఆర్‌సి)ను భారత ప్రభుత్వం నియమించింది. ఈ సంఘం నివేదిక ప్రకారం 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమయింది. 


త్రిసభ్య ఎస్‌ఆర్‌సికి చైర్మన్ న్యాయకోవిదుడు ఎస్ ఫజ్ల్ అలీ కాగా చరిత్రకారుడు కె ఎమ్ పణిక్కర్, సామాజిక కార్యకర్త హృదయనాథ్ కుంజ్రూ అందులోని ఇతర సభ్యులు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ (యూపీ)ను మూడు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించాలని పణిక్కర్ చేసిన సూచన ఆ చరిత్రాత్మక నివేదికలోని ఒక అవిస్మరణీయమైన విశేషం. వైశాల్యంలోనూ, జనాభాపరంగా అనేక ఇతర రాష్ట్రాలను మొత్తంగా తీసుకున్నా కూడా వాటిని మించినన అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జాతీయ రాజకీయాలపై అసమప్రభావాన్ని చూపుతున్న ఆ బృహత్ అస్తిత్వంలో భారత్ సమైక్యత భవిష్యత్తుకు చేటు కలిగించే అజ్ఞాత దుశ్శకునాలు ఉన్నాయని పణిక్కర్ భావించారు. 


ఒక సమాఖ్య విజయవంతంగా పని చేయాలంటే అందులోని అన్ని భాగాల మధ్య ఒక సమతుల్యత ఉండి తీరాలి. వాటి మధ్య వ్యత్యాసాలు గణనీయమైన స్థాయిలో ఉంటే పరస్పర అనుమానాలు తలెత్తుతాయి. అవి, అంతిమంగా సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరిచి దేశ సమైక్యతకు ముప్పు కలిగిస్తాయని’ పణిక్కర్ వాదించారు. ‘సమాఖ్యలోని పెద్ద విభాగం తన ప్రాబల్యాన్ని దుర్వినియోగపరిచేందుకు అవకాశముంది. ఇతర భాగస్వాములు దాని ఆధిపత్యాన్ని తప్పక నిరసిస్తాయి. ఆధునిక ప్రభుత్వాలను చాలవరకు పార్టీ యంత్రాంగాలే నియంత్రిస్తున్నాయి. సంఖ్యాబలం గల బృందం తన అభీష్టాన్నే నెరవేర్చుకోవడం అనేక ప్రతికూల పర్యవసానాలకు కారణమవుతుంద’ని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వాదనను కొనసాగిస్తూ ‘అత్యధిక రాజకీయ ప్రభావాన్ని చూపగలిగే ప్రాబల్య స్థానాన్ని సమాఖ్య లోని ఏ ఒక్క భాగానికయినా ఇవ్వడం ఎంతవరకు సబబు’ అని ఆయన ప్రశ్నించారు. 

పణిక్కర్ వాదనలో ఆచరణీయ దృక్పథం, దూరదృష్టి ఉన్నాయి. అన్ని భాగాల మధ్య సమానత్వముండాలన్న సమాఖ్య సూత్రాన్ని పాటించకపోవడం వల్ల ఉత్తరప్రదేశ్ వెలుపల అన్ని రాష్ట్రాలలోనూ అవిశ్వాసం, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్న సత్యాన్ని పణిక్కర్ 1955లోనే గుర్తించారు. దక్షిణాది రాష్ట్రాలలోనే కాదు పంజాబ్, బెంగాల్, అస్సోం మొదలైన రాష్ట్రాలు కూడా జాతీయ వ్యవహారాలలో ఉత్తరప్రదేశ్ నెరపుతున్న అపరిమిత, అనుచిత ప్రభావాన్ని నిరసిస్తున్నాయనే విషయాన్ని ఎస్‌ఆర్‌సి నమోదు చేసింది. 


మరి ఈ అసమతౌల్యాన్ని సరిదిద్దడం ఎలా? బిస్మార్క్ కాలం నాటి జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని పణిక్కర్ సూచించారు. 1871లో సమైక్య జర్మనీ ఆవిర్భవించినప్పుడు జనాభారీత్యా, ఆర్థికశక్తి పరంగా ప్రష్యాకు తిరుగులేని ప్రాబల్యముండేది. అయితే జాతీయ శాసనసభలో ప్రష్యాకు జనాభా సంఖ్యకు అనుగుణంగా కాకుండా తక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించారు. సమైక్య జర్మనీలో ప్రష్యాకు అనుచిత ప్రాబల్యముండబోదని జనాభా తక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాలకు భరోసా ఇచ్చేందుకే పార్లమెంటులో ప్రష్యా ప్రాతినిధ్యాన్ని తగ్గించారు. అలాగే అమెరికాలో అన్ని విధాల పెద్ద రాష్ట్రమైన క్యాలిఫోర్నియా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు సెనేట్ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క రాష్ట్రానికీ రెండు సీట్లు కేటాయించడాన్ని కూడా పణిక్కర్ పేర్కొన్నారు. 


అయితే భారత రాజ్యాంగం ఈ పూర్వోదాహరణలను పరిగణనలోకి తీసుకోలేదు. జనాభాకు అనుగుణమైన ప్రాతినిధ్యాన్నే అంగీకరించింది. ఈ ప్రజాప్రాతినిధ్య సూత్రం ప్రకారం 1952లో లోక్‌సభకు ఎన్నికైన 499 మందిలో 86 మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన వారే (2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఏర్పడిన తరువాత లోక్‌సభలోని 543 సీట్లలో 80 ఉత్తరప్రదేశ్‌వే). దేశపాలన, జాతీయ విధానాల రూపకల్పనలో లోక్‌సభ ప్రాధాన్యం దృష్ట్యా ఆ వ్యవహారాలపై యూపీ ప్రభావం అత్యధికంగా ఉంటుందనేది స్పష్టం. అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం లభించాలంటే యూపీని విభజించాల్సిందేనని పణిక్కర్ ఖండితంగా చెప్పారు.


ఉత్తరప్రదేశ్ ను రెండుగా విభజించి మీరట్, ఆగ్రా, రోహిలాఖండ్, ఝాన్సీ డివిజన్లతో కొత్త ఆగ్రా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అయితే ఎస్‌ఆర్‌సిలోని ఇతర సభ్యులు పణిక్కర్‌తో ఏకీభవించలేదు. పాలకపక్షమైన కాంగ్రెస్‌కు కూడా ఉత్తరప్రదేశ్‌ను విభజించాల్సిన అవసరమేమీ కన్పించలేదు. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో యూపీ కీలకపాత్ర వహించింది. తత్కారణంగానే 1955లో కూడా ఆ పార్టీ నిర్ణయాలు, వ్యవహారాలను యూపీ రాజకీయాలే అమితంగా ప్రభావితం చేశాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఎస్‌ఆర్‌సి నివేదిక తొలి పాఠకులలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఒకరు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ప్రతిస్పందనను వివరిస్తూ 1955 డిసెంబర్‌లో ప్రచురించిన ఒక చిన్న పుస్తకంలో ఉత్తరప్రదేశ్‌ను విభజించాలన్న పణిక్కర్ వాదనతో ఆయన ఏకీభవించారు. యూపీని, పణిక్కర్ సూచించిన విధంగా రెండు రాష్ట్రాలుగా కాకుండా మూడు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించాలని ఆయన ప్రతిపాదించారు. కొత్త రాష్ట్రాలకు మీరట్ , కాన్పూర్, అలహాబాద్ రాజధానులుగా ఉండాలని ఆయన సూచించారు. అంబేడ్కర్ ప్రతిపాదనపై కేంద్రప్రభుత్వం సంపూర్ణ మౌనం వహించింది. 


ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని పణిక్కర్, అంబేడ్కర్‌లు స్పష్టంగా సూచించిన ఐదున్నర దశాబ్దాల అనంతరం మాయావతి ఆ మేరకు ఒక కొత్త ప్రతిపాదన చేశారు. 2011లో మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమ్‌ప్రదేశ్ అనే నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలనే తీర్మానం ఒకదాన్ని ఆ రాష్ట్ర శాసనసభలో ఆమోదింప చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ గానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గానీ ఆ ప్రతిపాదనను యోగ్యమైనదిగా భావించలేదు.


పలు అభివృద్ధి సూచీలలో యూపీ, మిగతా రాష్ట్రాల కంటే చాలా దిగువస్థానంలో ఉందనేది ఒక వాస్తవం. ఆర్థికంగానే కాదు, సామాజికంగా కూడా అది బాగా వెనుకబడిన రాష్ట్రంగాఉంది. మెజారిటీవాద పాలనకు ప్రాధాన్యమివ్వాలన్న రాజకీయ సంస్కృతి ప్రబలిపోవడం కూడా యూపీ వెనుకబాటుతనానికి ఒక ప్రధాన కారణమని చెప్పక తప్పదు. పితృస్వామ్య వ్యవస్థ సంప్రదాయాల ప్రభావం బలీయంగా ఉండడం యూపీ వెనుకబాటుకు రెండో ప్రధాన కారణం. మూడో కారణం జనాభా పరిమాణం. ఇరవై కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్న రాష్ట్రమది. ప్రపంచంలో ఐదు దేశాలు మినహా మరే దేశంలోనూ అంత జనాభా లేరన్నది గమనార్హమైన వాస్తవం. 


2017 ఫిబ్రవరిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తూ ఒక జాతీయ దినపత్రికలో నేను వ్యసం రాశాను. ‘‘యూపీ లోని ‘యు’ అనే అక్షరం ‘ఉత్తర్’ అనే ప్రాదేశితకతను సూచిస్తుంది. అయితే ఇది అపప్రయోగం. దానికి ఉత్తరంగా ఇంకా పలు భారతీయ రాష్ట్రాలు ఉన్నాయి కదా. యూపీ లోని ‘యు’ అనే అక్షరం వాస్తవంగా ‘అన్ గవర్నబుల్’ (పాలనా దుస్సాధ్యత) ను సూచిస్తుంది. ప్రస్తుత ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినప్పటికీ యూపీకి ఆ హోదాలో ఎటువంటి మార్పు ఉండబోదు. రోగగ్రస్త యూపీని ఆరోగ్యకరమైన యూపీగా మార్చాలంటే దాన్ని మూడు లేదా నాలుగు స్వపరిపాలనా ప్రాంతాలుగా విభజించి తీరాలి’’ అని అందులో పేర్కొన్నారు. 


భారత్ శ్రేయస్సు దృష్ట్యా, మరీ ముఖ్యంగా యూపీ ప్రజల అభ్యున్నతి కోసం ఆ రాష్ట్రాన్ని మూడు లేదా నాలుగు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించాలి. శోచనీయమైన విషయమేమిటంటే ఇటువంటి మార్పు సంభవించేందుకు చాలా స్వల్ప అవకాశం మాత్రమే ఉంది. నరేంద్ర మోదీ, ఆయన పార్టీకి సుపరిపాలన కంటే అధికారాన్ని స్వాయత్తం చేసుకుని, దాన్ని నిలబెట్టుకోవడమే అత్యంత ముఖ్య విషయమై పోయింది. గత రెండు సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ఆ రాష్ట్రంలో వరుసగా 71, 62 స్థానాలను గెలుచుకున్నది. లోక్‌సభలో పూర్తి మెజారిటీని సమకూర్చుకోవడంలో బీజేపీకి ఆస్థానాలు విశేషంగా తోడ్పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో తమ వైఫల్యాలను 2024 సార్వత్రక ఎన్నికల నాటికి ప్రజలు మరచిపోతారని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రాతిపదికన హిందూత్వ ఎజెండాతో పాటు ముస్లిం జనాభా పెరుగుదల గురించిన భయాలు హిందూ ఓటర్లు తమ వైపు మొగ్గేలా చేస్తాయని, యూపీలోని అత్యధిక స్థానాలు తమకే దక్కుతాయని బీజేపీ విశ్వసిస్తోంది. 


అవిభాజ్య ఉత్తరప్రదేశ్ పాలనా దుస్సాధ్యతతో వెనుకబడిన రాష్ట్రంగా కొనసాగుతూ విశాల భారతదేశ పురోగతికి అవరోధమవుతూనే ఉంటుంది. యూపీ భవిష్యత్తు, తద్వారా భారత్ భవిత ప్రస్తుతం ఒక వ్యక్తి, ఆయన పార్టీ రాజకీయ ఆకాంక్షలకు బందీగా ఉన్నాయి.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)


ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...