Abn logo
Jul 29 2021 @ 01:20AM

దేహశుద్ధి తప్పదు అని హెచ్చరించిన వారంలోగానే..

సాయంత్రం 5.43కి కొండపల్లి ఫారెస్టు నుంచి ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉమ

కారులోనే ఉమ

వైసీపీ నేత కారు డ్రైవర్‌ను వెతికి మరీ ఎలా తిట్టారో!

సాయంత్రం 6.30కి మునగపాడు సమీపంలోనే ఉమ

5.40కి తనను తిట్టారని కారు డ్రైవర్‌ ఫిర్యాదు

విపక్షాలను నోరెత్తకుండా చేసేందుకే ఎస్సీ, ఎస్టీ అస్త్రం


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): అధికారపక్ష నేతల అవినీతిని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల అస్త్రాన్ని ప్రయోగించడం వైసీపీ నాయకులకు పరిపాటి అయిందనేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్బంధమే తాజా నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం సమీపంలో ఉన్న కొండపల్లి రక్షిత అటవీప్రాంతానికి వెళ్లారు. గడ్డమణుగు నుంచి సుమారు ఐదు కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన ఉమ అక్కడి నుంచే సుమారు పావుగంటకుపైగా ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం 5.43కు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉన్న ఉమ విలేకరులతో మాట్లాడటం పూర్తయ్యేసరికి ఆరు గంటలైంది.


అనంతరం అక్కడి నుంచి కొండపల్లి వెళ్లేందుకు బయలుదేరారు. ఈలోగా కొందరు పోలీసులు అక్కడికి చేరుకుని, ఉమను గడ్డమణుగు మీదుగా వెళ్లాలని సూచించారు. గడ్డమణుగు నుంచి మునగపాడు వైపు వస్తున్న కారు చెరువు మాధవరం రైల్వే క్రాసింగ్‌ వద్దకు చేరుకునే సరికి మళ్లీ పోలీసులు అక్కడి నుంచి మునగపాడు బైపాస్‌ వైపు మళ్లించారు. అప్పటికే సమయం సాయంత్రం 6.30 దాటిపోయింది. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు దేవినేని ఉమ కారుపై రాళ్ల దాడి మొదలుపెట్టారు. ఆ సమయంలోనే వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ అక్కడికి చేరుకుని ఉమను దూషించడం ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతుండటంతో టీడీపీ కార్యకర్తలు ఉమకు రక్షణగా నిలిచి ఆయనను కారులో నుంచి దిగనివ్వలేదు. జరిగింది ఇది కాగా..


దేవినేని ఉమ తనను కులం పేరుతో దూషించారని దుర్గాప్రసాద్‌ కారు డ్రైవర్‌తో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. సాయంత్రం 5.40 గంటల ప్రాంతంలో తనను ఉమ తిట్టారని డ్రైవర్‌ సురేశ్‌ ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో ఉమ కొండపల్లి అటవీప్రాంతంలోనే ఉన్నారు. దాడి జరిగిన ప్రాంతంలోనూ ఆయన కారు దిగలేదు. మరి డ్రైవర్‌ను ఎలా తిట్టారు?.. కేవలం ప్రశ్నించే విపక్షాల గొంతును అణచివేసే ఉద్దేశంతోనే ఇలా చేశారనేది స్పష్టమవుతోందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. 


వైసీపీ నేత కారు అద్దాలు ఎలా పగిలాయి..!

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో వైసీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్‌ ఉమకు రక్షణగా వచ్చిన గౌడ కులస్తులను పరుష పదజాలంతో దూషించారు. దీంతో వారు జి.కొండూరు పోలీసుస్టేషన్‌ వద్ద ఆయన కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. వాస్తవానికి కులం పేరుతో దూషించింది దుర్గాప్రసాద్‌. కానీ ఆయనే ఉమ తన డ్రైవర్‌ను తిట్టారంటూ కేసు బనాయించారు. 


ఎమ్మెల్యే హెచ్చరించిన వారంలోగానే..

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఈ నెల 21న ఇబ్రహీంపట్నంలోని వైసీపీ ఆఫీసులో మాట్లాడుతూ.. ‘మితిమీరి మాట్లాడితే నీకు దేహశుద్ధి తప్పదు ఉమామహేశ్వరరావ్‌’ అని హెచ్చరించారు. ఇది జరిగి వారం కూడా గడవక ముందే ఆయన హెచ్చరించినట్టే మాజీ మంత్రిపై ఎమ్మెల్యే మనుషులు దాడికి తెగబడి, అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు. 

సాయంత్రం 5.40కి మునగపాడు వద్ద తనను కులం పేరుతో దూషించారని సురేశ్‌ పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు