Abn logo
Jul 8 2020 @ 15:38PM

తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: మాజీ మంత్రి దేవినేని ఉమ

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించేందుకు మంగళవారం ఆయన కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసులతో కలిసి వచ్చారు. కొల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను కోరగా వారు కరోనా కేసుల నేపథ్యంలో ములాఖత్‌కు నిరాకరించారు.


జైలు అధికారుల తీరును వ్యతిరేకిస్తూ వారంతా జైలు గేటు వద్ద ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని విలేకరులతో  మాట్లాడుతూ అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్రలను అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారన్నారు. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపైనా తప్పుడు కేసులు బనాయించార న్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని... కొల్లును, అచ్చెన్నను న్యాయంగానే బయటకు తెచ్చుకుంటామని, వారి నిర్దోషిత్వాలను నిరూపి స్తామన్నారు.


పోలవరం ప్రాజెక్టుకు ప్రోగ్రెస్‌ రిపోర్టును తమ హయాంలో ఆన్‌లైన్‌లో పెట్టామని, అంతా పారదర్శకంగా చేశామన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ తెలియట్లేదన్నారు. పేదలకు ఇళ్ల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూమిల్లో మట్టిని తరలిస్తూ దోచేస్తున్నారన్నారు.

Advertisement
Advertisement
Advertisement